Amaravati : పడకేసిన పశువైద్యం
ABN, Publish Date - Aug 26 , 2024 | 04:31 AM
గ్రామీణ పశువైద్యం పడకేసింది! పశువైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వం పశువైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందటం లేదు.
ఖాళీగా పశువైద్య సిబ్బంది పోస్టులు
గ్రామీణంలో అరకొరగా సేవలు
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం
కొందరు వైద్యులు పట్టణాలకే పరిమితం!
మొబైల్ అంబులెన్స్‌లే దిక్కు
గ్రామీణంలో రైతన్నలకు వ్యవసాయం ఎంతగా జీవనాధారమో.. పాడి పెంపకం కూడా అంతే ముఖ్యం! అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం పుణ్యమా అని అరకొరగానే సేవలందుతున్నాయి. పశువైద్య పోస్టులు భారీగా ఖాళీలుండడంతో పశువులకు వైద్యం గగనమైపోయింది. కొన్నిచోట్ల పశువైద్యులున్నా వారు పట్టణప్రాంతాల్లో నివాసముంటూ.. తమ పరిధిలో పారా వెటర్నరీ, గోపాలమిత్రలు, అటెండర్లతో నెట్టుకొస్తున్నారు! ఫలితంగా ఆశించిన సేవలందడంలేదని పశుపోషకులు వాపోతున్నారు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామీణ పశువైద్యం పడకేసింది! పశువైద్యులు, పారా మెడికల్ సిబ్బంది కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వం పశువైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందటం లేదు.
కేవలం అంబులెన్స్‌ల్లో ఉండే సిబ్బందితోనే వైద్యం చేయిస్తున్న పరిస్థితి నెలకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,790 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్లో దాదాపు 300 పోస్టులు ఖాళీలున్నాయి. 3,121 పారా వెటర్నరీస్ పోస్టుల్లో 690 ఖాళీలున్నాయి. గత ప్రభుత్వం 9,844 గ్రామ పశువైద్య సహాయకులను నియమిస్తామని చెప్పి, 3,739 పోస్టులు ఖాళీగా ఉంచింది.
రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, జిల్లా, డివిజన్ కార్యాలయాల్లో 2,800 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరై ఉండగా, అందులో 1,832 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీంతో గ్రామాల్లో పశుపోషకులకు ఆశించిన సేవలు అందకుండా పోతున్నాయి. కేవలం గతంలో టీడీపీ ప్రభుత్వం 2,600మంది గోపాలమిత్రలను నియమించగా, వారిలో 370మంది సచివాలయ పోస్టులకు ఎంపిక కాగా, మిగతా 2,240 మంది పని చేస్తున్నారు. వీరితోనే ఆయా గ్రామాల్లో పశువైద్యం చేయిస్తున్నారు.
గోపాలమిత్ర, అటెండర్లతోనే సేవలు!..
పశువైద్యంలో పట్టా ఉన్నా వారిలో కొంత మంది వైద్యులు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ, పరిపాలన విభాగాల్లో పోస్టులు వేయించుకుని, గ్రామీణ పశువైద్యశాలల ముఖం కూడా చూడటం లేదు.
కొంత మంది గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యులుగా ఉన్నా.. పారా వెటర్నరీస్, గోపాలమిత్ర, అటెండర్లతో పని చేయిస్తూ, నామమాత్రంగా పని చేస్తూ, తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి.
రాష్ట్రంలో రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 12 వెటర్నరీ పాలిక్లినిక్‌లు, 323 ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్, 1,577వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,218రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు ఉన్నాయి. వివిధ రకాల వెటర్నరీ ల్యాబ్‌లు 171ఉన్నాయి.
ట్రైనింగ్ సెంటర్లు, లైవ్‌స్టాక్ ఫార్మ్‌లు 16ఉన్నాయి. 340 మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌లు ఉన్నాయి. చాలా చోట్ల గ్రామీణ పశువైద్యశాలల్లో సేవలు అరకొరగా మారడంతో పశుపోషకులు మొబైల్ అంబులెన్స్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ నిర్వహణ లేక కొన్ని చోట్ల అంబులెన్స్‌లు కూడా మూలపడ్డాయి.
డిప్యుటేషన్లతో తంటా...
రాష్ట్రంలో 62లక్షల గేదెలు, 46లక్షల ఆవులు, 55లక్షల మేకలు, కోటీ76లక్షల గొర్రెలు, 10లక్షల కోళ్లుతో కలిపి మొత్తం 3.40కోట్ల పశుగణం ఉండగా, ఈ స్థాయిలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది లేరని సమాచారం.
ఈ శాఖకు మంజూరైన పోస్టుల్లో ఖాళీలను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడం, పోస్టు కేటాయించిన చోట పని చేయకుండా ప్రధాన కార్యాలయాలు, నగరాలు, పట్టణాలకు డిప్యుటేషన్ వేయించుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు పేలవంగా మారాయి.
ఇక నాణ్యమైన పాల ఉత్పత్తి, పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిన మిశ్రమ దాణ, సైలేజ్ గడ్డి, టీఎంఆర్ వంటివి సరఫరా చేసిన సంస్థలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా, చేతులెత్తేసింది. ప్రస్తుత ప్రభుత్వమైనా పశువైద్య సేవల్ని మెరుగుపర్చి, రాయితీల దాణా, అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేయాలని పశుపోషకులు కోరుతున్నారు.
Updated Date - Aug 26 , 2024 | 04:31 AM