రెండు నెలల్లో మునిసిపల్ శాఖలన్నీ సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లోకి
ABN, Publish Date - Oct 20 , 2024 | 04:17 AM
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.
అక్కడ పనులన్నీ పూర్తికాగానే తరలింపు
మంత్రి నారాయణ విజ్ఞప్తిపై నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయనున్న కాంట్రాక్టు సంస్థ
జనవరిలో ఎమ్మెల్యే, ఐఏఎస్ భవనాలకు, డిసెంబరులో రోడ్ల నిర్మాణానికి టెండర్లు
విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మునిసిపల్ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేయగా.. కాంట్రాక్టు సంస్థ ఆ మేరకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమరావతిలో సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పూర్తి కాగానే.. మునిసిపల్ శాఖలన్నింటినీ అక్కడకు తరలించనున్నారు. మునిసిపల్ పట్టాణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ), కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ), కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ తదితర మునిసిపల్ సంబంధిత రాష్ట్ర శాఖలన్నీ సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లో కొలువు తీరనున్నాయి. సీఆర్‌డీఏ కాంప్లెక్స్ పనులను 2017లో ప్రారంభించి రూ. 61.48 కోట్లు ఖర్చు చేశారు.
పెండింగ్ సివిల్ పనులతో పాటు ఆర్కిటెక్చరల్ ఇంటీరియర్ ఫినిషింగ్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు రూ. 160 కోట్ల వ్యయంతో బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు కిందటి నెలలో టెండర్లు పిలిచారు. ఆ వెంటనే రూ.129 కోట్ల వ్యయంతో ఆర్కిటెక్చరల్ వర్క్స్, ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్, ఎంఈపీఎఫ్ వర్క్స్, ఐసీటీ వర్క్స్ ఎక్సటర్నల్ డెవల్‌పమెంట్ వర్క్స్‌కు టెండర్లు పిలిచారు. నాలుగు సంస్థలు టెండర్లు వేయగా.. ఎల్ 1గా నిలిచిన కేపీసీ ప్రాజెక్ట్స్‌కు పనులు అప్పగించారు. ఇక రాజధానిలో అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్జీఓ, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాలు, ప్రభుత్వ టైప్ - 1 , టైప్ - 2 భవనాల పనులకు జనవరిలో టెండర్లు పిలవనున్నారు. గతంలో పిలిచిన టెండర్లన్నింటినీ రద్దు చేశారు. రాజధానిలో రోడ్ల పనులకు సంబంధించి డిసెంబరులో టెండర్లు పిలవనున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 04:17 AM