World Bank : అమరావతికి ఆరేళ్లు నిధులు
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:14 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి రథ చక్రాలు పరుగులు పెట్టనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సొమ్ములు భారీ మొత్తంలో అందనున్నాయి.
రాజధానికి 13,592 కోట్ల రుణం
ప్రపంచ బ్యాంకు నుంచి 6,796 కోట్లు
ఆసియా అభివృద్ధి బ్యాంకు 6,796 కోట్లు
ఆరేళ్లపాటు విడతల వారీగా నిధుల రాక
రుణ షెడ్యూల్‌ను ఇచ్చిన ప్రపంచ బ్యాంకు
సీఆర్‌డీఏ కమిషనర్‌కు చేరిన షెడ్యూల్
జనవరిలో తొలి విడతగా రూ.348 కోట్లు
లక్ష్యాలు నిర్దేశించిన ప్రపంచ బ్యాంకు
వీటికి అనుగుణంగా సర్కారు ప్రణాళికలు
రాజధాని టెండరు నిబంధనల పరిశీలన
నిర్మాణ పనులనూ పర్యవేక్షించనున్న ప్రపంచ బ్యాంకు
విజయవాడ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి రథ చక్రాలు పరుగులు పెట్టనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సొమ్ములు భారీ మొత్తంలో అందనున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)లు ఏకంగా రూ.13,592 కోట్ల(1600 మిలియన్ డాలర్లు) పైచిలుకు మొత్తాన్ని రుణంగా అందించేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో ప్రపంచ బ్యాంకు రూ.6,796 కోట్లు, ఏడీబీ మరో రూ.6,796 కోట్లు ఇవ్వనున్నాయి. ఈ మొత్తాన్ని ఆరేళ్లలో విడతలవారీగా అందించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు శుక్రవారం రుణ షెడ్యూల్‌ను విడుదల చేయడంతోపాటు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించింది. ఈ మొత్తం నిధులను అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. తొలి విడత రుణం కింద రూ.348.33 కోట్లను జనవరి నెలాఖరు నాటికి సీఆర్‌డీఏకు అందించనున్నారు. ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణాన్ని ఆరేళ్ల కాల పరిమితితో(2025-31) ఇవ్వటానికి అంగీకరించినట్టు ఆ సంస్థ రీజనల్ డైరెక్టర్ మార్టిన్ రైజర్, సీఆర్‌డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ రుణానికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఆయన పంపించారు. ఈ మొత్తాన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ డెవల్‌పమెంట్(ఐబీఆర్‌డీ) విభాగం ద్వారా ప్రపంచబ్యాంకు అందిస్తోంది. మరోవైపు ఏడీబీ కూడా రూ.6,796 కోట్లను ఇంతే కాలపరిమితితో ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే, ఎప్పుడెప్పుడు ఎంతెంత రుణం ఇస్తుందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
ఆర్‌బీఎల్ ఆధారంగా
ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణం డిసెంబరు 19, 2024 నుంచి అమలులోకి రానుంది. తాము ఇచ్చే రుణాన్ని ఫలితం ఆధారిత రుణం(ఆర్‌బీఎల్) విధానంలో ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ప్రపంచబ్యాంకు కొన్ని లక్ష్యాలను కూడా పేర్కొంది. ఆ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. ఈ ఫలితాల సాధనను బట్టి తదుపరి రుణ మొత్తాన్ని ఇవ్వనున్నారు. కాగా, రుణానికి సంబంధించిన కొన్ని షరతులు కూడా ఉన్నాయి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రపంచబ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వీయ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిని అతిత్వరగా సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇదిలావుంటే.. అమరావతి నిర్మాణంలో భాగంగా సీఆర్‌డీఏ త్వరలో పిలవనున్న టెండర్ల ప్రక్రియను ప్రపంచ బ్యాంకు బృందం కూడా పరిశీలించింది. టెండర్ల నిబంధనలను సైతం ఈ బృందం అధ్యయనం చేసింది. టెండర్లు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనుల వరకు అన్నింటినీ ప్రపంచ బ్యాంకు బృందం పర్యవేక్షించనుంది.
రాష్ట్ర సర్కారు నుంచి కూడా
అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 3,644 అమెరికన్ మిలియన్ డాలర్లు(రూ.30,957.67 కోట్లు) ఖర్చు అవుతుందని ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు నివేదించింది. ఈ మొత్తంలో ఆపరేషనల్ కాస్ట్ 1,784 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. దీనిలో 1600 మిలియన్ డాలర్లను ఇచ్చేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. మిగిలిన 184 అమెరికన్ మిలియన్ డాలర్ల(రూ.1563.15 కోట్లు)ను సీఆర్‌డీ ఏ, ఏడీసీలు భరించాల్సి ఉంటుంది. వీటికి అంత ఆర్థిక పరిపుష్టి లేదు కాబట్టి ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుంది.
ఇవీ ప్రపంచ బ్యాంకు లక్ష్యాలు
సమర్ధవంతమైన పౌర సేవలు. స్థానిక పరిపాలన.
భూ పర్యవేక్షణ-ప్రైవేట్ పెట్టుబడులకు పెద్దపీట.
మెరుగైన కొత్త ఉద్యోగాలను కల్పించటం.
సుస్థిర రవాణా వ్యవస్థలను నెలకొల్పడం.
రాష్ట్ర ప్రభుత్వ స్వీయ లక్ష్యాలు ఇవీ..
అమరావతిలో 2050 నాటికి 35 లక్షల మంది ప్రజలకు వసతి కల్పించేలా మౌలిక సదుపాయాలు.
మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో గృహాల నిర్మాణం.
ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు నవీ ముంబై మోడల్ అనుసరణ.
రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించేలా మాస్టర్ ప్లాన్.
వచ్చే ఐదేళ్లలో అమరావతిలో 50 వేల ఉద్యోగాల కల్పన.
Updated Date - Dec 21 , 2024 | 03:14 AM