ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains: జలఖడ్గం!

ABN, First Publish Date - 2023-07-28T03:03:16+05:30

ఇళ్లలో వరదే.. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టినా వరదే! కాలనీలు, వీధులు, రోడ్లు అన్నీ చెరువుల్లానే మారాయ్‌! వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భీతావహ పరిస్థితి నెలకొంది.

వరుణుడి కన్నెర్ర.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అత్యంత తీవ్రంగా..

ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో జనం

ముంపులో వరంగల్‌లోని 35-40 కాలనీలు

మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన వరద

ప్రాణభయంతో ఇళ్లపైకి జనం.. ఆర్తనాదాలు

చుట్టూ నీళ్లే.. రంగంలోకి సైనిక హెలికాప్టర్‌

సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు

రాష్ట్రంలో 12 మంది మృతి.. ఏడుగురి గల్లంతు

ఖమ్మంలో జలదిగ్బంధంలో కాలనీలు

ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.9 సెం.మీ

27 ఏళ్లలో ఓ చోట ఇంతటి వర్షపాతం ఇదే..

గత 24 గంటల్లో 11 చోట్ల 30 సెం.మీపైనే

బడులకు నేడూ సెలవు.. మరో 2 రోజులు వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఇళ్లలో వరదే.. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టినా వరదే! కాలనీలు, వీధులు, రోడ్లు అన్నీ చెరువుల్లానే మారాయ్‌! వర్షాలు, వరదలతో రాష్ట్రంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ప్రజలకు పునరావాస కేంద్రాలే దిక్కవుతున్నాయి. చెరువులకు గండ్లు పడేసి.. రోడ్లను తెగ్గొట్టి.. ఊర్లకు ఊర్లనే బయట ప్రపంచంతో సంబంధాల్లేకుండా చేసి.. పత్తి, వరి, కంది, పెసర తదితర పంటలను తుడిచిపెట్టేస్తున్న రాకాసి వరదలు ఇప్పుడు నిండు ప్రాణాలనూ కబళిస్తూ.. ఎందరినో గల్లంతు చేస్తూ కుటుంబాల్లో పెను విషాదాలు నింపుతున్నాయి! బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు ఉత్తర తెలంగాణ (North Telangana) కకావికలమైంది. ఉమ్మడి వరంగల్‌(Warangal), ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లాల్లో భారీ వర్షం(heavy rain) కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత 27 ఏళ్లలో రాష్ట్రంలో ఓ చోట ఈస్థాయి వర్షపాతం నమోదవడం ఇదేతొలిసారి అని చెబుతున్నారు. మాయదారి వరద బుధవారం అర్ధరాత్రి పూటభూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలోకి పోటెత్తింది. వరద తీవ్రతకు ఆ ఊరికి ఊరే నిండా మునిగింది.

వరద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఇళ్లు, చెట్లపైకి ఎక్కి ప్రజలు ఆర్తనాదాలు చేశారు! ఓ నలుగురు వరదలో పడి గల్లంతయ్యారు! మరి.. ఆ ఊర్లో ఇంకెందరు వరదలో కొట్టుకుపోయారో? ఎవరు ఎక్కడ ఉన్నారో? అనేది వరదపోటు తగ్గాకే తెలిసే అవకాశం ఉంది! కిలోమీటర్ల మేర వరదే.. ఆ గ్రామానికి వెళ్లేందుకు దారులే లేకపోవడంతో చివరికి సైనిక హెలికాప్టర్‌ (Military helicopter)ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్‌, ములుగు, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది గల్లంతవ్వగా.. ఏడుగురు మృతిచెందారు. ఇక భూపాలపల్లి జిల్లా చిట్యాల్‌లో 61.6 సెం.మీ వర్షపాతం నమోదైంది! కాగా గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో 64.9 సెం.మీ నుంచి 40 సెం.మీ వరకు, ఐదు చోట్ల 39 సెం.మీ నుంచి 30 సెం.మీ వరకు, 22 చోట్ల 29 సెం.మీ నుంచి 20 సెం.మీ వరకు, 79 చోట్ల 19 సెం.మీ నుంచి 10 సెం.మీ వరకు వర్షపాతం నమోదైంది. మొత్తంగా 11 చోట్ల 30 సెం.మీ ఆపైనే నమోదవ్వడం గమనార్హం! వర్షాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అతలాకుతలమైంది. పల్లెలు, పట్నాలు ముంపులో చిక్కుకున్నాయి. చెరువులు తెగిపోవడంతో మోరంచ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. వర్షాలకు వరంగల్‌ జలదిగ్బంధమైంది.

వరద పోటు, తెగిన రోడ్లు, కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లతో నగరంలో బీభత్స వాతావరణం నెలకొంది. వరంగల్‌-హనుమకొండ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి మోకాలి లోతుకు మించి నీళ్లొచ్చాయి. బియ్యం ఇతర నిత్యావసరాలు తడిసిపోయాయి. బాధితులు తాగునీరు కూడా దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ట్రాన్స్‌ఫార్మార్లు చెడిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మంచినీటి సరఫరా జరగడం లేదు. వరంగల్‌-హనుమకొండ(Warangal-Hanumakonda)లో లోతట్టు ప్రాంతాల్లోని 35-40 కాలనీల్లో వరద నీరు ముంచెత్తింది. ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా 30కి పైగా సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితులను మరపడవల ద్వారా 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు ఖమ్మం జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మున్నేరు వాగు మునుపెన్నడూ లేని విధంగా 30 అడుగుల ఎత్తులో పొంగిపొర్లుతుండటంతో ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ముంపు కాలనీల్లోని 2వేల మంది బాధితులను నాటు పడవల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీరు చుట్టు ముట్టడంతో ఖమ్మం నగరంలో ఇళ్లలోకి పాములు వస్తుండటటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలోని ఎఫ్‌సీఐ గోదాం వద్ద భారీ కొండచిలువను రెస్క్యూటీం పట్టుకొని సుదూర ప్రాంతంలో వదిలివేశారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల -రాఘవరెడ్డి పేట మధ్య బిడ్జి కూలిపోయింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కొత్తగూడెం జిల్లాలో 9 మంది మండలాల్లో 42 గ్రామాలకు చెందిన 1211 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఓ ఇల్లు కూలింది. శిథిలాలు మీద పడటంతో లోపల నిద్రిస్తున్న గర్భిణి సహా నలుగురు గాయపడ్డారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పత్తి, వరి, పెసర, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో దాదాపు 650 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2,600 ఎకరాల్లో వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆలేరులో మూడు, చౌటుప్పల్‌లో రెండు గేదెలు మృతిచెందాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో ఓ ఇల్లు కూలిపోయింది. హైదరాబాద్‌(Hyderabad) గచ్చిబౌలి(Gachibowli) నల్లగండ్లలో డాక్టర్స్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌ గోడ కూలిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని 40 కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ఎగ్జిట్‌-2 ఎగ్గిట్‌-7 వద్ద నీళ్లు చేరడంతో ఎగ్జిట్‌, ఎంట్రీ మార్గాల్లో ఇబ్బందులు నెలకొన్నాయి. కొత్తగూడెం జిల్లా వెంకటాపురం గ్రామంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఎనిమిది కాడెడ్లు మృతిచెందాయి. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‌, తంగడ్‌పల్లి, దామరిగిద్ద గ్రామాల్లో ఎనిమిది ఇళ్లు, కడ్తాల్‌, సాలార్‌పూర్‌లో రెండు చొప్పున ఇళ్లు కూలిపోయాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి తలసాని(Minister Talasani) సమీక్ష నిర్వహించారు.


ఆ ముగ్గురు నిద్రలోనే కొట్టుకుపోయి..

ములుగు జిల్లా వెంకటాపూర్‌ (రామప్ప) మండలం బూర్గుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. బుధవారం అర్ధరాత్రి మారేడుగొండ చెరువు కట్ట నాలుగు చోట్ల తెగిపోయింది. గ్రామంలోకి వరద నీరు పోటెత్తి ఇళ్లను మంచెత్తింది. ఇంట్లో నిద్రిస్తున్న సారయ్య (65), భార్య పోచమ్మ (55), తల్లి రాజమ్మ (80) నీటిలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా సారయ్య మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు గల్లంతయ్యారు. భూపాలపల్లి రూరల్‌ మండలం మోరంచపల్లి గ్రామంలో వరద ఉధృతికి నలుగురు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన గొర్రె ఓదిరెడ్డి, వజ్రమ్మ, గంగడి సరోజన, గడ్డం మహాలక్ష్మి కనిపించడం లేదు. వీరితోపాటు గ్రామానికి చెందిన మరికొందరు గల్లంతయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎంతో మంది డాబాలమీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సైనిక హెలికాప్టర్‌ ద్వారా గ్రామంలోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వాగు దాటుతుండగా అన్నదమ్ములు పిండి యాకయ్య (30), పిండి శ్రీనివాస్‌ (36) నీళ్లలో పడి కొట్టుకుపోయారు. శ్రీనివాస్‌ మృతదేహం లభ్యమైంది.

