AP High Court : ఆ చెట్లు వేరే చోట నాటాల్సిందే
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:30 AM
ప్రభుత్వ భవనాలు, రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్లు ఏర్పాటు సమయంలో చెట్లను కొట్టి పడేయకుండా వాటిని వేరే చోట..
అభివృద్ధి పనులకు అడ్డొస్తున్నాయని కొట్టేయడం సరికాదు
ఈ విషయంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భవనాలు, రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్లు ఏర్పాటు సమయంలో చెట్లను కొట్టి పడేయకుండా వాటిని వేరే చోట నాటే (టాన్స్‌లొకేట్) విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. చెట్లను వేరే చోట నాటేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఖర్చయినా సరే చెట్లను వేరే చోట నాటేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంది. విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అభివృద్ధి పనులకు అడ్డొస్తున్నాయని నరికివేస్తున్న చెట్లను మరోచోట తిరిగి నాటేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపించారు. విచక్షణారహితంగా చెట్ల కొట్టివేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందన్నారు. వాటిని వేరే చోట నాటేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 05:30 AM