Viral Video: శిశువును కాపాడేందుకు ఇద్దరి సాహసం.. వైరల్ అవుతున్న వీడియో
ABN, Publish Date - Sep 04 , 2024 | 08:46 AM
తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.
విజయవాడ: తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా బిల్డింగ్‌లపై చిక్కుకుపోయారు. తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కాపాడేందుకు అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొందరు సాహసం చేసి నీళ్లలో నుంచి ఒక చోటు నుంచి మరోచోటుకి ప్రయాణిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల ఆస్తినష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నాయి. అయితే విజయవాడలో ఓ పసికూన ప్రాణాలు కాపాడేందుకు ఇద్దరు చేసిన సాహాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
నగరంలోని సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. అందులో ఉంటున్న కుటుంబం వెంట నెలలు నిండిన శిశువు ఉంది. చుట్టూ వరద నిండటంతో విషకీటకాలు, పాములు వచ్చే అవకాశం ఉండటం, అపరిశుభ్ర వాతావరణంలో శిశువుకు ప్రమాదం పొంచి ఉండటంతో శిశువును సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు పసుపు రంగు ప్లాస్టిక్ డబ్బాలో శిశువును పడుకోబెట్టి, పీకల్లోతు నీటిలో నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ కావడంతో, వారి సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నారిని సాహసోపేతంగా సురక్షిత ప్రాంతానికి తరలించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
విజయవాడలో సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 43 వేల 417 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 197 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయగా, 48 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఆహార పంపిణీ కోసం ఆరు హెలికాప్టర్లు, డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఇందులో బిస్కెట్లు, పండ్లు, పాలు, మందులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) ప్రకటన ప్రకారం.. ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు సైతం జేసీబీపై తిరుగుతు ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు.
For Latest News click here
Updated Date - Sep 04 , 2024 | 08:46 AM