Nalgonda: కోర్సు తెలియని నర్సులు
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:46 AM
అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీ. ఆ కళాశాలలో విద్యార్థులు కేవలం అడ్మిషన్ల సమయంలోనే కనిపిస్తారు. మళ్లీ పరీక్షల నాటికి వచ్చి కాలేజీలో వాలిపోతారు.

సూది వేయలేరు.. కట్టు కట్టలేరు.. మిథ్యగా ప్రైవేటు నర్సింగ్ విద్య
అధ్యాపకులుండరు, వసతులూ కరువే
పరీక్షలు, ప్రాక్టికల్స్ తూతూ మంత్రం
ప్రైవేటు నర్సింగ్ కాలేజీల ఇష్టారాజ్యం
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే కొన్ని సంస్థలు
హైదరాబాద్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): అది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీ. ఆ కళాశాలలో విద్యార్థులు కేవలం అడ్మిషన్ల సమయంలోనే కనిపిస్తారు. మళ్లీ పరీక్షల నాటికి వచ్చి కాలేజీలో వాలిపోతారు. ఇలా పరీక్ష రాసి.. అలా వెళ్లిపోతారు. ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులకు అర్హత లేని వారితోనే చదువులు చెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని మెహదీపట్నం పరిసర ప్రాంతంలో ఉండే ఓ నర్సింగ్ కాలేజీ తీరు మరీ దారుణం. అక్కడి పరిస్థితులు, వసూలు చేస్తున్న ఫీజులపై నర్సింగ్ విద్యార్థులంతా వెళ్లి గతేడాది డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల ప్రాంగణ భవనంలో రెండు కాలేజీలు నడుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం అక్కడ ఒకటే కాలేజీ ఉండాలి. మరో కాలేజీ ఆర్మూర్‌లో ఉండాలి. వైద్య ఆరోగ్యశాఖ వివరాల్లో రెండు కాలేజీలు వేర్వేరుగా ఉన్నట్లు చిరునామాలున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో విద్య.. మిథ్యగా మారింది. అక్కడ చదివితే కనీసం సూది వేయలేరు. బీపీ చూడలేరు. కట్టు కట్టలేరు. కాలేజీలో అధ్యాపకులుండరు. ఉన్నవాళ్లకు అర్హత ఉండదు. మౌలిక సదుపాయాలుండవు. ఈ కళాశాలలపై పర్యవేక్షణ ఉండదు. మరోవైపు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ తనిఖీల పేరుతో కాసులు వేటలో మునిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి ఎంఎస్సీ నర్సింగ్ కాలేజీలు 21, నర్సింగ్ కాలేజీలు 87, నర్సింగ్ స్కూళ్లు 161, ఎంపీహెచ్‌డబ్ల్యూ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లు 112 ఉన్నాయి. అన్ని రకాల కాలేజీలు కలిపి మొత్తం 391 ఉన్నాయి. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న కాలేజీలు మినహా మిగిలిన వాటిలో మెజారిటీ కళాశాలల్లో నాణ్యమైన విద్య లేదు. నర్సింగ్ విద్యలో ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ(ఏఎన్‌ఎమ్), జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎమ్) కోర్సులుంటాయి. బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు. ఏఎన్‌ఎమ్ రెండేళ్లు, జీఎన్‌ఎమ్ మూడేళ్ల కోర్సులు. ఏఎన్‌ఎమ్ కోర్సులో చేరాలంటే పదో తరగతి పాస్ అవ్వాలి. జీఎన్‌ఎమ్‌కు ఇంటర్.. బీఎస్సీ నర్సింగ్‌కు నీట్ లేదా ఎంసెట్‌లో అర్హత సాధించాలి. మెజారిటీ నర్సింగ్ కాలేజీల్లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) నిబంధనల మేరకు అధ్యాపకులు ఉండటం లేదు. ఐఎన్‌సీ మార్గదర్శకాల మేరకు ఏఎన్‌ఎమ్, జీఎన్‌ఎమ్ కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులుండాలి. చాలా కాలేజీలకు అనుబంధ ఆస్పత్రులే లేవు. జీఎన్‌ఎమ్ కోర్సులకు 9-12 మంది ఫ్యాకల్టీ ఉండాలి. వారంతా బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసినవారై ఉండాలి. ఇక బీఎస్సీ నర్సింగ్ కోర్సులకైతే ఎమ్మెస్సీ నర్సింగ్ చేసిన వారు అధ్యాపకులుగా ఉండాలి. కనీసం 12-15 మంది అవసరం. అలాగే 5-8 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఐఎన్‌సీ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లలో అధ్యాపకులుండటం లేదు. కొన్ని కాలేజీలైతే ఇద్దరు ముగ్గురితోనే నెట్టుకొస్తున్నాయి. ఇక మెజారిటీ బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో ఎమ్మెస్సీ చేసిన ఫ్యాక్టల్టీ ఒకరిని పెట్టి.. బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్లతో క్లాసులు చెప్పిస్తున్నారు.
పూర్తికాని సిలబస్.. పరీక్షలు తూతూమంత్రం
నర్సింగ్ విద్యలో 12 సబ్జెక్టులుంటే ప్రతీ ఆరు నెలలకు ఒక సెమిస్టర్ చొప్పున పరీక్షలు నిర్వహించాలి. కనీసం సిలబస్ కూడా పూర్తిచేయడం లేదని, విద్యార్థులు వాపోతున్నారు. కొంతమంది అడ్మిషన్ల సమయంలోనే కాలేజీలకు వస్తారని.. మళ్లీ పరీక్షల సమయంలోనే కనిపిస్తారని చెబుతున్నారు. యాజమాన్యాలతో మాట్లాడుకుని హాజరు శాతాన్ని మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రాక్టికల్స్‌లో అందర్నీ పాస్ చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు పైసలిచ్చి తమ విద్యార్థులు చూసిరాసి పాసయ్యేలా ప్రైవేటు కాలేజీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
విద్యార్థుల శ్రమ దోపిడీ
ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు ప్రాక్టికల్స్ కోసం విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పంపాలి. అవి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులై ఉండాలి. అయితే కొన్ని కాలేజీలు ప్రైవేటు ఆస్పత్రులకు విద్యార్థులను పంపుతున్నాయి. ఆ ఆస్పత్రులతో యాజమాన్యాలు ముం దుగానే మాట్లాడుకుంటాయి. ఒక్కో విద్యార్థికి నెలకు సగటున రూ.10-12 వేల వరకు ప్రైవేటు ఆస్పత్రులు వేతనాల రూపంలో ఇస్తాయి. అయి తే ఆ మొత్తాన్ని ప్రైవేటు కాలేజీలు విద్యార్థులకు ఇవ్వకుండా దోచుకుంటున్నాయి. అలాగే సాల్కర్‌షి్‌పలు వచ్చాక విద్యార్థులకే ఇస్తామంటూ అడ్మిషన్ల సమయంలోనే మొత్తం ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.