ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ!

ABN, Publish Date - Aug 09 , 2024 | 06:10 AM

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.

  • ఉప కులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు

  • జిల్లాల్లో దామాషా ప్రకారం లబ్ధి

  • ఇలాగైతే ఎవరికీ సమస్యలు ఉండవు

  • పొలిట్‌బ్యూరో భేటీలో చంద్రబాబు

  • జాతీయ రహదారుల నమూనాలో

  • ప్రైవేటు పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు

  • లారీలు, కార్ల వరకే టోల్‌ వసూలు

  • అదీ బాగా పెద్ద రోడ్లయితేనే!

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీ నేతల భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఈ అంశం పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది.

జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఆ జిల్లాలో ఉప కులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ సమస్యలు ఉండవని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఏ జిల్లాలో ఏ ఉప కులం జనాభా ఎంత ఉంటే అంత దామాషాలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి.

ఈ నిర్ణయానికి పొలిట్‌బ్యూరో ఆమోద ముద్ర వేసింది. సమావేశంలో పాల్గొన్న రెండు దళిత ఉప కులాల నేతలెవరూ దీనిపై ఏ వ్యాఖ్యా చేయలేదు.

ఇక రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారుల నమూనాలో అభివృద్ధి చేసే విషయం పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. టెండర్‌ పొందిన కంపెనీ తన పెట్టుబడితో జాతీయ రహదారి నిర్మించి తర్వాత టోల్‌ ఫీజుల ద్వారా తన ఖర్చును రాబట్టుకుంటోంది.

రాష్ట్ర రహదారులను కూడా ఇదే పద్ధతిలో నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సందేహం వ్యక్తం చేశారు. ‘మనం ద్వి చక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు వంటివాటికి టోల్‌ వసూలు చేయం.


కార్లు, లారీలు, బస్సులకు మాత్రమే వసూలు చేయాలనుకుంటున్నాం. రోడ్లు బాగుంటే పెద్ద వాహనాలకు లాభం. వాళ్లు టోల్‌ ఫీజు కట్టడానికి వెనకాడరు’ అని ముఖ్యమంత్రి బదులిచ్చారు. బాగా పెద్ద రోడ్లకు మాత్రమే ఈ విధానం అమల్లోకి తేవాలనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రాజెక్టుల కింద సాగునీటి కాల్వల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చిందని, దానిపై పార్టీ నేతలు తమ ఆలోచనలు చెప్పాలని కోరారు. బాగానే ఉందని ఒకరిద్దరు నేతలు చెప్పారు.

సీట్లు కోల్పోయినవారికే పెద్దపీట మిత్రపక్షాలకు సీట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుకు మనం ఒక విధానం పెట్టుకుని పనిచేశాం. ఎవరి సిఫారసులూ తీసుకోలేదు. ఇప్పుడు నామినేటెడ్‌ పదవుల భర్తీలోనూ అదే అవలంబిస్తున్నాం. ఎవరి సిఫారసులూ ఉండవు.

ఎన్నికల్లో ఎవరు బాగా పనిచేశారో సమాచారం తెప్పించుకుని విశ్లేషించి వివిధ సమీకరణల ఆధారంగా భర్తీ చేస్తాం’ అని వివరించారు. కొద్ది రోజుల్లోనే నామినేటెడ్‌ పోస్టుల తొలి జాబితా విడుదల అవుతుందన్నారు.

మిత్రపక్షాలకు పదవులు ఇంత శాతమని అనుకోకుండా.. ఎవరు బాగా పనిచేస్తే వారికి అవకాశాలివ్వడం బాగుంటుందని ఒక నేత సూచించారు.

ఎన్నికలకు ముందే ఎన్డీయేలో చేరడం బాగా ఉపయోగపడిందని, ఇంకా జాగ్రత్తగా పనిచేస్తే వైసీపీ గెలిచిన 11 సీట్లలో నాలుగైనా గెలవగలిగేవారమని సీఎం వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు పార్టీ నుంచి మార్గదర్శకత్వం ఉండాలని సూచించారు.


