ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: వరదలపై రచ్చరచ్చ

ABN, First Publish Date - 2023-08-05T03:04:44+05:30

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains)కు సంభవించిన వరదల( floods)పై అసెంబ్లీ(Assembly)లో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది.

అసెంబ్లీలో శ్రీధర్‌బాబు వర్సెస్‌ మంత్రులు!

రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం

పరిహారానికి 1,500 కోట్లు అవసరమవుతాయి

ప్రభుత్వ సాయం ఎందుకూ సరిపోదు: శ్రీధర్‌బాబు

3గంటల కరెంటే కాంగ్రెస్‌ విధానమా?: కేటీఆర్‌

చెక్‌డ్యామ్‌లు వద్దనడం విడ్డూరం: హరీశ్‌రావు

అనని మాటలను ఆపాదిస్తున్నారన్న దుద్దిళ్ల

వర్షాలు, వరదలకు 139 గ్రామాలు దెబ్బతిన్నాయి

419 ఇళ్లు కూలాయి.. 44 మంది మృతి: వేముల

విద్యారంగ సమస్యలపై భట్టి, హరీశ్‌ వాగ్వాదం

గవర్నర్‌ తిప్పిపంపిన 4 బిల్లులకు మళ్లీ ఆమోదం

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains)కు సంభవించిన వరదల(
floods)పై అసెంబ్లీ(Assembly)లో శుక్రవారం వాడివేడి చర్చ జరిగింది. వరదల కారణంగా జరిగిన పంటనష్టాన్ని కాంగ్రెస్‌(Congress) సభ్యుడు డి.శ్రీధర్‌బాబు(Sridhar Babu) సభ దృష్టికి తీసుకురాగా.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఉచిత విద్యుత్తు(Free electricity) అంశాన్ని తెరపైకి తెచ్చారు. పీసీసీ అధ్యక్షుడు 3గంటల ఉచిత విద్యుత్తు చాలునన్నారని ప్రస్తావించారు. అయితే పంటనష్టంపై చర్చ పెట్టి.. మంత్రులు ఉచిత విద్యుత్తుపై మాట్లాడటమేంటని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. దీంతో ఈ అంశంపై చర్చ రచ్చరచ్చ అయింది. మరోవైపు విద్య, వైద్య రంగాలపై లఘు చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వరదలపై శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని, 50 మందికి పైగా మృతి చెందారని, 3వేల ఇళ్లు కూలిపోయాయని అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, 15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని తెలిపారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున వేసుకున్నా.. రూ.1,500 కోట్ల పంటనష్టం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ తక్షణ సాయం కింద ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మూలకూ సరిపోవన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకొని.. శ్రీధర్‌బాబు గాలిమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారని, ఇంకా లెక్కలు పూర్తిగా తేలకముందే ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. రైతులకు 3గంటల ఉచిత విద్యుత్తు చాలునంటూ పీసీసీ అధ్యక్షుడు అమెరికాలో వ్యాఖ్యలు చేశారని, శ్రీఽధర్‌బాబు సుద్దులు చెప్పేముందు వాళ్ల పార్టీ విధానమేంటో చెప్పాలని అన్నారు.

చెక్‌డ్యామ్‌లపై తప్పుడు మాటలు..

చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా చేపట్టలేదని, పొలాల్లో ఇసుక మేటలు వేయడానికి చెక్‌డ్యామ్‌ల నిర్మాణం లోపభూయిష్టంగా జరగడమే కారణంగా కనిపిస్తోందని, దీనిపై పరిశీలన చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెప్పగా.. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నాయకుల వైఖరి విచిత్రంగా ఉంది. వారి అధ్యక్షుడేమో 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటారు. శ్రీధర్‌భాబు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వద్దంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శ్రీధర్‌బాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఉచిత విద్యుత్తుపై చర్చ పెడితే మాట్లాడటానికి తాము సిద్ధమని, వరదలపై చర్చ పెట్టి.. మంత్రులు ఉచిత విద్యుత్తుపై మాట్లాడటమేంటని ప్రశ్నించారు. విద్యుత్తుపై చర్చకు హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. శాస్త్రీయంగా లేని చెక్‌డ్యామ్‌లను పరిశీలించాలని తాను అంటే.. చెక్‌డ్యామ్‌లే అవసరంలేదన్నానంటూ అధికార బలంతో మంత్రులు తాను అనని మాటలను ఆపాదిస్తున్నారని తప్పుబట్టారు. పంటల బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలేదని, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం రావడంలేదని తెలిపారు. ఇళ్లు కోల్పోయినవారికి డబుల్‌ బెడ్‌రూం ఇంటితోపాటు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘మీకు సమయం లేదు.. మూడు, నాలుగు నెలలే ఉంది. మేం అధికారంలోకి రాగానే అన్ని పనులు పక్కాగా చేస్తాం’’ అని శ్రీధర్‌బాబు అన్నారు. వరదలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. వర్షాలు, వరదల వల్ల 139 గ్రామాలు దెబ్బతిన్నాయని, 419 ఇళ్లు పూర్తిగా, 7505 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయని తెలిపారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో నిర్మిస్తామని, పాక్షికంగా కూలిన ఇళ్లకు తగు సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 44 మంది మృతి చెందారని, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయం అందజేస్తామని అన్నారు.


