Mallu Ravi: ఆ శాఖల వేధింపులు పెరిగిపోయాయి: మల్లు రవి

ABN , First Publish Date - 2023-06-04T16:52:38+05:30 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫర్ చేంజ్ ఎండ, వానలు లెక్కచేయకుండా 900 కిలోమీటర్ల పైగా కొనసాడం అభినందనీయమని...

Mallu Ravi: ఆ శాఖల వేధింపులు పెరిగిపోయాయి: మల్లు రవి

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫర్ చేంజ్ ఎండ, వానలు లెక్కచేయకుండా 900 కిలోమీటర్ల పైగా కొనసాడం అభినందనీయమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి (Mallu Ravi) అన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చకుండా విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రజలకున్న ఆగ్రహాన్ని ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా బయటకు వెళ్లగకుతున్నారని చెప్పారు. కుల, మత ప్రాంతాలకతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వ బాధితులు ఏకమై మార్పు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని, కానీ వీరు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందారుల పాలనల్లో అణచివేతకు గురవుతున్న ప్రజలు తిరుగుబాటు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలో గెలిపించడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రశ్నించే అవకాశం లేకుండా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకల పట్ల పోలీసు, రెవెన్యూ శాఖల వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఇటువంటి క్రమంలో విదేశాలకు వెళ్లి వచ్చిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని జ్యోతిష్యం చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు వచ్చి ప్రజలు కోరుకుంటున్న మార్పును గమనించి శాస్త్రీయంగా చెబుతున్నామన్నారు. మేధావుల్లో రాజకీయ పునరేకీకరణ మార్పు కోసం జరగాలని ఆయన సూచించారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది కేటీఆర్‌లు వచ్చి అడ్డుపడిన ప్రభుత్వం మార్పు అనేది అనివార్యంగా జరుగుతుందన్నారు.

Updated Date - 2023-06-04T16:52:38+05:30 IST