AP Govt : సంక్రాంతికి ‘సహకార’ పోస్టుల భర్తీ!
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:45 AM
రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించనుంది. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవులు కూడా..
ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు
క్షేత్ర స్థాయిలో 10 వేల పదవులు దక్కే అవకాశం
కూటమి నేతలకు కొత్త సంవత్సరం బహుమతి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించనుంది. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ దాదాపు 10వేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. రెండోదశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్ చేస్తారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
వందల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్ పాలక వర్గాలు నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది. వీటినీ జనవరిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామక కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది. వీటికి ఎన్నికలు ఉండవు. రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమిస్తారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైౖర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్‌లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ అవుతాయి. ఇప్పుడు జనరల్‌లో ఉన్నవి రిజర్వేషన్‌లోకి వస్తాయి.
Updated Date - Dec 25 , 2024 | 03:53 AM