ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Scheme: ఉద్యోగులకు వైద్య బీమా

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:49 AM

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బ్యాంకులతో అనుసంధానం కావడం ద్వారా వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది.

  • బ్యాంకు ఖాతాతో ఆరోగ్య భద్రతకు భరోసా.. ప్రభుత్వం కసరత్తు

  • బ్యాంకర్లతో సీఎస్‌, ఆరోగ్య శాఖ అధికారుల చర్చలు

  • ప్రీమియం తక్కువ ఉండేలా చూడాలని స్పష్టీకరణ

  • ఈ అంశంపై 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

  • 5 లక్షల మంది ఉద్యోగులకు ఒకే బ్యాంకులో ఖాతా

  • ప్రమాద, జీవిత బీమాతో పాటు వైద్య బీమా కూడా

  • ఈహెచ్‌ఎ్‌సలో వైద్యసేవలకు ఆటంకాలతో నిర్ణయం

  • రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వంపై కోట్లలో భారం

  • ఈ సమస్యలకు చెక్‌ పెట్టే దిశగా సర్కారు అడుగులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బ్యాంకులతో అనుసంధానం కావడం ద్వారా వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ద్వారా అమలవుతున్న ఈ పథకంలో ప్యాకేజీలు తక్కువగా ఉండటంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈహెచ్‌ఎస్‌ కింద ఉద్యోగులకు వైద్యం అందించలేమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల వైద్యం విషయంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈహెచ్‌ఎస్‌ అమలుతో పాటు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇస్తోంది. ఈహెచ్‌ఎస్‌ కింద ఆస్పత్రులకు రూ.కోట్లు చెల్లించడంతో పాటు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతచేసినా తమకు సరైన వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తూనే ఉన్నారు. దీంతో వారికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఉద్యోగులపై, ప్రభుత్వంపై భారం తగ్గించుకునేందుకు వివిధ మార్గాలను ఆన్వేషిస్తోంది.


అందులో భాగంగా బ్యాంకులతో అనుసంధానం కావాలని భావిస్తోంది. ఎస్‌బీఐ తన ఖాతాదారులకు దాదాపు రూ.కోటి వరకూ ప్రమాద బీమా, మరికొంత మందికి రూ.10 లక్షల వరకూ జీవిత బీమా కల్పిస్తోంది. మరో ప్రముఖ బ్యాంకు ఈ రెండింటితో పాటు ఏటా రూ.2,500 ప్రీమియం చెల్లిస్తే రూ.30 లక్షల వైద్య బీమాను కూడా అందిస్తోంది. వైద్యం ఖర్చు రూ.3లక్షలు దాటితే రూ.30 లక్షల వరకూ బ్యాంకు నుంచి బీమా పొందే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా బ్యాంకులు కస్టమర్లకు వివిధ రూపంలో బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

  • అందరికీ ఒకే బ్యాంకులో ఖాతాలు

రాష్ట్రంలోని 5లక్షల మంది ఉద్యోగులకు ఒకే బ్యాంకులో ఖాతా తెరిచి, ఇకపై అందులోనే వారి జీతాలు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఖాతా ద్వారానే వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలనే ఆలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనకు ముందుకొచ్చే బ్యాంకులోనే ఉద్యోగులకు ఖాతాలు తెరవాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే బ్యాంకర్లతో ఒకసారి సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని సీఎస్‌ వారికి సూచించారు. అయితే తమకు 15 రోజుల సమయం కావాలని, తమ యాజమాన్యాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తెలియజేస్తామని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు కొన్ని బ్యాంకులు అంగీకారం తెలిపాయి. ఉద్యోగులకు వైద్య బీమా కోసం ప్రీమియం ఎంత చెల్లించాలన్న దానిపై ప్రభుత్వం, బ్యాంకర్ల మధ్య చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌ కోసం గెజిటెడ్‌ ఉద్యోగులు నెలకు రూ.300, ఎన్జీవోలు రూ.250 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే బ్యాంకుల నుంచి వైద్య బీమా తీసుకుంటే ప్రీమియం ఎక్కువ మొత్తం చెల్లించాలి. ఇది ఏడాదికి దాదాపు రూ.10వేల నుంచి రూ.20వేల వరకూ ఉంటుంది. ఉద్యోగులకు రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ బీమా అవసరం కాబట్టి దాని ఆధారంగా ఎంత తక్కువ మొత్తంలో ప్రీమియం నిర్ణయిస్తే, అంత మంచిదని బ్యాంకర్లకు అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశాలపై మరో 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 29 , 2024 | 03:49 AM