Andhra Pradesh: నేరాల కట్టడికి..త్రిముఖ వ్యూహం!
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:21 AM
‘రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం సిద్ధం చేసింది. సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్న సైకోలు, సైబర్ నేరగాళ్ల కట్టడికి కఠిన చట్టాలు ప్రయోగించబోతోంది.
అనుభవజ్ఞులతో టెక్నో పోలీసింగ్‌పై కమిటీ
‘సోషల్’ సైకోల కట్టడికి కఠిన చట్టాలు
ఎస్పీలు, కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కూటమి ప్రభుత్వం త్రిముఖ వ్యూహం సిద్ధం చేసింది. సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతున్న సైకోలు, సైబర్ నేరగాళ్ల కట్టడికి కఠిన చట్టాలు ప్రయోగించబోతోంది. అధునాతన టెక్నాలజీని వినియోగించి అన్ని రకాల నేరాల నియంత్రణకు ముగ్గురు అనుభవజ్ఞులైన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే చర్యలకు ఉపక్రమించనుంది. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం ‘ఈగిల్’ విభాగానికి పోలీసు, ఎక్సైజ్ శాఖలు సహకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన సమీక్షించారు. ప్రస్తుతం నేరాల తీరు మారిందని, సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ప్రజల్ని దోచుకుంటుంటే.. వ్యవస్థీకృత నేరస్థులు గంజాయి సరఫరా చేసి సమాజాన్ని, భావితరాలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. మరోవైపు నేరగాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అసభ్య భాషతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సమాజంలోని అన్ని వర్గాలనూ మానసికంగా వేధిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమన్నారు. వీటి కట్టడికి పోలీసులు నడుం బిగించాలని, అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గడచిన ఐదు నెలల్లో నేరాల కట్టడి తీరు బాగుందని.. టెక్నాలజీని వినియోగించుకుని సమర్థ పోలీసింగ్ నిర్వహిస్తే నేరస్థులు తోక ముడుస్తారని చెప్పారు. సోషల్ మీడియాలో బూతులను అదుపు చేశారని..ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. ఇందుకు పోలీసులను అభినందిస్తున్నానని అన్నారు. ‘మద్యం అక్రమాలపై సీఐడీ, ఇసుక దోపిడీపై ఏసీబీ విచారణ జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా ఆగాలి. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో నిఘా పెట్టాలి. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేసి ఒక్క టన్ను కూడా ఎగుమతి కాకుండా ఆపాలి’ అని ఆదేశాలిచ్చారు. ఇందులో ఏ పార్టీ వ్యక్తులున్నా చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు.
తాగినోళ్లు అబద్ధం చెప్పరు..
ఎన్నికల్లో మాటిచ్చినవిధంగా నాణ్యమైన లిక్కర్ సరఫరా చేయిస్తున్నామని, నాసిరకం మద్యం కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్లు చేసే వారి నంబర్లకు ఫోన్‌చేసి ఎక్కువ ధర వసూలు చేస్తున్నారో లేదో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు సూచించగా.. అందుకు14405 టోల్‌ఫ్రీ నంబర్ ఉందని, ప్రతి షాపులో రెండు సీసీ కెమేరాలు పెడుతున్నామని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా చెప్పారు. ‘తాగినోడు అబద్ధం చెప్పడు.. ఫీడ్ బ్యాక్ తీసుకోండి’ అని సీఎం చమత్కరించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. గంజాయి వల్ల గిరిజనులకు వచ్చే ప్రయోజనం కన్నా జరిగే నష్టం వంద రెట్లు ఎక్కువని, దీనిపై గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం సూచించారు.
సోషల్ సైకోలకు శాస్తి చేయాలి..
సమాజంలో అన్ని వర్గాలను మానసిక వేధనకు గురిచేస్తూ రెచ్చిపోతున్న సోషల్ మీడియా సైకోలకు తగిన శాస్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ అరాచకాలపై అధ్యయనానికి హోంమంత్రి అనిత, ఐటీ మంత్రి లోకేశ్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘పోలీసింగ్ సమర్థంగా ఉంటేనే క్రిమినల్స్ తగ్గుతారు. టెక్నాలజీ వినియోగిస్తే ఎంత తెలివైన క్రిమినల్ అయినా దొరుకుతాడు.. పోలీసులు అసమర్థులైతే నేరగాళ్లు సమర్థులవుతారు.. వారు రాజకీయ నాయకులైతే అసభ్యత పరాకాష్ఠకు చేరుతుంది’ అని చెప్పారు.
