రెండు లక్షల మందికి రైతుబంధు
ABN , First Publish Date - 2023-06-25T00:42:52+05:30 IST
వానాకాలం సాగుకు సంబంధించిన రైతుబంధు సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నది. జిల్లాలో రైతుబంధు సాయం పొందేందుకు అర్హులైన రైతులు 2,00,075 మంది ఉన్నారు. వీరందరికి 182.03 కోట్ల రూపాయల సహాయం అందనున్నది. 2023 జూన్ 18 అర్ధరాత్రి వరకు పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులందరిని రైతుబంధు సహాయం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ రైతుబంధు పోర్టల్‌లో వారి పేర్లను నమోదు చేశారు.

- సీజన్‌లో పొందే సాయం రూ. 182.03 కోట్లు
- ఇంకా పట్టాదారు, బ్యాంకు వివరాలు ఇవ్వని రైతులు 17,190
- 26 నుంచి రైతుల ఖాతాల్లో జమకానున్న సహాయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వానాకాలం సాగుకు సంబంధించిన రైతుబంధు సాయం ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నది. జిల్లాలో రైతుబంధు సాయం పొందేందుకు అర్హులైన రైతులు 2,00,075 మంది ఉన్నారు. వీరందరికి 182.03 కోట్ల రూపాయల సహాయం అందనున్నది. 2023 జూన్ 18 అర్ధరాత్రి వరకు పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులందరిని రైతుబంధు సహాయం పొందేందుకు అర్హులుగా పేర్కొంటూ రైతుబంధు పోర్టల్‌లో వారి పేర్లను నమోదు చేశారు. ఈ రైతులు 3,64,078 ఎకరాల భూమికి గాను, ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంట సాయం పొందనున్నారు. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1,81,908 మంది రైతులకు 177 కోట్ల 78 లక్షల రూపాయలు పంట సాయంగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈసారి అదనంగా మరో ఐదు కోట్ల సహాయం రైతులకు అందనున్నది.
ఫ వివరాలు ఇచ్చేందుకు తుది గడువు జూలై 3
రైతు బంధు సహాయం పొందడానికి అర్హులైన రైతుల్లో కొత్తగా పట్టాదారు పుస్తకాలు వచ్చిన 11,139 మంది రైతులతోపాటు అంతకు ముందు బ్యాంకు ఖాతాల సమాచారం ఇవ్వనివారిని కలుపుకొని 17,190 మంది రైతులు బ్యాంకు వివరాలను సమర్పించాల్సి ఉన్నది. కొత్తగా పట్టాదారు పుస్తకం పొందిన రైతులు ఆ పుస్తకంతోపాటు బ్యాంకు ఖాతా, ఆధార్ జిరాక్స్ కాపీలను వ్యవసాయ విస్తరణ అధికారికిగాని, మండల వ్యవసాయ అధికారిని గాని కలిసి సమర్పించాల్సి ఉంటుంది. జూలై 3 వరకు రైతులందరూ తమ వివరాలు అందజేయడానికి తుది గడువుగా ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు అవసరమైన వివరాఉల అధికారులకు అందించిన 1,82,885 మంది రైతులకు 175 కోట్ల 63 లక్షల రూపాయలు రైతుబంధు సాయంగా అందనున్నది. జూలై 3వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ జిరాక్స్‌లను అందజేసిన వారికి వెంటనే రైతుబంధు సాయం బ్యాంకు ఖాతాల్లో జమకానున్నదని అధికారులు చెబుతున్నారు.
ఫ జిల్లాలో అత్యధికంగా మానకొండూర్ మండలంలో
జిల్లాలో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 21,031 మంది రైతులు రైతుబంధు సాయాన్ని పొందనుండగా, కరీంనగర్ అర్బన్ మండలంలో అతి తక్కువ మంది రైతులు రైతుబంధు పొందనున్నారు. ఈ మండలంలో 21 మంది రైతులు మాత్రమే సహాయాన్ని అందుకోవడానికి అర్హులుగా ఉన్నారు. మానకొండూర్ రైతులకు 19 కోట్ల 3 లక్షల రూపాయల సహాయం అందనుండగా, కరీంనగర్ అర్బన్ మండలంలో 2,49,122 రూపాయల సహాయం రానున్నది. చొప్పదండి మండలంలో 1,150 మంది రైతులు, గంగాధర మండలంలో 1,754 మంది రైతులు, రామడుగు మండలంలో 1,169 మంది రైతులు, ఇల్లందకుంట మండలంలో 562 మంది రైతులు, హుజూరాబాద్ మండలంలో 1,313 మంది రైతులు, జమ్మికుంట మండలంలో 855 మంది రైతులు, సైదాపూర్ మండలంలో 735 మంది రైతులు, వీణవంక మండలంలో 995 మంది రైతులు, కరీంనగర్ అర్బన్ మండలంలో ముగ్గురు రైతులు వివరాలు అందజేయాల్సి ఉన్నది. కరీంనగర్ రూరల్ మండలంలో 1,643 మంది రైతులు, కొత్తపల్లి మండలంలో 1,194 మంది రైతులు, చిగురుమామిడి మండలంలో 979 మంది రైతులు, గన్నేరువరం మండలంలో 349 మంది రైతులు, మానకొండూర్ మండలంలో 2,210 మంది రైతులు, శంకరపట్నం మండలంలో 944 మంది రైతులు, తిమ్మాపూర్ మండలంలో 1,335 మంది రైతులు తమ వివరాలను అందజేయాల్సి ఉన్నది. జిల్లాలో రుతుపవనాలు ప్రవేశించడంతో రెండు, మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ వర్షాలు పడడం ప్రారంభం కావడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుక్కోవడానికి సమయానికి రైతుబంధు సహాయం అందనున్నందున రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ గతంలో డబ్బు అందనివారు అధికారులను సంప్రదించాలి...
గతంలో బ్యాంకు ఖాతా వివరాల్లో దొర్లిన తప్పుల కారణంగా డబ్బు ఖాతాల్లో జమ కానివారు, గతంలో రైతుబంధు సాయం పొంది బ్యాంకు ఖాతా వివరాలు మార్చుకోవాలనుకున్నవారు వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచించారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన 11,139 మంది రైతులు, గతంలో బ్యాంకు వివరాలు ఇవ్వనివారు వెంటనే సంబంధిత వ్యవసాయాధికారులను కలిసి అవసరమైన పత్రాలను జూలై 3 వరకు అందజేయాలని ఆయన సూచించారు. రైతుబంధు పోర్టల్‌లో నమోదై ఉన్న రైతులందరికి సంబంధిత సమాచారం అందిస్తే రైతుబంధు సాయం వారి వారి ఖాతాల్లో జమవుతుందని శ్రీధర్ పేర్కొన్నారు.