కేసుల భయంతో 5 ఐఫోన్లు మటాష్
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:57 AM
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పనిచేశారు. మళ్లీ వైసీపీ గెలుస్తుందని భావించి చెలరేగిపోయారు.
ఎన్నికల ఫలితాల రోజే ధ్వంసం.. వాటిలోని క్లౌడ్ డేటా తొలగింపు
గనుల శాఖ ఘనుడి నిర్వాకం.. జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహారం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్డగోలుగా పనిచేశారు. మళ్లీ వైసీపీ గెలుస్తుందని భావించి చెలరేగిపోయారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించడంతో ఆ అధికారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదే రోజు రాత్రి 7:30 గంటల సమయంలో బహుశా తాడేపల్లి ప్యాలెస్ నుంచేమో ఓ ఫోన్ కాల్ వచ్చింది. అంతే.. ఆగమేఘాల మీద ఆయన రెండు కొత్త ఐఫోన్లు తెప్పించారు. ఇంట్లో ఉన్న ఐదు ఐఫోన్లలో ఉన్న డేటాను పూర్తిగా తొలగించారు. ఐక్లౌడ్‌లో ఉన్న డేటాను కూడా పూర్తిగా డిలీట్ చేశారు. ఆ వెంటనే ఆ ఫోన్లను ధ్వంసం చేశారు. గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి చేసిన నిర్వాకం ఇదీ. జగన్ ప్రభుత్వంలో గనుల శాఖలో పనిచేసిన ఆయన స్వామి భక్తి చాటుకున్నారు. గనుల శాఖలో తిరిగి తానే కీలక పోస్టులో ఉంటానని ఎన్నికల ముందు బహిరంగంగా చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆయన సర్వీసు ఉంది. జూలై వరకు ఏపీలో పనిచేసేలా డిప్యుటేషన్ తెచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల గనుల శాఖకు నష్టం వాటిల్లిందని కేసు పెట్టించారు. అయితే టీడీపీ కూటమి విజయదుందుభి మోగించడంతో ఆయనకు ముచ్చెమటలు పట్టాయి. భవిష్యత్ కళ్లముందు కనిపించింది. గనుల శాఖలో తాను చేసిన లావాదేవీలు, దందాలు, సెటిల్‌మెంట్‌లకు సంబంధించిన డేటా ఉన్న ఐఫోన్‌లు, 2 ఐఫ్యాడ్‌లను ధ్వంసం చేయాలనుకున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో పరారీలో ఉన్న ఓ ఐటీ ఇంజనీర్‌ను రహస్యంగా తన ఇంటికి పిలిపించుకున్నారు. తన వద్ద ఉన్న రెండు ఐఫోన్లు, భార్య, చిన్న కూతురి వద్ద ఉన్న రెండు ఐఫోన్లు, తన సహాయకుడు వాడే ఐఫోన్‌లో ఉన్న క్లౌడ్ డేటాను రికవరికీ సాధ్యంకాని రీతిలో డిలీట్ చేశారు. ఆ తర్వాత ఆ ఐదు ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం 2 కొత్త ఐఫోన్లను ఆయన వాడుతున్నట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం ఇసుక, బొగ్గు, బీచ్‌శాండ్, మేజర్, మైనర్ మినరల్ వేలంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే కచ్చితంగా ఆ మాజీ అధికారి ఇరుక్కుంటారు. అప్పుడు ఆయన ఫోన్లను సీజ్ చేసి డేటాను విశ్లేషించే అవకాశం ఉంటుంది. దీంతో తన బండారం బయటపడుతుందని భావించి, ముందు జాగ్రత్తగా ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిసింది.