ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు
ABN , Publish Date - Dec 25 , 2024 | 03:24 AM
దళితులు, గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సీఐడీ మాజీ అధిపతి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
సీఐడీలో బద్దలైన భారీ కుంభకోణం
ఆయన హయాంలో ‘అగ్ని’కీ చెదలు
ఎస్సీ,ఎస్టీలకు అవగాహన పేరుతో రూ.1.16 కోట్లు స్వాహా చేసినట్లు అభియోగం
ఖర్చు చేసింది 3.10 లక్షలు..డ్రా చేసింది రూ.1.19 కోట్లని నిర్ధారణ
2 పైసలు ఖర్చు.. 98 పైసలు తినేసిన వైనం
అగ్నిమాపక శాఖలోనూ 59 లక్షలు గోల్‌మాల్
వెలికితీసిన విజిలెన్స్.. కేసు పెట్టిన ఏసీబీ
ఐపీసీ 409, 420, 477ఏ, రెడ్‌విత్ 120తోపాటు పీసీ యాక్టు
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దళితులు, గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సీఐడీ మాజీ అధిపతి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలోనూ అగ్ని పోర్టల్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని రెండో అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.... సహ నిందితులుగా క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థలను చేర్చింది. సీఐడీ ఏడీజీగా రూ.1.16 కోట్లు, అగ్నిమాపక శాఖ డీజీగా రూ.59.93లక్షల అవినీతి జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐపీసీలోని 409, 420, 477ఏ, రెడ్‌విత్ 120బి కింద నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, అకౌంట్ల తారుమారు తదితర సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఏ) రెడ్ విత్ 13(2), సెక్షన్ 7కింద నేరాభియోగాలు మోపింది. ఈ స్కాంలో రూ.1.76కోట్ల నిధుల మళ్లింపు వ్యవహారాన్ని తేల్చే పని ఏసీబీ అధికారులు మొదలుపెట్టారు.
మింగేశారు ఇలా...
వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఏడీజీగా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో సర్కారీ సొమ్ము దండుకున్నారు. ప్రభుత్వం వంద రూపాయలు ఇస్తే, రెండు శాతం ఖర్చు చేసి 98శాతం మింగేశారు. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి అట్రాసిటీ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామంటూ రూ.1.16కోట్లు బిల్లు ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి విచారణ జరిపించడంతో దోపిడీ బట్టబయలైంది. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు హడావుడిగా ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వాటిని అద్దెకు తీసుకోవడం, కుర్చీలు వగైరా సమకూర్చడం, అతిథులకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేయడం ఆ ఏజెన్సీ చూసుకోవాలి. అందుకుగాను కోటికి పైగా బిల్లు చెల్లించేశారు. తీరా విచారణ జరిపితే ఒక్కటి మినహా మిగతా 24చోట్లా ఈ కార్యక్రమాలు ప్రభుత్వ భవనాల్లో జరిగాయి. ప్రభుత్వ ఫర్నిచరే వాడారు. పోలీసుల కార్యక్రమం కదా అని టీ, స్నాక్స్ ఎవరెవరో సమకూర్చారు. ఒక ప్రైవేటు భవనం కూడా....పోలీసులతో ఎందుకని ఉచితంగానే ఇచ్చేశారు. అంటే...సీఐడీ అధికారుల జేబు నుంచి ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నమాట. కానీ సంజయ్ మాత్రం రూ.1.16కోట్లు ప్రభుత్వ నిధులు తినేశారు.
ఆ సంస్థలపై ఆరోపణలు..
సంజయ్ అధిపతిగా ఉన్నప్పుడు ఏపీ సీఐడీ పిలిచిన టెండర్లకు హైదరాబాద్‌లో ఉంటున్న క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రిక టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెటా పాయింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు పాల్గొన్నాయి. ఈ సంస్థలపై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు హైదరాబాద్‌కు వెళ్లి పై మూడు ఏజెన్సీల చిరునామాల్లో విచారించాయి. అయితే, క్రిత్వాప్ అనే సంస్థ పేరుతో బిడ్డర్ లేనే లేరని తేలింది. సౌత్రికా టెక్నాలజీస్ విజయవాడలోనే ఉందని, రెండూ ఒక్కరివేనని వెల్లడైంది.
ఇది మరీ విచిత్రం..
టెండర్ దక్కించుకున్న ఏ సంస్థయినా ఎంవోయూ కుదుర్చుకుని వర్క్ ఆర్డర్ తీసుకున్నాకే పని మొదలు పెడుతుంది. సీఐడీలో మాత్రం అలా జరగలేదని విజిలెన్స్ విచారణలో తేలింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఆ నివేదికను అనుసరించి... టెండర్లలో ముగ్గురు బిడ్డర్లు అర్హత సాధించారు. క్రిత్వాప్ టెక్నాలజీస్ రూ.59,52,500లతో ఎస్టీ సభల కోసం ఎల్-1గా, ఎస్‌సీల సభల కోసం 59,51,100తో ఎల్-1గా నిలిచింది. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే అవగాహనా సదస్సులు పూర్తయ్యాక జనవరి 30న ఒప్పందం చేసుకొన్నారు.
ఫైర్‌లో 59.93లక్షలు స్వాహా
అగ్నిమాపక శాఖలో ఎన్‌వోసీల జారీ ఇతరత్రా అనుమతులకు సంబంధించి అగ్ని పోర్టల్ ఎన్‌వోసీ టెండర్లలో డీజీ హోదాలో సంజయ్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాత నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తించింది. పనుల్లో పురోగతి లేకుండానే ముందస్తు అడ్వాన్సులు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టినట్లు పసిగట్టింది. అగ్ని పోర్టల్‌తో పాటు హార్డ్‌వేర్ సరఫరా కోసం సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ.2.29కోట్ల ఒప్పందాన్ని 2023 ఫిబ్రవరి 23న సంజయ్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ముందస్తుగా 59.93లక్షలు ప్రైవేటు సంస్థకు ముందుగా చెల్లించేశారు. అయితే 14శాతం పని మాత్రమే పూర్తి చేసిన సౌత్రికా టెక్నాలజీస్ ఆ తర్వాత ఆపేసింది. మరోవైపు మొబైల్ యాప్ నిర్వహణ, మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టా్‌పలు, యాపిల్ ఐ ప్యాడ్‌ల కొనుగోలుకు రూ.17.89లక్షలు అదనంగా చెల్లించినట్లు విజిలెన్స్ గుర్తించింది. గత నెలలో విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న సంజయ్‌ను సస్పెండ్ చేసింది. తాజాగా ఏసీబీ విచారణకు ఆదేశించడంతో కేసు నమోదైంది.
బిల్లులన్నీ డొల్లే
అవగాహన సదస్సుల్లో పాల్గొన్న వందలాది మంది కోసం భోజనాల బిల్లు, హాల్ అద్దె, వీడియో గ్రఫీ చార్జీ, ఫర్నీచర్ అద్దె ఇతరత్రా ఇన్వాయి్‌సలన్నీ డొల్లేనని విజిలెన్స్ తేల్చింది. నిజానికి, ప్రభుత్వ హైస్కూళ్లు, బాలుర వసతి గృహాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, గిరిజన గురుకులాలు, వెలుగు కార్యాలయాలు, సామాజిక భవనాల్లో ఈ సదస్సులు జరిగాయి. సీఐడీ అధికారులు వీడియో గ్రఫీ తమ సెల్ పోన్లతో తీశారు. అయినప్పటికీ సమావేశ మందిరాలకు రెండు నుంచి మూడు లక్షల చొప్పున అద్దెలు చెల్లించినట్లు బిల్లులు సృష్టించారు. వీడియో గ్రాఫర్ బిల్లులు ఎక్కడి కక్కడ లక్షలాది రూపాయలు చెల్లించేసి 1.19కోట్లు ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చేశారు. కానీ, ఈ బిల్లులు బోగస్ అని విజిలెన్స్ తేల్చింది. సమావేశ మందిరానికి మూడు లక్షలు చెల్లించామని చెప్పిన చోట.. అది ఎంపీడీవో కార్యాలయం అని తేలింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి పరిధిలో ఎక్కడ విచారించినా పది వేల నుంచి పాతిక వేల లోపు టీ, బిస్కెట్స్, లంచ్ కోసం తీసుకున్నామని చెప్పారు. అదంతా లెక్కిస్తే 2.66లక్షలు మాత్రమేనని తేలింది. ఇతర ఖర్చులన్నీ కలిపితే మొత్తం మీద 3.10లక్షలు ఖర్చు చేసిన సీఐడీ బాస్... ఏకంగా 1.19కోట్లు డ్రా చేసుకున్నారు. అందులో చేసిన ఖర్చు పోను మాజీ సీఐడీ బాస్, ఆయన బృందం నుంచి 1,15,93,600 రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫారసు చేసింది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాలని, సంబంధిత ఏజెన్సీ(క్రిత్యా్‌ప)పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.