Chilli crop : నష్టాల ఘాటు..!
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:23 AM
ఎండుమిర్చి పంట అన్నదాతకు నష్టాలఘాటు పంచింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పక్వానికి వచ్చిన కాయలు రాలిపోయి, దిగుబడి దారుణంగా పడిపోయింది. కాయల నాణ్యత కూడా తగ్గుతోంది. ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. వెరసి నష్టాల పంట పండుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కవని అన్నదాతలు వాపోతున్నారు....
వర్షాలకు దెబ్బతిన్న ఎండుమిర్చి పంట
కాయలు రాలిపోయి తగ్గిన దిగుబడి..
నేలచూపులు చూస్తున్న ధరలు
పెట్టుబడులు కూడా దక్కని దుస్థితి
సర్వం నష్టపోతున్న అన్నదాతలు
ఎండుమిర్చి పంట అన్నదాతకు నష్టాలఘాటు పంచింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పక్వానికి వచ్చిన కాయలు రాలిపోయి, దిగుబడి దారుణంగా పడిపోయింది. కాయల నాణ్యత కూడా తగ్గుతోంది. ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. వెరసి నష్టాల పంట పండుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా దక్కవని అన్నదాతలు వాపోతున్నారు.
(మడకశిర - ఆంధ్రజ్యోతి)
1200 ఎకరాల్లో సాగు
గత ఖరీఫ్‌లో ఎండుమిర్చి ధరలు విపరీతంగా ఉండడంతో రైతులకు లాభాల పంట పండింది. దీంతో ప్రస్తుం నియోజకవర్గ వ్యాప్తంగా బోరుబావుల కింద పెద్దఎత్తున పంట సాగుచేశారు. పంట పక్వానికి వచ్చింది. ఇటీవలిగా కురుస్తున్న వర్షాలు.. పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షానికి మిరప మొక్కల వేళ్లు కుళ్లిపోయి, కాయలు రాలిపోతున్నాయి. ఫలితంగా పంట దెబ్బతిని దిగుబడి తగ్గిందని రైతన్నలు అంటున్నారు. మిరపకాయలు రంగు మారి, మార్కెట్‌లో ధర కూడా తక్కువగా దక్కుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 1200 ఎకరాల్లో రైతులు
మిర్చి సాగు చేశారు. మడకశిర మండలంలో 335 ఎకరాలు, అగళి 180, రొళ్ళ 90, అమరాపురం 420, గుడిబండ పరిధిలో 410 ఎకరాల్లో పంట పెట్టారు. ఎకరాలో పంట సాగుకు రూ.50 వేలదాకా ఖర్చవుతుంది. ప్రస్తుతం వర్షానికి పంట దెబ్బతినడం, ధరలు లేకపోవడంతో పెట్టిన ఖర్చులు కూడా చేతికందవని రైతులు వాపోతున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో హిందూపురం, కర్ణాటకలోని శిర తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులైనా మిగులుతాయంటున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించాలని రైతన్నలు.. ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
దిగుబడి లేదు.. ధర లేదు..
వర్షం కారణంగా మిరప కాయల రంగు మారాయి. వాటికి మార్కెట్‌లో ధర కూడా తక్కువగా దక్కుతోంది. క్వింటాం రూ.13 వేలలోపే పలుకుతోంది. వర్షానికి పంట దెబ్బతిని ఎకరాకి క్వింటాం దిగుబడి రావట్లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిగుబడిని విక్రయిస్తే 13వేలలోపే వస్తోంది. ఈలెక్కన దాదాపు రూ.37వరకు నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడులు కూడా దక్కట్లేదు
బోరుబావి లేకపోవడంతో సమీప పొలం రైతు బోరు నుంచి నీరు తీసుకుని, అరెకరాలో పంట సాగు చేశా. రూ.40 వేలదాకా ఖర్చు వచ్చింది. గతేడాది కన్నా ఈసారి కూలి రేట్లు, సాగు ఖర్చులు పెరిగాయి. మార్కెట్‌లో మిరపకాయలు క్వింటాం ధర రూ.13 వేలలోపే పలుకుతోంది. వర్షానికి మిరపకాయలు రంగు మారడంతో ధర కూడా తక్కువగా దక్కుతోంది. నష్టాలు తప్పట్లేదు.
- హనుమంతరాయప్ప, కసాపురం
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Oct 16 , 2024 | 12:23 AM