AP Voters List: ఏడాదిలో 30 లక్షల ఓట్ల తొలగింపు.. సమాచారం ఇవ్వకుండానే గల్లంతు
ABN, Publish Date - Jan 24 , 2024 | 10:56 AM
ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో కేంద్ర ఎన్నికల సంఘం 30 లక్షల ఓట్లను తొలగించిందని చెబుతున్నాయి. వలసల పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) 30 లక్షల ఓట్లను తొలగించిందని చెబుతున్నాయి. 2023 జనవరి 6వ తేదీ నుంచి 2024 జనవరి 22వ తేదీ మధ్య 30 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 14.26 లక్షల ఓట్లు వలస వెళ్లిన వారు (Shifted) అని తీసివేశారు. వలస పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు ప్రక్రియలో మృతులు, ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే తొలగిస్తారు. ఈ సారి అందుకు భిన్నంగా ఓట్లను తీసివేశారు.
ఏడాదిలో ఇంత తేడా..?
2022 జనవరి 6వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ మధ్య 11,23,829 ఓట్లను తొలగించారు. ఇందులో వలసల పేరుతో 1,11,578 ఓట్లు తొలగించారు. 2024లో మాత్రం 14.26 లక్షల ఓట్లను తీసివేశారు. ఏడాదిలో దాదాపు 13 లక్షల ఓటర్లు షిప్ట్ అయ్యారని తీసివేయడం అనుమానాలకు తావిస్తోంది. ఆ ఓట్లు వలస వెళ్లిన వారివేనా..? లేదంటే అర్హులు ఉన్నారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు తప్పుడు వివరాలతో ఫామ్-7 దరఖాస్తు చేసి ఉండొచ్చు. విచారణ లేకుండానే ఓట్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది.
పర్చూర్‌లోనే ఎక్కువ..?
తప్పుడు సమాచారంతో ఫామ్-7 దరఖాస్తులు అందజేసి ప్రతిపక్షాలకు మద్దతిచ్చేవారి ఓట్లు తొలగించే కుట్ర పర్చూర్ నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 13,588 ఓట్లను తొలగించారు. వాస్తవానికి ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరు తొలగించాలంటే సదరు వ్యక్తి, లేదంటే కుటుంబ సభ్యులకు ముందుగా అధికారులు నోటీసు ఇవ్వాలి. ఓట్ల తొలగింపునకు సంబంధించి విచారించాలి. సరయిన సమాధానం రాకుంటేనే తొలగించాలి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలతో వాలంటీర్లు, బీఎల్‌వోలు కుమ్మక్కయ్యారని దీనిని బట్టి తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల మద్దతుదారులకు చెందినవారికి నోటీసులు ఇవ్వకుండా ఓట్లను తొలగించారు. వివిధ ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని గుర్తించి తీసివేశారు.
తిరుపతి, చంద్రగిరిలో దొంగ ఓట్లు
ఓటర్ ముసాయిదా జాబితాపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇందులో లోపాలు ఉన్నాయని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈసీ అధికారులు తుది జాబితాలో ఎలాంటి మార్పులు చేయలేదు. పలు నియోజకవర్గాల జాబితాలో మృతుల పేర్లు ఎక్కువగా కనిపించాయి. అర్హులైన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పించలేదు. కావాలని మరికొందరి పేర్లను ఓటరు తుది జాబితా నుంచి తొలగించారు. ఆ గ్రామం, పట్టణంతో సంబంధం లేని కొత్త వ్యక్తుల పేర్లు కొన్ని తుది జాబితాలో కనిపించాయి. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అలాగే ఉన్నాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
70 కేసులు నమోదు
మరోవైపు నకిలీ ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా 23 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 16 కేసులు నమోదు చేశారు. నియోజకవర్గ ఇంచార్జీగా వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు.
మరిన్నిఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 24 , 2024 | 11:56 AM