Revanth Reddy: TSPSC పేపర్ లీక్‌లో తీగ లాగితే ప్రగతిభవన్‌లో.. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి
ABN, First Publish Date - 2023-04-02T19:40:10+05:30
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ అంశంలో కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ అంశంలో కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. TSPSC కమిషన్ని రద్దు చేసి నూతన బోర్డును నియమించాలని, కొత్త బోర్డు నియామకం తర్వాతే TSPSC పరీక్షలు నిర్వహించాలన్నారు. TSPSC అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ప్రశ్నాపత్రాల తీగ లాగితే డొంక ప్రగతిభవన్‌లో తేలిందని ఆరోపించారు. TSPSC కమిటీని తెలంగాణ సమాజం నమ్మడం లేదని, షర్మిల కాల్ చేసి విద్యార్థుల కోసం కలిసి పోరాడుదామని అడిగారని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి వేదిక పంచుకోవద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని, బీఆర్ఎస్, బీజేపీ తప్ప మరే ఇతర పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదన్నారు. బండి సంజయ్, కిషన్‌రెడ్డి పేపర్ పులులలాగా వ్యవహరిస్తున్నారని, TSPSC అంశంలో బీజేపీ తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందని, బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ధర్మపురి అరవింద్ బాగా చెప్తాడని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని గద్దర్‌ను కోరానని, రాహుల్ సభలో పాల్గొంటానని గద్దర్ చెప్పారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
అదానీ దేశాన్ని దోపిడీ చేశాడని, రాహుల్‌గాంధీ ప్రపంచానికి వాస్తవాలను వివరించారని, రాహుల్ నిజాలు మాట్లాడిన తర్వాతే అదానీ షేర్లు పడిపోయాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదానీ.. ప్రధానికి అత్యంత ప్రియమిత్రుడని, అదానీ, మోదీ, అమిత్‌షా రాహుల్‌పై కక్ష కట్టారని, లోక్‌సభలో రాహుల్ మాట్లాడితే దోపిడీ వ్యవస్థ కుప్పకూలిందని, జైలు శిక్ష పడ్డా, పార్లమెంట్ సభ్యత్వం తీసేసినా రాహుల్‌పై కక్ష ఆగలేదన్నారు.
ఏప్రిల్ 10 నుంచి 25 వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర, గజ్వేల్‌లో లక్ష మందితో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. తమ ఒత్తిడితోనే TSPSC అంశంపై ఈడీ కేసు నమోదైందని రేవంత్ రెడ్డి అన్నారు. 4 అంశాలపై రేవంత్‌రెడ్డి ఎజెండా పిక్స్ చేశారు. రాహుల్‌పై రేపు పోస్ట్ కార్డుల ఉద్యమం, ఏప్రిల్ 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుతుబ్‌షాహీ గ్రౌండ్లో ఇఫ్తార్ విందు, రాహుల్‌పై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 8న మంచిర్యాలలో నిరసన కార్యక్రమం, జహీరాబాద్‌లో మిగిలిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో యాత్ర ఉంటుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతలు జాబితా ఇవ్వాలని, ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు ప్రచారానికి హాజరుకావాలని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లే రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
Updated Date - 2023-04-02T19:43:26+05:30 IST