హనుమకొండ రాగన్న దర్వాజ ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు వైరు తెగిపడింది. ఆ ప్రాంతంలో ఉంటున్న ఊట్ల ప్రేమ్‌సారగ్‌ అనే వ్యక్తి గురువారం ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చి విద్యుత్తు తీగకు తగిలి మృతిచెందాడు. హనుమకొండ కేయూ 100 పీట్ల రోడ్డులో గట్టు రాజు అనే వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శ్రీహరినగర్‌లో రోడ్డుపై భారీగా వరద నీరు పొంగిపొర్లింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడు యశ్వంత్‌, ఆయన రెండేళ్ల కూతురు కనిపించకపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో చలికి తట్టుకోలేక గుర్తుతెలియని యాచకురాలు (75) మృతి చెందింది. ఖమ్మం జిల్లా జలగంనగర్‌లో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న క్రమంలో పెండ్ల సతీశ్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న సామానును వెంట తెచ్చుకుంటానని వెనక్కి వెళ్లి.. మున్నేరు వాగులో పడి గల్లంతయ్యాడు.

హైదరాబాద్‌ మీరాలం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. కొత్తగూడెం జిల్లా కుమ్మరిగూడెంకు చెందిన కుంజు సీతమ్మ పాములేరు వాగు దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైంది. పినపాక మండలం దుప్పితోగువర్రెలో కొడెం పాపారావు అనే వ్యక్తి ఆటోతో సహా బుధవారం రాత్రి కొట్టుకుపోయాడు. గురువారం అతడి మృతదేహం లభ్యమైంది. నిజామామాద్‌ జిల్లా నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌ చెరువులో చేపల వేటకు వెళఙ్ల ఎల్లవ్వ (35) అనే మహిళ గల్లంతైంది. కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంల గుర్రాలకుంటకు చెందిన తాటి లక్ష్మి అనే జ్వరపడీతురాలు మొర్రేడువాగు పొంగిపొర్లుతుండటంతో ఆస్పత్రికి వెళ్లే దారి లేక ప్రాణాలు విడిచింది.

వరదలో కస్తూర్బా స్కూళ్లు

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల చుట్టూ వరద నీరు చేరింది. మోకాలిలోతు నీరు చేరడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి పిల్లలను ఇంటికి పంపిచారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కస్తూర్బా మోడల్‌ స్కూళ్లు నీట మునిగాయి. కరీంనగర్‌ జిల్లా సోమారం గ్రామ శివారులోని మోడల్‌ స్కూల్‌, బాలికల వసతి గృహాల చుట్టూ నీరు చేరింది. వసతి గృహంలోని 60 మంది పిల్లలను సురక్షితంఆ ఇళ్లకు పంపారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర్లలో పాఠశాల భవనం గోడ కూలిపోయింది. సెలవు దినం కావడంతో ప్రమాదం తప్పింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో కస్తూర్బా గాంధీ పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థులను ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు.


నేడూ విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికే బుధ, గురువారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. తాజా నిర్ణయంతో వరుసగా మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారం) విద్యా సంస్థలకు సెలవులు కొనసాగనున్నాయి. శనివారం మొహర్రం సందర్భంగా సెలవు. ఆదివారం ఎలాగూ సెలవు దినం.

పునరావాస చర్యలు చేపట్టండి: సీఎస్‌

వరద బాధిత ప్రాంతాలలో ముమ్మరంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వరద పీడిత ప్రాంతాలతో పాటు ప్రయాణికులు చిక్కుకున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులలోనూ సహాయ కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 108 గ్రామాల నుంచి 10,696 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం నుంచి 600 మందిని, పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోపాల్‌పూర్‌లో ఇసుక క్వారీలో చిక్కుకున్న 19 మంది కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు.

Updated Date - 2023-07-28T05:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising