Nadendla Manohar : ‘రేషన్’లో భారీ కుంభకోణం
ABN, Publish Date - Dec 08 , 2024 | 03:18 AM
‘కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల (13.10 లక్షల క్వింటాళ్లు) రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించాం. దీనిపై సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.
కాకినాడ పోర్టు నుంచి మూడేళ్లలో
13.10 లక్షల క్వింటాళ్ల బియ్యం అక్రమ రవాణా
పీడీఎస్ బియ్యం తరలింపు నిందితులపై పీడీ చట్టం
నౌకను సీజ్ చేయడంలో సాంకేతిక సమస్యలు లేవు
రాష్ట్రవ్యాప్తంగా 11.42 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
రూ.2,800 కోట్ల బిల్లుల చెల్లింపు: మంత్రి మనోహర్
బొబ్బిలి, పార్వతీపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల (13.10 లక్షల క్వింటాళ్లు) రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించాం. దీనిపై సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60-40 శాతం వాటాలతో బియ్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు అందజేస్తున్నాయి. దీనిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగింది. ఆహార భద్రత చట్టం కింద పేదలందరికీ బియ్యం అందివ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చారు. అందుకే బటన్ నొక్కుడుతో కాకుండా నేరుగా బియ్యాన్ని పారదర్శకంగా పేదలకు అందజేస్తున్నాం. పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడం చట్టవ్యతిరేక చర్య. నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తాం. నౌకను సీజ్ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే ప్రచారంలో నిజం లేదు. రాష్ట్ర పోలీసులకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. అక్రమాలను అడ్డుకోవడమే వారి కర్తవ్యం. పోర్టు అప్పగింత తదితర అక్రమాలన్నింటిపైనా ఆరా తీస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలు నిర్వహించినప్పుడు అనేక దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయి’ అనిఅని తెలిపారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మండలం పెద్దబొండపల్లిలో పంట పొలాలను మంత్రి పరిశీలించారు. అనంతరం నర్సిపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘పీటీఎం’కు అని హాజరయ్యారు.
Updated Date - Dec 08 , 2024 | 03:18 AM