కేంద్రం తెలంగాణకు సహాయం చేయడంలేదు..!

విపత్తులు సంభవించినప్పుడు ఇతర రాష్ట్రాలకు తక్షణ సహాయం అందించే కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మాత్రం ఎలాంటి సహాయం చేయడం లేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాగా, వరదలు, పంటనష్టంపై లఘు చర్చ సమయంలో.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా స్పీకర్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో మైక్‌ లేకుండానే భట్టి మాట్లాడారు. ఈ సందర్భంలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకోవటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఉచిత కరెంటుపై చర్చ పెడితే... తాము రెడీగా ఉన్నామని భట్టి అన్నారు. మూడు గంటల విద్యుత్తు ఇస్తామని ఎవరూ అనలేదని, మంత్రులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాగా, తెలంగాణలో మూడేళ్లుగా పంటల బీమా పథకం అమలులో లేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా పథకంతో రైతులకు న్యాయం చేకూరడం లేదన్న కారణంగానే ఆ పథకం నుంచి వైదొలగామన్నారు.

ఆ నాలుగు బిల్లులకు సభలో మళ్లీ ఆమోదం

రాష్ట్ర శాసనసభ శుక్రవారం తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ్‌స(ఎస్టాబ్లి్‌షమెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్‌ చట్టం సవరణ బిల్లు, భద్రాచలంను మూడు గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేస్తూ రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌ ఆఫ్‌ ఏజ్‌ సూపరాన్యుయేషన్‌ బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులను శాసనసభ గతంలోనే ఆమోదించి గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం.. వీటిపై వివరణలు కోరుతూ ఆమె తిప్పి పంపారు. దీంతో నాలుగు బిల్లులపై శాసనసభ శుక్రవారం మారోమారు చర్చించి ఆమోదించింది.

భట్టి గీ హరీశ్‌

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మంత్రి హరీశ్‌రావు మధ్య శుక్రవారం అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. విద్య, వైద్య రంగాలపై చేపట్టిన లఘు చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయిస్తోందని, 2014-15 బడ్జెట్‌లో 10.89 శాతం నిధులను కేటాయించగా... 2022-23 సంవత్సరం వచ్చేసరికి అది 6.24 శాతానికి తగ్గిపోయిందని అన్నారు. పాఠశాలల్లో నీరు, టాయిలెట్‌ సౌకర్యాలు లేవని, భవన నిర్మాణాలు చేపట్టడం లేదని విమర్శించారు. దీనిపై హరీశ్‌రావు కల్పించుకుని ఒక్క విద్యాశాఖకు కేటాయించిన నిధులనే చూడొద్దని, అన్ని శాఖల్లోని విద్యా విషయాలకు పెడుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల కింద గురుకుల పాఠశాలలకు పెడుతున్న ఖర్చును కూడా విద్యా రంగ వ్యయంగానే పరిగణించాలన్నారు. తప్పుడు లెక్కలు చెప్పి, భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై భట్టి లేచి మాట్లాడబోతుండగా.. ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. దీంతో ‘‘నా సమయాన్ని మంత్రి వినియోగించుకుంటుంటే సభను నడపడం ఎందుకు?’’ భట్టి ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులున్నారని, కేవలం 7 లక్షల మందికి గురుకుల పాఠశాలల్లో సన్నబియ్యం, కోడిగుడ్డు, చికెన్‌తో భోజనం పెడుతున్నామంటూ మంత్రి చెబుతున్నారని, మరి మిగతా విద్యార్థుల సంగతేమిటని ప్రశ్నించారు. 700 స్కూళ్లకు సొంత భవనాలు లేవన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కల్పించుకుని తాము భవనాలు నిర్మిస్తున్నామని చెప్పడంతో ‘‘ఇంకెక్కడ నిర్మిస్తారు? మీ టర్మ్‌ అయిపోయింది.. రెండు నెలలు గడిస్తే దిగిపోతారు. అధికారంలోకి వచ్చేది మేమే. అన్ని భవన నిర్మాణాలను పూర్తి చేస్తాం.. సకల సౌకర్యాలు కల్పిస్తాం’’ అని భట్టి అన్నారు. ప్రైవేటు కార్పొరేట్‌ స్కూళ్లపై నియంత్రణ లేదని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతలో.. భట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే తమ సభ్యులను నిలువరించడం సాధ్యం కాదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దీంతో మంత్రి కొడతామన్నట్లుగా బెదిరిస్తున్నారని భట్టి ఘాటుగా స్పందించారు. తమను కొట్టినా ప్రజల కోసం మాట్లాడుతామన్నారు.

Updated Date - 2023-08-05T04:48:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising