Rain : వాగులు పొంగేలా వాన
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:51 PM
జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ...
మునిగిన పంట పొలాలు, కాలనీలు.. ఇళ్లలోకి చేరిన నీరు
అనంతపురం అర్బన/ బొమ్మనహాళ్/ పెద్దవడు గూరు/ విడపనకల్లు, అక్టోబరు 5: జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ఉరవకొండ 34.2, శెట్టూరు 30.4, కంబదూరు మండలంలో 28.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 27.4 మి.మీ.లోపు వర్షపాతం నమోదైంది.
పొంగిపొర్లిన వాగులు, వంకలు
భారీ వర్షం పడిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెద్దవడుగూరు మండలం వీరన్నపల్లి సమీపంలో శనివారం ఉదయం నూర్పిడి యంత్రాన్ని తీసుకుని వాగు దాటే ప్రయత్నం చేసిన ఆరుగురు కూలీలు మధ్యలోనే చిక్కుకుపోయారు. వీరు వాగు మధ్యలోకి వెళ్లే సమయానికి వరద ఉధృతి
ఎక్కువైంది. పరిస్థితిని గమనించిన స్థానికులు.. పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దారు ఉషారాణి, ఎస్‌ఐ రెడ్డప్ప స్పందించి.. ఎక్స్‌కవేటర్ సాయంతో కూలీలతోపాటు నూర్పిడి యంత్రాన్ని ఒడ్డుకు చేర్చారు. రాయదుర్గం-బళ్లారి మార్గంలో సోమలాపురం, హిర్దేహాళ్, ఉద్దేహాళ్ వద్ద వాగులు పొంగిపొర్లడంతో శనివారం తెల్లవారు జాము నుంచి మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామ సమీపంలోని కాలనీలో నీరు చేరింది. పలు ఇళ్లు, సినిమా హాలు జలమయమయ్యాయి. బండూరు ఆర్డీటీ కాలనీ నీట మునిగింది. బొమ్మనహాళ్ తహసీల్దార్ కార్యాలయంలోకి, నేమకల్లులోని అంగనవాడీ కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బళ్లారి-కళ్యాణదుర్గం రహదారిపై వరదనీరు చేరింది. మల్లికేతి రోడ్డులో కల్వర్టు కూలిపోయింది.
భారీగా పంటనష్టం
బొమ్మనహాళ్ మండలంలో సిద్దరాంపురం, బందూరు, శ్రీధరఘట్ట, బీఎన హల్లి గ్రామాల పరిధిల్లో 44.80 హెక్టార్లల్లో మిరప, 8.80 హెక్టార్లల్లో టమోట పంట నీటమునిగింది. తద్వారా రూ.83 లక్షలకుపైౖగా పంటనష్టం జరిగిందని ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బొమ్మనహాళ్ మండలంలో వరి, మిరప, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. గుంతకల్లు మండలం బుగ్గసంగాలలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి ఇద్దరు రైతులు 9 ఎకరాల్లో సాగు చేసిన ట్రెల్లిస్ కాకర పంట నేలమట్టమైంది. రూ.9 లక్షలు దాకా నష్టం జరిగింది. విడపనకల్లు మండలం పాల్తూరు, గాజులమల్లాపురం, హావలిగి ప్రాంతాల్లో 500 ఎకరాల్లో వరి పంట నీటి మునిగింది.
- బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్‌లో నీట మునిగిన కాలనీలను పంచాయతీ కార్యదర్శి శివన్న, టీడీపీ నాయకులు నవీన, సంగప్ప, సైకిల్‌షాప్ హనుమంతు, మాజీ సర్పంచ కోటేశ్వరరెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హరేసముద్రం, బొమ్మనహాళ్ గ్రామాలలో తహసీల్దార్ మునివేలు పర్యటించారు.
వేదవతికి వరద
కణేకల్లు: వేదవతి హగరి నదికి శనివారం సాయంత్రం వరద నీరు పోటెత్తింది. కణేకల్లుతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నది నిండుగా ప్రవహిస్తోంది. కణేకల్లు-మాల్యం మధ్య నదిలో రహదారి నీట మునిగింది. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
నీట మునిగిన వేరుశనగ
గుంతకల్లు: ఇమాంపురంలో నలుగురు రైతులు ఆరబెట్టిన వేరుశనగ దిగుబడులు నీట మునిగాయి. కోత కోసిన అనంతరం కాయలను పొలంలో ఆరబెట్టి టార్పల్ కప్పిపెట్టారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో నీరు చేరి తడిసిపోయాయి. రైతులు రా మాంజనేయులు, నాగేంద్ర, చంద్రశేఖర్, బాల కుళ్లాయిస్వామి తీవ్రంగా నష్టపోయారు. కాయలు రంగు మారి చెడిపోతాయని, అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు విన్నవించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 05 , 2024 | 11:51 PM