లోన్ యాప్ కొత్త పెళ్లికొడుకు ప్రాణాలు తీసింది: మంత్రి లోకేశ్
‘రాష్ట్రంలో లోన్ యాప్‌ల సమస్య కూడా ఉంది. కేవలం రెండు వేల అప్పు కోసం ఓ యువకుడిని విశాఖలో లోన్ యాప్ బలి తీసుకుంది. వడ్డీలపై వడ్డీలు వేసి కొత్త పెళ్లికొడుకు ఫోను నుంచి ఫొటోలు లాగేసి అతని భార్య ఫొటో మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి అవమానానికి గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమయ్యారు. కఠిన చట్టం తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి లోకేశ్ అన్నారు. దీనితో ఏకీభవించిన సీఎం.. సమస్య పరిష్కారానికి కీలక సూచనలు చేయాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రకటించారు. దీనిపై విజిలెన్స్ డీజీ హరీశ్‌కుమార్ గుప్తా స్పందిస్తూ ‘ప్రజల ప్రాణాలు తీస్తున్న చైనా యాప్‌లపై ఆరా తీస్తున్నాం.. విదేశాలకు చెందిన వీటికి ఇక్కడి ఆర్గనైజర్లు, ఏజెంట్లు ఎవరో, ఇతరత్రా వ్యవహారాలన్నీ సేకరిస్తున్నాం. 15 రోజుల్లో కొలిక్కి తెస్తాం’ అని చెప్పారు.
ఎక్సైజ్‌లో అవకతవకలు
వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలి
అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి
అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఎక్సైజ్ అనగానే అవినీతి జరుగుతుందని, ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఉంటుందని, అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ప్రతి షాపులో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేసేలా భవిష్యత్తులో నిబంధనలు పెట్టాలన్నారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యం విక్రయుంచిందని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా మాట్లాడుతూ.. నాటుసారా నియంత్రణకు జనవరి మొదటి వారంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2025 చివరికి రాష్ట్రంలో నాటుసారా రహితంగా ప్రకటించడం లక్ష్యమని చెప్పారు.
సామాన్యుడికి ఉచిత ఇసుక ఇవ్వాలి
రవాణా చార్జీలు తగ్గించడంపై దృష్టి సారించాలి: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రణాళిక శాఖ మంత్రి ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీలతో కలిపి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక విషయంలో తాము కూడా సమాచారం తెప్పిస్తున్నామని, ఇప్పుడు సరఫరా దారిలో పడిందన్నారు. ఇంకా రవాణా చార్జీలు తగ్గించేందుకు అవకాశం ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కల్పించుకుని.. ఇసుకపై కలెక్టర్లు, ఎస్పీలు ఎవరూ మాట్లాడలేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇసుక అందుబాటులో ఉన్నప్పటికి, జిల్లాల్లో కొంతమంది గ్రూప్‌లుగా ఏర్పాటై ధరలను నియంత్రిస్తున్నారన్నారు. తొలుత మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్‌కుమార్ మీనా ప్రజెంటేషన్‌లో మైనింగ్‌పై సృష్టత ఇచ్చారు. పట్టా భూముల్లో మైనింగ్‌కు కలెక్టర్లు అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుకపై విజిలెన్స్ చాలా ముఖ్యమని, ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయన్నారు. ధరలు ఎక్కువగా వసూళ్లు చేయడంతోపాటు ఇసుక సరిహద్దులు దాటిపోతోందని, చెక్‌పోస్టుల్లో నిఘా పెంచాలని, రవాణా వెనుక ఎవరున్నారో గుర్తించాలన్నారు. ప్రత్యేక కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
అక్కడ ఆచారం.. ఇక్కడ నేరం..!
రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల కట్టడికి ఏర్పాటైన ‘ఈగిల్’ విభాగం అధిపతి ఐజీ రవికృష్ణ సమీక్షలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ‘నరసరావుపేట క్వారీల్లో గంజాయి వినియోగంపై సమాచారం వచ్చింది.. వెళ్లి చూడగా అక్కడ పనిచేస్తున్న ఒడిశా కూలీలు సొంత రాష్ట్రం నుంచి తెచ్చుకుని వాడుతున్నారు. చర్యలకు ఉపక్రమించగా ఇది తమ ఆచారమని, త్రినాథ స్వామి జాతరలో, పూజలో ఉపయోగించి స్వీకరిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ అలా చేయడం నేరమని చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా ఐదారు లక్షల మంది ఒరియా కూలీలున్నారు. వారందరిలో అవగాహన కల్పిస్తున్నాం.. విజయనగరంలో పదహారేళ్ల కుమార్తె అర్ధరాత్రి దాటినా ఇంటికి రాలేదంటూ తల్లి ఫోన్ చేశారు.. కుమార్తె మత్తుకు బానిసైంది.. ఆరా తీస్తే పదమూడేళ్ల ఆమె తమ్ముడు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నాడు.. గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో 17 మంది విద్యార్థులపై కేసు నమోదైంది.. గంజాయి, మత్తు పదార్థాల కట్టడిలో.. మూలం, రవాణా, సరఫరా అవుతున్న ప్రాంతం, డిమాండ్‌పై ఈగిల్ దృష్టి పెట్టింది. అల్లూరి జిల్లాలోని 9 మండలాల్లో 358 గ్రామాల పరిధిలో గతంలో గంజాయి సాగయ్యేది. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు సాగవుతున్నాయి. ఒడిశా ఏఎన్‌టీఎ్‌ఫతో ఈగిల్ సమన్వయంతో వ్యవహరిస్తోంది. తమిళనాడు, తెలంగాణ, కేరళ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంటున్నాం. అన్ని పాఠశాలల్లో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదాన్ని కోటి మంది వరకూ తీసుకెళ్లాం’ అని తెలిపారు.
టెక్నాలజీ లేకుంటే పోలీసులు ఏంచేస్తారు?
తాను ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో జరిగిన ఓ ఘటనను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘తిరుపతిలో ఒక క్రిమినల్ సైకోలాగా మహిళల తలలపై రాళ్లతో కొట్టి చంపేవాడు.. ఒంటిపై నగలు కూడా తీసుకెళ్లేవాడు కాదు.. అప్పటి డీజీపీ హెచ్‌జే దొరను పిలిచి 30 మందిని చంపినా అతడెవరో గుర్తించలేరా అని అడిగా. ఫింగర్ ప్రింట్స్ లేవని ఆయన చెప్పారు.. ఇప్పుడు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ లేదు. పొలీసులకు ఏమీ ఇవ్వకుంటే ఏం పని చేస్తారు..? మీకు కావలసింది ఇస్తా.. మూడు నెలల్లో నేరాలను కట్టడి చేయాలి’ అని స్పష్టం చేశారు.
టెక్నాలజీతో నేరాలకు బ్రేకులు: డీజీపీ
నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగించి మూడేళ్ల పిల్ల నుంచి 73 ఏళ్ల వృద్ధురాలి హత్య వరకూ వెలికి తీశాం. ఆలయాల దొంగలను పట్టుకున్నాం. అమ్మవారి, స్వామివారి నగలు రికవరీ చేశాం.. ఆరు నెలల్లో సైబర్ నేరగాళ్లు రూ.293 కోట్లు దోచేశారు.. 44 కోట్లు రికవరీ చేసి బాధ్యులను గుర్తించాం. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తెస్తున్నార . ఇప్పటి వరకూ 2.93 లక్షల మంది సైబర్ సభ్యులయ్యారు. విజయనగరం పోలీసులు డిజిటల్ అరెస్టు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.20 లక్షలకు గాను 19.2 లక్షలు రికవరీ చేశారు.
Updated Date - Dec 13 , 2024 | 08:59 AM