ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : సంక్షోభంలో ఇంధనం

ABN, Publish Date - Jul 08 , 2024 | 06:04 AM

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్‌ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

  • జగన్‌ అడ్డగోలు నిర్ణయాలతో జనానికి షాక్‌!

  • విద్యుత్‌ రంగంపై రూ.1,38,000 కోట్ల భారం

  • ప్రజలపై బాదుడు.. ఇటు ఇష్టారీతిన రుణాలు

  • మరోవైపు భారీ ధరలకు విద్యుత్‌ కొనుగోళ్లు

  • అదానీ, షిర్డీసాయికి మేళ్లు చేసేలా నిర్ణయాలు

  • స్మార్ట్‌ మీటర్లు, పంప్డ్‌ స్టోరేజీ అప్పగింత

  • చివరికి విద్యుత్‌ సంస్థలు అప్పుల ఊబిలోకి

  • ఇంకా జనం మెడపై 17,137 కోట్ల ‘ట్రూఅప్‌’ కత్తి

  • నేడు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ.. అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్‌ సర్కారు తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా రూ.1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కంటే రెట్టింపు ధరలకు ఎడాపెడా విద్యుత్‌ కొనుగోళ్లు చేశారు. వినియోగదారులపై భారం పడేలా ట్రూఅప్‌ పేరిట భారీగా విద్యుత్‌ చార్జీలను పెంచేశారు. అదేసమయంలో అదానీ, షిర్డీసాయి వంటి అస్మదీయ కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ప్రణాళికా లోపంతో ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు.

యాజమాన్య నిర్వహణ లోపాలతో విద్యుత్‌ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దీంతో విద్యుత్‌ రంగం పూర్తిగా కుదేలైంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన పాలనాకాలంలోని విధానాలపై నిర్ణయాలను తీసుకుంటుంది.

కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తన హయాంలోనే కాకుండా తాను అధికారాన్ని చేపట్టక ముందు, తర్వాత కాలానికి కూడా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు. 2014-2019 కాలంలో వైసీపీ ప్రభుత్వం లేదు. కానీ ఆ కాలానికి సంబంధించి ట్రూఅప్‌ చార్జీల కింద రూ.3,669 కోట్లను ప్రజల నుంచి వసూలు చేశారు. ఒకవైపు విద్యుత్‌ చార్జీలు పెంచుకుంటూ పోతూ.. మరోవైపు థర్మల్‌ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచకుండా, పెరిగిన డిమాండ్‌ పేరిట బయట నుంచి ఇబ్బడి ముబ్బడిగా అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేశారు. మరోవైపు విద్యుత్‌ సబ్సిడీ మొత్తం రూ.14,000 కోట్లను డిస్కమ్‌లకు చెల్లించలేదు. వీటన్నింటిపైనా సోమవారం సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. విద్యుత్‌ రంగాన్ని గాడినపెట్టి, పూర్వవైభవం తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నారు.


ఐదేళ్లూ బాదుదే బాదుడు

2019 ఎన్నికల ముందు జగన్‌ విద్యుత్‌ చార్జీలను పెంచనంటూ హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా ఇస్తామన్నారు. వ్యవసాయానికి పగటిపూట ఏకబిగిన తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. వినియోగదారులు భరించలేనంతగా విద్యుత్‌ చార్జీలను బాదేశారు. 2020లో కరోనా కష్టకాలంలో నెలకు 500 యూనిట్ల వాడకం దాటిన వినియోగదారులపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున రూ.1300 కోట్లను వసూలు చేశారు. ఇదే సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిపై శ్లాబుల మార్పు పేరిట రూ.1500 కోట్ల భారాన్ని వేశారు. 2021 ఏప్రిల్‌లో కిలోవాట్‌కు పది రూపాయలు పెంచడం ద్వారా రూ.3,542 కోట్ల భారాన్ని వేశారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో వాడిన విద్యుత్‌పై ట్రూఅప్‌ పేరిట రూ.3,669 కోట్లను వసూలు చేశారు. 2022లో శ్లాబులు కుదించేసి రూ.3,900 కోట్లను వసూలు చేశారు. ఫ్యూయల్‌, ఇందన కొనుగోళ్ల సర్దుబాటు పేరిట రూ.700 కోట్లు వసూలు చేశారు. అదేవిధంగా 2021లో ఇంధన కొనుగోళ్ల సర్దుబాటు పేరిట మరో రూ.3,082 కోట్లను జనం నెత్తిన జగన్‌ వేశారు. 2023 మేలో మరోసారి ఇంధన సర్దుబాటు పేరిట రూ.400కోట్లు బాదేశారు.

