Hanumantha Rao: ప్రధాని మోదీకి ఆ రాజకీయాలే ఎక్కువయ్యాయి
ABN, First Publish Date - 2023-10-01T17:39:05+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పేరుకే బీసీ అంటారు తప్ప, ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు(V Hanumantha Rao) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పేరుకే బీసీ అంటారు తప్ప, ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు(V Hanumantha Rao) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ బీసీ నేతలు వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నమాట నిజమే. మధుయాష్కీ సహా మా బీసీ నేతల్లో కొందరు ఖర్గేను కలిశారు. నేను నిన్న కేసీ వేణుగోపాల్‌ను కలిశాను. కుల గణన చేయాలన్న డిమాండ్‌ను రాహుల్ గాంధీ చేస్తున్నారు. షాద్‌నగర్‌లో బీసీ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తున్నారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్ కూడా ఉంటుంది. బీసీ జనాభా రాష్ట్రంలో, దేశంలో సగం కంటే ఎక్కువగా ఉన్నాం. బీసీలకు న్యాయం జరుగుతుందన్న అశతో ఉన్నాం. కాంగ్రెస్ అధిస్ఠానం పెద్దలు మమ్మల్ని గ్రూపుగా రావొద్దు అని చెప్పారు. విడిగా కొందరికి కలిసే అవకాశం ఇచ్చారు. బీసీలకు కనీసం 34 సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉంది’’ అని వి.హనుమంతురావు పేర్కొన్నారు.
అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు
‘‘మణిపూర్‌లో గిరిజనుల మధ్య ఘర్షణలతో అతలాకుతలం అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. మణిపూర్‌లో ఉన్నది బీజేపీ సర్కారు. అందుకే ఇంత జరుగుతున్నా రాష్ట్రపతి పాలన పెట్టడం లేదు. బహిరంగంగా ఎన్నో ఆకృత్యాలు అక్కడ జరుగుతున్నాయి. చిత్తశుద్ధి ఉంటే అక్కడి పరిస్థితి చక్కదిద్దండి. మహిళా బిల్లు తెచ్చా అంటున్నారు. కానీ మణిపూర్‌లో మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు. ప్రధాని మోదీకి రాజకీయాలే ఎక్కువయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పోస్టర్లతో నింపేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మీ పోస్టర్‌లు ఎన్నైనా పెట్టుకుంటారు. కానీ ఇతరులు పెడితే చింపేస్తున్నారు’’ అని వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-01T17:39:05+05:30 IST