Share News

Shinganamala pond : మరువ కష్టాలు

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:25 AM

శింగనమలలోని శ్రీరంగరాయల చెరువు నిండి మరువ పారితే ఉధృతి తగ్గేవరకూ 40 నుంచి 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి మరువ వద్ద బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్ల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, అప్పటి ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ...

 Shinganamala pond : మరువ కష్టాలు
Shinganamala pond is full and flowing river

శింగనమల చెరువు నిండితే రాకపోకలు ఉండవు

బడి మానేసి.. ఇంటివద్దే పల్లెటూరి విద్యార్థులు

2022లో నాలుగు నెలలపాటు ప్రజలకు కష్టాలు

బ్రిడ్జి నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే ఉత్తుత్తి హామీలు

కూటమి ప్రభుత్వంలో కష్టాలు తీరేనా..?

శింగనమలలోని శ్రీరంగరాయల చెరువు నిండి మరువ పారితే ఉధృతి తగ్గేవరకూ 40 నుంచి 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి మరువ వద్ద బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్ల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, అప్పటి ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు నెలల తరబడి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం తాడిపత్రి, అనంతపురం నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. మరువ పారిందంటే వీరికి ప్రయాణాలు కష్టతరమౌతాయి. అనంతపురానికి రావాలంటే గార్లదిన్నె మీదుగా, తాడిపత్రికి వెళ్లాలంటే కొరివిపల్లి, పెద్ద పప్పూరు మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. సోదనపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. మరువ పారితే వీరు బడికి వెళ్లడం మానేయాల్సిందే.

-శింగనమల


నాలుగు నెలలు

శింగనమల చెరువు నిండి.. 2022 ఆగస్టు నుంచి డిసెంబరు వరకూ ఐదు నెలలు పాటు మరువ పారింది. దీంతో నియోజకవర్గంలోని సుమారు 50 గ్రామాల ప్రజలు నెలల తరబడి అనంతపురం, తాడిపత్రికి రాకపోకలు సాగించలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో 10 నుంచి 15 కి.మీ. అదనంగా ప్రయాణం చేశారు. మరువ ఉధృతికి రోడ్డు ధ్వంసమైంది. చెరువు నుంచి బయటికి వెళ్లిన నీరు మరువ వంకకు వెళుతుంది. వంక ఉధృతి కారణంగా రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోతురాజుకాల్వ గ్రామానికి చెందిన 40 మంది విద్యార్థులు సోదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. రోడ్డు కోతకు గురికావడం, వంక దాటడం ప్రమాదకరం కావడంతో నెల రోజులు బడికి వెళ్లలేదు. ఆ సమయంలో వంక వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని అప్పటి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ నాలుగు పైపులు, రోడ్డుపై మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత బ్రిడ్జి నిర్మాణం గురించి పట్టించుకోలేదు.

రూ.4 లక్షలతో సరిపెట్టారు

శింగనమల మరువ వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.4 కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. ఆ మొత్తం ఎక్కువ అని భావించి, రూ.2.90 కోట్లతో ఒకసారి, రూ.2,40 కోట్లతో మరోసారి అప్పటి ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదనలు పంపారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.4 లక్షలు ఇచ్చారు. ఆ సొమ్ముతో మరువ వద్ద ధ్వంసమైన రోడ్డుకు 50 మీటర్లు ప్యాచ వర్క్‌ చేశారు. పోతురాజుకాల్వ-సోదనపల్లి వంకపై బ్రిడ్జి నిర్మాణానికి పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.6.30 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులను చేపట్టలేదు.

తాజాగా ప్రతిపాదనలు..

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవతో శింగనమల చెరువు మరువ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లతో ఆర్‌ అండ్‌ బీ అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. శింగనమల మరవకొమ్మ నుంచి గార్లదిన్నె వరకూ డబుల్‌

లైను రోడ్డు నిర్మానానికి మరో రూ.60 కోట్లతో ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు, ఆ శాఖ మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు.

బంద్‌వర్షం వస్తే బడికి వెళ్లలేం..

నేను 8వ తరగతిలో వంక పారడంతో నెల రోజులు బడికి పోలేదు. ఆ తరువాత భయపడుతూనే నీటిని దాటుకుని రెండు నెలలు వెళ్లాం. వర్షం వస్తే మాకు భయం వేస్తుంది. వంక పారితే బడి మానేయాల్సిందే. బ్రిడ్జి నిర్మిస్తామని అంటున్నారు. కానీ ఎప్పుడో తెలియడం లేదు.

- యశ్వంత, పోతురాజుకాల్వ

మా నాన్న వచ్చేవాడు..

వర్షాకాలం వస్తే బడికి వెళ్లడం కష్టంగా ఉంటుంది. వంకకు నీరు వచ్చినప్పుడు బడి మానేయాల్సిందే. 2022లో మూడు నెలలపాటు ఇబ్బంది పడ్డాం. నెల రోజులు ఇంటివద్దే ఉన్నాను. ఆ తరువాత మా నాన్న రోజూ బడి వద్దకు వచ్చి వదిలేవాడు. బ్రిడ్జి మంజూరైందని అంటున్నారు. త్వరగా నిర్మిస్తే సమస్య ఉండదు.

- నాగసుధ, పోతురాజుకాల్వ

15 కి.మీ. అదనపు ప్రయాణం..

2022లో చెరువు నిండి మరువ పారింది. మూడు నెలలపాటు అనంతపురానికి వెళ్లేందుకు వీలు లేకపోయింది. నేను శింగనమలలో కాయగూరల వ్యాపారం చేస్తాను. అప్పడు అనంతపురానికి వెళ్లేందుకు రోజూ 15 కి.మీ. అదనంగా ప్రయాణించాల్సి వచ్చింది. ఖర్చు ఎక్కువ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపడుతుందని అప్పట్లో అన్నారు. కానీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- కాంతగారి సత్యనారాయణ

ఎమ్మెల్యే స్పందించాలి..

వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం గురించి గాలి మాటలు చెప్పింది. వర్షాలు వచ్చి మరువ పారితే మళ్లీ రాకపోకలు నిలిచిపోతాయి. 2022లో నాలుగు నెలలు ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్యే బండారు శ్రావణి బ్రిడ్జి నిర్మాణానికి చొరవ చూపాలి.

- నాగలాపురం విజయ్‌

రూ.6 కోట్లతో ప్రతిపాదన..

శింగనమల మరువ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రూ.6 కోట్లతో ప్రతిపాదన పంపాము. శింగనమల నుంచి గార్లదిన్నెకు డబుల్‌ లైన రోడ్డుకు రూ.60.30 కోట్లతో పై అధికారులకు నివేదికను పంపాము. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం.

- నరసింహమూర్తి, ఆర్‌అండ్‌బీ జేఈ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 08 , 2024 | 12:25 AM