Mulugu ZP Chairman Jagadish Death: గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ జగదీశ్ మృతి
ABN , First Publish Date - 2023-06-12T03:19:38+05:30 IST
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ (47) గుండె పోటుతో మృతిచెందారు.

నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
నేడు అంత్యక్రియలకు మంత్రి కేటీఆర్
ఉద్యమం నుంచి కేసీఆర్ వెంటనే జగదీశ్
హైదరాబాద్, ములుగు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ (47) గుండె పోటుతో మృతిచెందారు. హనుమకొండలోని నివాసంలో ఆదివారం ఉదయం 8.30 ప్రాంతంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత కొద్దిసేపటికే చనిపోయారు. ఏప్రిల్ 1న జగదీశ్ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ నెల 7న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటనను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇంతలోనే ఆయన మృతిచెందారని తెలిసి పార్టీ శ్రేణులు దిగ్ర్భాంతికి గురయ్యాయి. కాగా, వామపక్ష భావజాలం కలిగిన జగదీశ్ గతంలో పీపుల్స్‌వార్ సానుభూతిపరుడిగా ఉన్నారు. తెలంగాణ జన సమితిలో కీలక నేతగా ఎదిగారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భవించాక కేసీఆర్‌తో కలిసి నడిచారు. ప్రస్తుతం ఏటూరునాగారం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ములుగు జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్పీ చైర్మన్ పదవి పొందారు. జగదీశ్‌కు తల్లిదండ్రులు, భార్య రమ, కుమారుడు వెంకట సత్యదేవ్, కుమార్తె హరిచందన ఉన్నారు.
కన్నీటిపర్యంతమైన మంత్రి సత్యవతి
తనకు అత్యంత సన్నిహితుడైన జగదీశ్ మరణాన్ని తట్టుకోలేక మంత్రి సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామమైన ములుగు మండలం మల్లంపల్లికి తరలించారు. మల్లంపల్లిలో సోమవారం జరిగే అంత్యక్రియలకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, హరిప్రియ, తాటికొండ రాజయ్య, ఎంపీ మాలోత్ కవిత, రాష్ట్ర జలవనరుల పరిరక్షణ సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రెడ్‌కో చైర్మన్ వై.సతీ్‌షరెడ్డి, పలువురు జడ్పీ చైర్మన్లు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జగదీశ్ మృతదేహానికి నివాళులర్పించారు.
కేసీఆర్, కేటీఆర్ సంతాపం
జగదీశ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్‌గా, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ఉద్యమకారుడిగా ఆయన సేవలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. జగదీశ్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. జగదీశ్ మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. రెండు దశాబ్దాలకు పైగా కేసీఆర్ వెంట ఉంటూ పార్టీకి సేవలం దించారని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉం టుందని భరోసా ఇచ్చారు. ఇటీవల తాను ములుగు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు వెన్నంటే ఉన్నాడని ట్వీట్ చేశారు. నిబద్ధత గల నాయకుడి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జగదీశ్ మృతికి ఎంపీ సంతో్‌షకుమార్ సంతాపం తెలిపారు.