Share News

తెలంగాణలో జనసేన పోటీ

ABN , First Publish Date - 2023-11-05T03:06:21+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 8 సీట్లు కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం.

తెలంగాణలో జనసేన పోటీ

బీజేపీతో పొత్తు.. 8 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు.. మరో రెండు సీట్లపై కసరత్తు

పవన్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సమావేశం.. 7న మోదీ సభలో పాల్గొనాలని ఆహ్వానం

హైదరాబాద్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 8 సీట్లు కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేనకు ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్‌కర్నూల్‌, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ శనివారం రాత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పవన్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని.. దీనికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు.

మోదీ సభలో పాల్గొంటా.. పవన్‌

ఈ నెల ప్రధాని మోదీ సభలో పాల్గొంటానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీతో చర్చలు జరిపామని.. తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తున్నామని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆ పార్టీతో చర్చలు తుది దశకు వచ్చాయని, రెండు స్థానాల విషయమై తేలాల్సి ఉందన్నారు. మరోసారి సమావేశమై భేటీ అవుతామని పేర్కొన్నారు.

పోటీ చేయనున్న అభ్యర్థులు వీరే..

నేమూరి వీరేశంగౌడ్‌ (కూకట్‌పల్లి), మేకల సతీష్‌రెడ్డి (కోదాడ), కిశోర్‌కుమార్‌రెడ్డి (తాండూర్‌), సంపత్‌ నాయక్‌ (వైరా), లక్ష్మణ్‌గౌడ్‌(నాగర్‌కర్నూల్‌), మిరియాల రామకృష్ణ (ఖమ్మం), మహేంద్రనాయక్‌ (అశ్వారావుపేట), వేముల కార్తీక్‌ (కొత్తగూడెం). కాగా, మల్కాజ్‌గిరి, నాంపల్లి స్థానాలకు అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది.

Updated Date - 2023-11-05T03:06:33+05:30 IST