‘మద్యంపై ఒక విధానం అనుకుంటున్నాం. ఆ శాఖ మంత్రి కొందరు పార్టీ నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అవసరమైతే ఆ విధానంపై జిల్లాల్లో సమావేశాలు పెట్టి అక్కడి నేతల సలహాలు కూడా తీసుకుంటారు. అలాగే ఉచిత ఇసుక విధానం మరింత మెరుగ్గా ఎలా ఉండాలన్నదానిపైనా పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటాం.

విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ వాణి ప్రముఖంగా ఉండాలన్నది నా ఆలోచన’ అని చెప్పారు. ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేసేవారు స్టాక్‌ పాయింట్ల నుంచి కాకుండా నేరుగా నదుల నుంచి తీసుకునే అవకాశం కల్పించాలని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుందని కొందరు నేతలు సూచించారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదు.

10% మంది ద్వారా 20% మంది అభివృద్ధి

సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న పది శాతం మంది ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందిని పైకి తేవాలన్నది తమ ఆలోచనగా చంద్రబాబు తెలిపారు. దీనినెలా అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ రెండు వర్గాల మధ్య అనుసంధానానికి వలంటీర్లను వినియోగిస్తే బాగుంటుందని, వారికిప్పుడు పెద్దగా పని కూడా లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సూచించారు. ఈ ఆలోచన బాగుందని, తమ కసరత్తులో దీనిపై కూడా దృష్టి పెడతామని సీఎం చెప్పారు.


సోమశిల, కండలేరు ఎప్పటికి నిండేనో..!

తమ జిల్లాలో సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటి మట్టం అట్టడుగుకు పడిపోయిందని, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కుల నీరు మాత్రం వస్తోందని... ఈ లెక్కన అవి ఎప్పటికి నిండుతాయో అర్థం కావడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమావేశంలో అన్నారు.

‘పోతిరెడ్డిపాడు నుంచి 40 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుని అన్ని కాల్వలకు పంచితే మీకంత వస్తున్నాయి. అక్కడి నుంచి అంతకంటే ఎక్కువ తీసుకోవడం కుదరడం లేదు. అందుకే నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాం. ప్రధాని కూడా సుముఖంగా ఉన్నారు. అది జరిగితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగునీటి సమస్య చాలావరకూ పరిష్కారం అవుతుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ స్థానిక ఎన్నికల బరిలో టీడీపీ!

తెలంగాణలోనూ తిరిగి టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీని సన్నద్ధం చేసే ఆలోచన ఉందని తెలిపారు.


  • ఇద్దరు కార్యకర్తలకు అరుదైన గౌరవం

  • సచివాలయానికి పిలిపించుకున్న చంద్రబాబు

ఇద్దరు సామాన్య టీడీపీ కార్యకర్తలకు అరుదైన గౌరవం లభించింది. చంద్రబాబు గురువారం వారిద్దరినీ అమరావతి సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మహిళా కార్యకర్త దుర్గాదేవి, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాగరాజు యాదవ్‌లకు ఈ అవకాశం లభించింది. ఈ ఇద్దరూ పార్టీకి వీరాభిమానులు. ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నవారు. చంద్రబాబు ఏ కార్యక్రమం నిర్వహించినా ఠంచనుగా హాజరవుతారు. దుర్గాదేవికి ఒక స్కూటీ ఉంది.

చంద్రబాబు ఎక్కడ పర్యటించినా.. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె తన స్కూటీపై ఎంత దూరమైనా వెళ్లి పాల్గొనేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆమె మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై ఆయన్ను పోలీసులు తీసుకొస్తున్న వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. పోలీసులు నెట్టివేసి కొట్టినా ఆగలేదు. నాగరాజు మరీ సామాన్య కార్యకర్త.

పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారంటే బస్సెక్కి వచ్చేస్తాడు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా హాజరవుతాడు. అమాయకంగా ఉండే నాగరాజును పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

చంద్రబాబు అరెస్టు సమయంలో వీరిద్దరూ రాజమహేంద్రవరం జైలు వద్దే కొన్ని రోజులు ఉండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూశారు.

తనపై అంతులేని అభిమానం ఉన్న ఈ ఇద్దరినీ చంద్రబాబు గుర్తుపెట్టుకుని తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా గురువారం సెక్రటేరియట్‌కు పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలుకరించి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. తమ అధినేత ఆదరణకు వారిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

Updated Date - Aug 09 , 2024 | 06:13 AM

Advertising
Advertising
<