Ycp, Tdp Leaders : యాపారం మొదలైంది..!
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:06 AM
గత వైసీపీ పాలనలో మాదిరే ప్రస్తుతం కొంతమంది భూ కబ్జాలకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అక్రమదారులను ఎంచుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. లేనిదానికి ఉందన్నట్లుగా సమస్యను సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలు మిలాఖత కావడం గమనార్హం. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న 73 సెంట్ల ఆయిల్ మిల్ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. ఈ స్థలం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి ...
సెటిల్ చేసుకో.. లేకుంటే ఇబ్బందులే
ఆయిల్ మిల్ వ్యాపారికి
వైసీపీ, టీడీపీ నేతల బెదిరింపులు
రూ.10 కోట్ల భూమిపై కబ్జాదారుల కన్ను
ఈ స్థలం తమదేనంటూ
రంగంలోకి దిగిన శింగనమల నాయకులు
బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 15: గత వైసీపీ పాలనలో మాదిరే ప్రస్తుతం కొంతమంది భూ కబ్జాలకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అక్రమదారులను ఎంచుకుని బెదిరిస్తున్నట్లు సమాచారం. లేనిదానికి ఉందన్నట్లుగా సమస్యను సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్షాలు మిలాఖత కావడం గమనార్హం. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న 73 సెంట్ల ఆయిల్ మిల్ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. ఈ స్థలం అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ప్రస్తుతం సెంటు రూ.10లక్షల నుంచి 15 లక్షల వరకు ధర పలుకుతోంది. ఆ స్థలం మొత్తం విలువ ఇప్పుడు రూ.10 కోట్లపైన ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయిల్ మిల్ యజమానుల అనుభవంలో ఉన్న స్థలం మాదే అంటూ శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ, టీడీపీ నేతలు హల్‌చల్ చేసినట్లు సమాచారం. సెటిల్ చేస్కో. లేక పోతే...! ఈ స్థలంలో కట్టిన అయిల్ మిల్, భవనాలు, మొత్తం స్వాధీనం చేసుకుంటాం అని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అసలైన
యాజమాని నీవు కాదని, నిజమైన హక్కుదారులతో ఈ స్థలాన్ని కొన్నామని హంగామా సృష్టించినట్లు సమాచారం. నీకు ఈ స్థలంపై ఎలాంటి హక్కు లేదని, సెటిల్ చేసుకోకుంటే లేదంటే ఇబ్బంది పడతావు అంటూ ఆ స్థల యాజమానిని బెదిరిస్తున్నట్లు సమాచారం.
నకిలీ దందాలో వైసీపీ.. టీడీపీ మిలాఖత...!
ఈ భూ నకిలీ దందా వ్యవహారంలో శింగనమల నియోజకవర్గానికి చెందిన వైసీపీ- టీడీపీ నేతలు మిలాఖత అయ్యారు. గత వైసీపీ పాలనలో అనేక భూదందాలు ఈ నియోజకవర్గంలో జరిగిన విషయం తెలిసిందే. గతంలో వైసీపీలో ఉన్న కొంత మంది నాయకులు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వారు ప్రస్తుతం ఈ భూ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం ఉన్న కొంత మంది వైసీపీ నాయకులు జతకలిసి విలువైన స్థలాన్ని కాజేయడానికి స్కేచ వేశారు. ఈక్రమంలోనే ఈ భూమిని నిజమైన వారుసులమని రంగంలోకి దిగారు. సెటిల్ చేస్కో లేదంటే ఇబ్బంది పడతావు అంటూ నియోజకవర్గం కేంద్రానికి చెందిన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఓ నాయకులు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నేతలు ఇలా భూదందాలు చేయడం వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని పలువురు అసలైన టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ దందాలకు పాల్పడే నేతలను పార్టీ నుంచి దూరంగా ఉంచాలని శింగనమల నియోజకవర్గం టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నాయకులతో మిలాఖత అయ్యి ఇలాంటి బెదిరింపులకు దిగడం వలన టీడీపీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే చర్చ పార్టీలో మొదలైంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 16 , 2024 | 12:07 AM