అడవి కాదు.. కాలువ..!
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:12 AM
పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం చెరువుకు నీరు తరలించే కుడికాలువ నిర్వహణను వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండింది. చూడటానికి చిట్టడవిని తలపిస్తుంది. దాదాపు 112 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ మరమ్మతులకు గడిచిన ఐదేళ్లలో పైసా ఇవ్వలేదు. ప్రతి ఏటా నిధుల కోసం అధికారులు నివేదికలు పంపడం.. అవి బుట్టదాఖలు కావడంతోనే ఐదేళ్లు గడిచిపోయింది. కాలువకు ఇరువైపులా కంపచెట్లు పెరిగినందున నీరు వదిలితే గండ్లు పడే ప్రమాదం ఉంది. కూడేరు ...
పొదలతో నిండిన పీఏబీఆర్ కుడికాలువ
నిర్వహణకు నిధులివ్వని వైసీపీ ప్రభుత్వం
వేలాది ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
నీరు వదిలితే బోరుబావులకు జీవం
కూడేరు, సెప్టెంబరు 26: పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం చెరువుకు నీరు తరలించే కుడికాలువ నిర్వహణను వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండింది. చూడటానికి చిట్టడవిని తలపిస్తుంది. దాదాపు 112 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ మరమ్మతులకు గడిచిన ఐదేళ్లలో పైసా ఇవ్వలేదు. ప్రతి ఏటా నిధుల కోసం అధికారులు నివేదికలు పంపడం.. అవి బుట్టదాఖలు కావడంతోనే ఐదేళ్లు గడిచిపోయింది. కాలువకు ఇరువైపులా కంపచెట్లు పెరిగినందున నీరు వదిలితే గండ్లు పడే ప్రమాదం ఉంది. కూడేరు మండలం మరుట్ల చెరువు నుంచి తాడిమర్రి మండలం అగ్రహారం చెరువు వరకు కాలువ కింద దాదాపు 49 చెరువులు ఉన్నాయి. కుడికాలువకు నీరు వదిలితే
దాదాపు 7500 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. బోరుబావుల కింద 50 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
నష్టాల మూట
పీఏబీఆర్ డ్యాం నుంచి కుడి కాలువకు నీరు వదిలితే చెరువులు నిండుతాయి. ఆయకట్టు సాగులోకి వస్తుంది. చెరువుల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి.. బోరుబావులు జీవం పోసుకుంటాయి. గత ఏడాది కుడికాలువకు నీరు వదలకపోవడంతో బోరుబావులు చాలామటుకు ఎండిపోయాయి. నీరు లేక చీనీ, ద్రాక్ష పంటలు దెబ్బతిన్నాయి. వాటిని కాపడుకునేందుకు ట్యాంకర్లతో నీటి తడులను అందించారు. బోరు బావులు అడుగంటిపోవడంతో వేరుశనగ, టమోటా, మిరప, అలసంద తదితర పంటలు ఎండిపోయాయి. చెరువులు ఎండిపోవడంతో పశువులకు గ్రాసం కొరత ఏర్పడింది. చాలా మంది రైతులు పశువులను అమ్ముకున్నారు.
ఈ సారైనా వదిలేరా..?
తుంగభద్ర డ్యాం నిండటంతో అధికారులు పీఏబీఆర్‌కు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర డ్యాం నుంచి లింక్ చానల్ ద్వారా 400 క్యూసెక్కుల నీరు పీఏబీఆర్‌కు వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 2.125 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడికాలువకు నీరు వదలాలంటే డ్యాంలో 1.12 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఉండాలి. ప్రస్తుతం డ్యాంలో అంతకంటే ఎక్కువగానే నీరుంది. కానీ కుడికాలువకు డిసెంబరులో నీటిని వదలడం ఆనవాయితి. ఈ లోగా విద్యుదుత్పత్తికి డ్యాం నీటిని వాడుతారు. డిసెంబరు వరకూ నీటి నిల్వలను కాపాడుకుని, కుడి కాలువకు నీరు వదిలితే వేలాది ఎకరాల ఆయకట్టుకు మేలు జరుగుతుంది. బోరు బావులు రీచార్జి అవుతాయి. గత ఏడాది డ్యాంలో నీరు లేని కారణంగా కాలువకు వదలలేదు. ఈ ఏడాదైనా తప్పనిసరిగా నీరు వదలాలని రైతులు కోరుతున్నారు.
నీరు వదలాలి..
కుడి కాలువకు నీరు వస్తే బోరుబావుల్లో నీరు పెరిగి పంటలు సాగు చేసుకునే వీలు ఉంటుంది. గత సంవత్సరం నీరు రాకపోవడంతో బోరుబావులు ఇంకిపోయాయి. భూములను సాగు చేయలేకపోయాము. ఈ ఏడాదైనా నీరు వదలితే బోరు బావు లు రీచార్జి అవుతాయి. పంటలను సాగు చేస్తే పశువులకు గ్రాసం కూడా దొరుకుతుంది. - వెంకటేష్, కూడేరు
కుడికాలువే ఆధారం..
పీఏబీఆర్ నుంచి కుడికాలువ నీరు వదిలితే మా బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. గత ఏడాది కాలువకు నీరు రాకపోవడంతో బోర్లలో నీరు తగ్గిపోయింది. కాలువకు సమీపంలో మా బోర్లు ఉన్నాయి. ఈ ఏడాదైన నీరు వదిలి రైతులను ఆదుకోవాలి.
- రమణ, కూడేరు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 27 , 2024 | 12:12 AM