నిప్పులు కక్కుతున్న సూరీడు!
ABN , First Publish Date - 2023-05-20T02:24:08+05:30 IST
రాష్ట్రంలో ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు. ఉదయం 8 నుంచే సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక, నల్లగొండ జిల్లా దామరచర్లలో శుక్రవారం అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో ఎండలు ఏమాత్రం తగ్గట్లేదు. ఉదయం 8 నుంచే సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక, నల్లగొండ జిల్లా దామరచర్లలో శుక్రవారం అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలోని కడెంలో 45.1, మంచిర్యాల జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వు జన్నారంలో 44.9, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 44.8, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, దండేపల్లి, జగిత్యాల జిల్లా గోదూర్, పెద్దపల్లి జిల్లా ధర్మారం, సిరిసిల్ల మండలం పెద్దూర్‌లో 44.5, వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల ఉష్ణోగ్రత 44 డి గ్రీలు దాటింది. ఇటు ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు వాన జల్లులతో కాస్త ఊరట లభించింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో గరిష్ఠంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లోనూ గణాంకభవన్ వద్ద 42.5 డిగ్రీలు నమోదైంది. అయితే వచ్చే మూడ్రోజులు నగరవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పొలం పనులకు వెళ్లి..
పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులకు వడదెబ్బ తగలడంతో మరణించారు. వీరిలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన పందిళ్ల కనకయ్య (57), మహబూబ్‌నగర్ జడ్చర్ల మున్సిపాలిటీకి చెందిన గాలిగూడెం చిన్ననర్సింహులు (65), నల్లగొండ మండలం గుట్టకిందిఅన్నారం గ్రామానికి చెందిన నాగమ్మ (48) ఉన్నారు.
ఎండలో అప్పడాలు కాల్చిన యువకులు!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన యువకులు జిక్కీ, శ్యామ్, వహీద్ ఎండలో అప్పడాలు వేశారు. రాయిపై మూకుడు పెట్టి, నూనె పోసి మిట్ట మధ్యాహ్నం వేళ అప్పడాలు కాల్చి చూపారు. స్టౌ మీద కాలినట్టుగానే అప్పడాలు ఫ్రై అయ్యాయి. దాన్ని వీడియో తీసి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.