GUMMANUR JAYARAM : నా విజయం తథ్యం..!
ABN, Publish Date - May 04 , 2024 | 11:33 PM
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...
తాగునీటి సమస్యను ఏడాదిలోనే పరిష్కరిస్తా
టీడీపీ కూటమి గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు.
- నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..?
జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా నిధులు కావాలి. వైసీపీ ప్రభుత్వంలో నిధుల మాటే లేదు. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది ఖాయం. చంద్రబాబు అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తి. ఆయన ద్వారా నిధులను తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను.
- మీరు స్థానికులు కాదన్న ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఎలా ఎదుక్కొంటారు?
జయరాం: ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ప్రశ్న. ఏం అభివృద్ధి చేశామన్నది ముఖ్యం. ఇక్కడి ఎమ్మెల్యే కూడా మరొక చోటి నుంచి వచ్చినవాడే. అతడు చేసింది శూన్యం. వెంకట రామిరెడ్డి వైఫల్యాలు, కబ్జాలే అతడిని చిత్తుగా ఓడిస్తాయి. అభివృద్ధి ఏంటో నేను చేసి చూపుతాను.
- టీడీపీ హయాంలో చేపట్టిన అమృత పథకం వైసీపీ హయాంలో కూడా పూర్తికాలేదు. మీ చొరవ ఎలా ఉంటుంది?
జయరాం: అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కనుకే ఆ పథకం పూర్తిచేయలేకపోయారు. చంద్రబాబు హయాంలో అమృత పథకం పూర్తిచేసి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాను.
- గుత్తిలో తాగునీరు లేక ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.. ఏం చేస్తారు..?
జయరాం: ఒక్క సంవత్సరంలోనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. రాసిపెట్టుకోండి. ఇది నా ఎన్నికల హామీ.
- పార్టీ వేవ్ ఉందికదా, మీ గెలుపు సునాయాసం అనుకుంటున్నారా?
జయరాం: పార్టీకి ఉన్న గెలుపు పవనాలేకాదు, ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డిపై, వైసీపీపై ఉన్న ప్రజాగ్రహం కూడా నా భారీ విజయానికి బాటలువేస్తుంది. ఇప్పుడు కూడా ప్రచారాల్లో ఎమ్మెల్యే కంటే ఆయన కూతురే ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డా, లేక నైరుతమ్మా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో పది రోజుల్లో వైసీపీ ఓడలు బండ్లవుతాయి.
- గుంతకల్లు ఏసీఎస్ మిల్లు గురించి ఆలోచించారా?
జయరాం: మిల్లు విషయంగా చిత్తశుద్ధితో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. నేను ఎమ్మెల్యే కాగానే దానిపై దృష్టిని సారిస్తాను.
- టీడీపీ వర్గాలూ మీ కారణంగా ఏకమయ్యాయి. సమూహాన్ని ఎలా మేనేజ్ చేస్తారు..?
జయరాం: నా కారణంగా అనైక్యత ఉన్నచోట ఐక్యత సాధ్యపడింది కదా..! ఇది పార్టీకి మంచిదే కదా..! ఎవరినీ నేను దూరం చేసుకోను. సొంత లాభం అంతా మానుకొనైనా సరే నమ్మి వచ్చినవారికి న్యాయం చేస్తాను. అన్ని అడ్డంకులను అధిగమించి, అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో విజయాన్ని
అందుకుంటారు.
- మెజారిీ ఎంత ఉంటుందని భావిస్తున్నారు?
జయరాం: టీడీపీకి ఈ ఎన్నికలు అద్భుత విజయాన్ని అందిస్తాయి. పార్టీకి ఇది నిజంగా అమృత కాలం. మంచి తరుణంలో టీడీపీ అభ్యర్థిగా నిలవడం నా అదృష్టం. ఆలూరులో కంటే భారీ విజయాన్ని ఇక్కడ అందుకుంటాను. ఇది తథ్యం.
- గుంతకల్లు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 04 , 2024 | 11:33 PM