GHMC: హైదరాబాద్‌లో వీధికుక్కల నివారణకు హైలెవల్‌ కమిటీ

ABN , First Publish Date - 2023-03-03T21:15:08+05:30 IST

హైదరాబాద్‌లో వీధికుక్కల నివారణకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైలెవల్‌ కమిటీని (High Level Committee) ఏర్పాటు చేసింది.

GHMC: హైదరాబాద్‌లో వీధికుక్కల నివారణకు హైలెవల్‌ కమిటీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వీధికుక్కల నివారణకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైలెవల్‌ కమిటీని (High Level Committee) ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌ అధ్యక్షతన కార్పొరేటర్లు, అధికారులతో కమిటీని నియమిస్తున్నట్లు సర్కారు పేర్కొంది. GHMC పరిధిలో యానిమల్‌ కేర్‌ సెంటర్లను పరిశీలించనున్నారు. అవసరమైన సూచనలు, సలహాలతో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఇటీవల హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ నుంచి మేయర్ విజయలక్ష్మి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే కార్పొరేటర్ల ఒకనెల జీతం రూ.2 లక్షలతో కలిపి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. వీధికుక్కల నివారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. బాలుడు మృతిచెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది.

రాష్ట్రంలో వీధికుక్కల దాడులు ఆగడం లేదు. ఇటీవలే ఓ నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి, చంపేసిన ఘటనతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. నగరంతో పాటు పలు జిల్లాల్లో ఆ తరహా వీధికుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో బుధవారం ఓ వీధికుక్క రెచ్చిపోయింది. దారిన వెళ్తున్న ఆరుగురిపై దాడి చేసింది. కొంపల్లి మునిసిపల్‌ కార్యాలయం సమీపంలో సాయంత్రం రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న డి.శివానీ(16), క్రాంతి(10), బాపూరావు(50), ఏ.మీనాక్షి(20), వి.దుర్గ(27), ప్రీతి(25)పై దాడిచేసి, గాయపర్చింది. దీంతో వారందరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

వరంగల్‌లో ఓ బాలుడు, మహబూబాబాద్‌లో ఓ వృద్ధురాలిపై వీధికుక్కలు దాడిచేశాయి. హైదరాబాద్‌లో నివాసముంటున్న బండారి ఆమని-మనోజ్‌ దంపతులకు ఏడేళ్ల కుమారుడు రోహిత్‌ ఉన్నాడు. ఆమని తమ్ముడు సందీప్‌ పెళ్లి పనుల కోసం వారు వరంగల్‌లోని కాశీబుగ్గకు వచ్చారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో రోహిత్‌ ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ కుక్క అతడిపై దాడి చేసింది. బాలుడి అరుపులతో వారంతా ఇంట్లో నుంచి బయటకు రావడంతో కుక్క అతడిని వదిలిపెట్టి పారిపోయింది. రోహిత్‌ ముఖంపై గాయాలై, రక్తం కారుతుండగా వెంటనే అతడిని చికిత్స కోసం ఎజీఎం ఆస్పత్రికి తరలించారు. అలాగే మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శీలం రమాబాయి(65) ఆరుబయట కూర్చొని ఉండగా ఆమెపై వీధి కుక్కలు దాడిచేశాయి. వెంటనే ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ఆమె కోడలు శీలం స్వాతి వచ్చి, కుక్కలను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా... ఆమెపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో రమాబాయి ముక్కుకు తీవ్రగాయం కాగా, స్వాతి చేతి వేళ్లకు గాయాలయ్యాయి.

Updated Date - 2023-03-03T21:15:23+05:30 IST