Drug : మత్తుగా.. నేరాలు..!
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:43 AM
యువత గంజాయికి బానిస అవుతోంది. ఒకప్పుడు ఎక్కడైన గొడవలు జరిగితే.. ‘మద్యం మత్తులో’ అని పోలీసులు చెప్పేవారు. ఇప్పుడు చెప్పకపోయినా.. ‘గంజాయి మత్తులో’ అని తేటతెల్లమౌతోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు, హత్యలు, లైంగిక వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, చోరీలకు గంజాయి మత్తే కారణమని పోలీసులే చెబుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, శివారు ప్రాంతాలలో ...
చెలరేగిపోతున్న గంజాయి ముఠాలు..
జిల్లా వ్యాప్తంగా భారీగా విక్రయాలు
ఒడిశా నుంచి వచ్చే సరుకే ఎక్కువ
క్షేత్రస్థాయిలో కొందరు పోలీసుల సహకారం
పసిగట్టి.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ
అనంతపురం క్రైం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): యువత గంజాయికి బానిస అవుతోంది. ఒకప్పుడు ఎక్కడైన గొడవలు జరిగితే.. ‘మద్యం మత్తులో’ అని పోలీసులు చెప్పేవారు. ఇప్పుడు చెప్పకపోయినా.. ‘గంజాయి మత్తులో’ అని తేటతెల్లమౌతోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు, హత్యలు, లైంగిక వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, చోరీలకు గంజాయి మత్తే కారణమని పోలీసులే చెబుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, శివారు ప్రాంతాలలో సాధారణంగా గంజాయి విక్రయాలు, వినియోగం జరిగేది. ఇప్పుడు అక్కడ, ఇక్కడ అన్న తేడా లేకుండా పోయింది. చదువురానివారు, చదువుకున్నవారు,
ఉద్యోగులు సైతం గంజాయి వినియోగం, విక్రయం ప్రక్రియలో భాగమౌతున్నారు. పోలీసులకు తెలియకుండా గుట్టుగా ఈ వ్యవహారం సాగడం లేదు. బహిరంగంగానే సాగుతోంది. చిన్న చిన్న గొడవలు జరిగితే.. పోలీసులు లోతుగా విచారించడం లేదు. రౌడీ షీటర్ల గొడవలను కూడా కొంత తేలిగ్గానే తీసుకుంటున్నారు. దీనికితోడు నేర చరిత్ర ఉన్నవారు రాజకీయ నాయకుల నీడలో చేరుతున్నారు. దీంతో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి అదుపులోకి తీసుకున్నా.. వదిలేస్తున్నారు. గంజాయి కట్టడికి సహకరించాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం తమ పంచన ఉన్నారనే కారంణగా నేరస్థులకు అండగా నిలుస్తున్నారు. ఇదే అదనుగా గంజాయి బ్యాచలు చెలరేగిపోతున్నాయి.
అనంతపురం నగరంలో..
- గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం శుక్రవారం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం ఓ పోలీస్ స్టేషనలో ఉంచారు.
- ఎర్రనేల కొట్టాలలో గత నెల 20న గంగమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రకాష్ తరచూ గంజాయి తీసుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
- సెప్టెంబరు 11న వినాయక నిమజ్జనోత్సవంలో తేజ అనే వ్యక్తిని వంశీ అనే యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. అది మద్యం మత్తులో జరిగిన ఘటనే అయినా.. నిందితుడు తరచూ గంజాయి తీసుకునేవాడని పోలీసులు గుర్తించారు
- తుని పోలీసులకు రెండు నెలల క్రితం ఓ బాలుడు గంజాయి తెస్తూ పట్టుబడ్డాడు. ఆ బాలుడు అనంతపురం నగరంలోని త్రీటౌన పోలీస్‌స్టేషన పరిధిలో ఉంటాడని తేలింది.
గుత్తి ఆర్‌ఎస్‌లో..
ఈ నెల 6న ఓ రౌడీషీటర్ గంజాయి మత్తులో హల్‌చల్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ఫిర్యాదు శారు. ఆ చర్యతో రౌడీ షీటర్ కాస్తయినా భయపడాలి. కానీ, నేరుగా ఆ మహిళ ఇంటికెళ్లి ‘నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా..? ఎలా తిరుగుతావో చూస్తా..! చంపేస్తా..!’ అని బెదిరించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల కళ్లుగప్పి అనంతపురంలో తలదాచుకున్న రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గుత్తి ఆర్‌ఎ్‌సలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రైల్వే జంక్షన కావడంతో దందా బాగా సాగుతోంది. మత్తుకు అలవాటు పడ్డ యువత గొడవలకు దిగుతోంది. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే తప్ప తమకు రక్షణ లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా విస్తరణ
- బెళుగుప్ప మండలం అంకంపల్లి సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి బెంగళూరుకు గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఉన్నతాధికారులు సస్పెన్షన వేటు వేశారు. అతని స్వగ్రామం గంగవరం. బెళుగుప్ప తండాలో కొందరు యువకులు నిత్యం గంజాయి మత్తులో ఉంటారని స్థానికులు అంటున్నారు. ఆ మత్తులో దొంగతనాలు చేస్తుంటారని సమాచారం. మూడు నెలల క్రితం పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గంజాయితో పట్టుబడ్డారు.
- ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని ఓ వైసీపీ నాయకుడి అనుచరుడు నేతాజీని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన దీపక్ అనే వ్యక్తి నుంచి ఇతనికి గంజాయి సరఫరా అయ్యేది. నేతాజీ నుంచి మరికొందరికి సరఫరా అయ్యేది. గంజాయి కేసులో అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు తాజాగా 11మందిని అరెస్టు చేశారు.
ఒడిశా నుంచి...
జిల్లాలో గంజాయి బ్యాచ కొన్నేళ్ల నుంచి రెచ్చిపోతోంది. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తుల నుంచి జిల్లాకు గంజాయి సరఫరా అవుతోంది. కిలో రూ.4వేల నుంచి రూ.5వేల వరకు స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తుంటారు. వాటిని జిల్లాలో చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తుంటారు. నగరంలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని నెలలుగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. దాదాపు అన్ని కేసుల్లో పట్టుబడిన గంజాయి ఒడిశా ప్రాంతం నుంచే వస్తోందని స్పష్టమైంది. అనంతపురం నగరం సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యువత గంజాయికి బానిస అవుతోంది. మత్తులో తేలుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, దాడులకు వెనుకాడటం లేదు. తొలుత రైల్వే కేంద్రంగా ఉన్న గుంతకల్లుకు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా అయ్యేది.
వినియోగం... విస్తారం..
- అనంతపురం నగరంలో బుడ్డప్ప నగర్, నవోదయ కాలనీ, చెరువుకట్ట, ప్రభుత్వాసుపత్రి వెనుకవైపు, ప్రసన్నాయపల్లి రైల్వే స్టేసన పరిసరాల్లో, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన, కళ్యాణదుర్గం, బళ్లారి బైపాస్ నుంచి రుద్రంపేట బైపాస్ వరకూ, అక్కడి నుంచి ఆలమూరు రోడ్డులోని ప్రైవేటు కాలేజీల వరకూ, తపోవనం సరిహద్దుల్లో గంజాయి దందా నడుస్తోంది. అంతపురం నగరంలో గంజాయి సిగరెట్లలో పెట్టి అమ్ముతుంటారని ప్రచారం ఉంది.
-తాడిపత్రిలో రైల్వే స్టేషన సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురిని కొన్నిరోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు బాలలు కావడం గమనార్హం. తాడిపత్రి టైలర్స్ కాలనీ, భగతసింగ్ నగర్, పోరాట కాలనీ, నంద్యాల రోడ్, శివాలయం సమీపంలోని రింగ్‌రోడ్డు, శ్రీనివాసపురం, నందపాలడు ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.
-గుంతకల్లు పట్టణంలో పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా ఉన్నాయి. తాజాగా షికారీ కాలనీలో పలువురిని అరెస్టు చేశారు. ప్రశాంతి నగర్‌లోని పార్కు, కసాపురం రోడ్డులోని నల్లేని గుట్ట, ధోని ముక్కల రోడ్డులోని బ్రిడ్జి, రైల్వేస్టేషన సమీపంలో గంజాయి విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి.
- గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాధువుల ముసుగులో కొందరు గంజాయి సేవిస్తుంటారని స్థానికులు అంటున్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లోనూ గంజాయి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
పోలీసులకు మరకలు
గంజాయి కట్టడికి పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సరైన ఫలితాలు రావడం లేదు. గంజాయి విక్రేతలకు కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో కిలోల కొద్దీ గంజాయి దొరుకుతోంది. పట్టుబడనిది, పోలీసుల సహకారంతో అమ్ముతున్నది ఇంతకు పది రెట్లు ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. గంజాయి విక్రేతల నుంచి కొన్ని ప్రాంతాలలో కానిస్టేబుల్ నుంచి ఏఎ్‌సఐ స్థాయి అధికారి వరకూ ముడుపులు తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఈ మరక కొందరు పై అధికారులకూ అంటుతోంది. నెల మొత్తంలో ఒకేసారి వారికి వెళుతోందని అంటున్నారు. పై నుంచి ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే అడపా దడపా గంజాయిని పట్టుకుని, అరెస్టులు చూపిస్తున్నారని, పూర్తి స్థాయిలో నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఎస్పీ స్పెషల్ టీం
గంజాయి కట్టడిపై ఎస్పీ జగదీష్ రెండు నెలల నుంచి దృష్టి సారించారు. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నేతాజీ అనే వ్యక్తి చాలాకాలంగా గంజాయి అమ్ముతున్నట్లు తెలిసినా.. రాజకీయ అండ ఉండటంతో పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా ఎస్పీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందమే అతన్ని అరెస్టు చేసింది. నేతాజీని విచారిస్తే.. ముఠాలోని 11 మంది డొంక కదిలింది. వారిని అరెస్టు చేసి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరికొందరిపైనా ప్రత్యేక బృందం నిఘా వేసింది. ఈ క్రమంలో అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న ఓ బాలుడిని శుక్రవారం వనటౌన సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ అదుపులోకి తీసుకుని, 1.15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నేతాజీ వద్ద రెండు కిలోల గంజాయిని రూ.20 వేలకు కొన్నట్లు బాలుడు చెప్పినట్లు సమాచారం. బాలుడు గంజాయి మత్తుకు బానిసైనట్లు గుర్తించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 10 , 2024 | 12:43 AM