AP Chandrababu: 100 రోజుల్లో.. వ్యవస్థలు గాడిలో
ABN, Publish Date - Aug 04 , 2024 | 03:49 AM
రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
భూకుంభకోణాలపై ఉక్కుపాదం మోపుతాం
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు
టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో చంద్రబాబు
ప్రతి మండలంలోనూ భూకుంభకోణం
రెవెన్యూ రికార్డులన్నీ అస్తవ్యస్తం
కఠిన చర్యల ద్వారా ప్రక్షాళన చేస్తా: సీఎం
వంద రోజుల్లో వ్యవస్థలను గాడిలో పెడతాం
అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
అన్నింటికీ పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలకు కారణమైన, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. ప్రతి మండలంలోనూ ఓ భూకుంభకోణం వెలుగు చూస్తోందని, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేసి అస్తవ్యస్తం చేశారన్నారు.
రీసర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. వాటన్నింటిపై విచారణ చేపడతామని, ప్రతి జిల్లాలోనూ రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రెవెన్యూశాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అన్నారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరి సమస్యనూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చిన విజ్ఞప్తులన్నీ శాఖల వారీగా విభజించి నిర్ధిష్ట కాలపరిమితిలోపు పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఉద్యోగులు కూడా పెద్దఎత్తున సమస్యలతో పార్టీ కార్యాలయానికి వస్తున్నారని చెప్పారు.
కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగుల సమస్యలను వేటికవి విభజించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతిపత్రాలు తీసుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జిల్లాలో తన పర్యటన సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామన్నారు. ప్రజా పోలీసింగ్ చేసే వ్యవస్థగా మారుస్తామని తెలిపారు. వర్షాలు పడి ప్రాజెక్టులు నిండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. శాఖల వారీగా సమీక్షలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు.
Updated Date - Aug 04 , 2024 | 03:49 AM