వేలాడుతున్న ‘ట్రూఅప్‌’ కత్తి

2022-23లో రూ.8,114 కోట్లు, 2023-24లో రూ.9,023 కోట్లు.. మొత్తంగా రూ.17,137 కోట్లను ట్రూఅప్‌ కింద వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని డిస్కమ్‌లు కోరాయి. వాస్తవానికి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపిన 120 రోజుల్లోగా వాటిపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాలి. కానీ అప్పటికే జగన్‌ సర్కారు ఎడాపెడా చార్జీలు పెంచేయడంతో జనం భయపడతారని భావించేమో కానీ నిర్ణయం తీసుకోలేదు. పెండింగ్‌లో ఉన్న రూ.17,137 కోట్ల ట్రూఅప్‌ ప్రతిపాదనలపై ఇప్పుడు ఏక్షణంలోనైనా ఈఆర్‌సీ నిర్ణయం తీసుకునే వీలుందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. ట్రూఅ్‌పపై ఈఆర్‌సీ ఆదేశిస్తే దానిని ప్రభుత్వం అమలు చేయాల్సిందే. చార్జీలు పెంచుకునేందుకు డిస్కమ్‌లకు అవకాశం ఇస్తే కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ ప్రజల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే భరిస్తానంటే.. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వంపై మోయలేనంత భారం పడుతుంది.

ఎడాపెడా కొనుగోళ్లు

గతంలో జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా.. అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ కమీషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. 2014-15లో యూనిట్‌కు రూ.3.79 చొప్పున చంద్రబాబు హయాంలో డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. 2018-19లో యూనిట్‌ రూ.4.06 చొప్పున డిస్కమ్‌లు సేకరించాయి. ఈ విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిపోయిందంటూ జగన్‌ ఆరోపణలు చేశారు. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక అంతకు రెట్టింపు ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. సగటున యూనిట్‌కు రూ.7.61 చొప్పున కొనుగోలు చేశారు. అవసరాల పేరిట యూనిట్‌ విద్యుత్‌కు రూ.29 నుంచి రూ.35 దాకా కూడా జగన్‌ ఏలుబడిలో చెల్లించారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఽధర యూనిట్‌కు రూ.10కి మించకూడదని ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేస్తే తప్ప కొనుగోళ్ల ధరలు నియంత్రణలోకి రాలేదు.

భారీ నష్టాలు

జగన్‌ జమానాలో విద్యుత్‌ రంగంలో నష్టా లు పెరుగుతూ వచ్చాయి. 2014-15 నాటికి రూ.6,625 కోట్లు నష్టాలు ఉండగా, 2023-24 నాటికి రూ.34,390 కోట్లకు పెరిగాయి. స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు కూడా భారీగానే పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాకపోయినా, వాణిజ్య సంస్థలు పెరగకపోయినా విద్యుత్‌ కొనుగోళ్లు పెరిగాయి. 2013-14లో 1291 మిలియన్‌ యూనిట్లు మాత్రమే బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన డిస్కమ్‌లు.. 2023-24 నాటికి 11,655 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ప్రవాహం పక్కదోవపడుతూ జగన్‌ అస్మదీయుల పరిశ్రమల్లోకి అనధికారికంగా సరఫరా చేయడం వల్లే ఇంత ఎక్కువ కొనాల్సి వచ్చిందంటూ అప్పట్లో నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.

Updated Date - Jul 08 , 2024 | 06:04 AM

Advertising
Advertising
<