Chandrababu: అందుకు కారణం చంద్రబాబే: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ABN, Publish Date - Aug 17 , 2024 | 04:34 PM
ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలపై పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు తీసుకొస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలపై పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు తీసుకొస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో (Chandrababu Naidu) సమావేశం అయ్యారు. కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధి పై విమానయాన శాఖ అధికారులతో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు సుధీర్గంగా సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఆ సమావేశం జరిగింది.
14 ఎయిర్ పోర్టులు
‘ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి అధికారులతో చర్చించాం. ఎయిర్ పోర్టుల అభివృద్ధి, హెలికాప్టర్, డ్రోన్ సేవలు, సి ప్లెయిన్, విమాన సేవల పెంపు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. విమానయాన రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగానికి సంబంధించి కీలక అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించా. ఏపీలో 14 ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు. కృతజ్ఞతలు తెలియజేస్తూ నా కార్యాలయానికి ఆహ్వానించా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాకపోకలు సాగుతున్నాయి. టెర్మినల్ భవనాల విషయంలో అవసరాల మేర ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించాం. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు గురించి మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే విమానయాన శాఖ తరపు నుంచి వెంటనే చర్యలు చేపడతాం అని’ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఈ వార్త కూడా చదవండి:
Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
సంపూర్ణ సహకారం
‘కుప్పం, దగదర్తి (నెల్లూరు), నాగార్జున సాగర్, తునిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ డెవలప్ చేసే అంశం గురించి ఆలోచన చేస్తాం. సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన ప్రతిపాదనలకు మా శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది. పుట్టపర్తిలో ఉన్న ప్రైవేటు విమానాశ్రయాన్ని పబ్లిక్ విమానాశ్రయంగా మార్చే అంశం గురించి చర్చించాం. తూర్పు తీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు విజన్. అందుకు విమానాశ్రయాల పాత్ర ప్రధానంగా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఏర్పడబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆలోచన చేశాం. ఒక్కో విమానాశ్రయానికి వందల ఎకరాల భూమి కావాలి. భవిష్యత్తులో భూములు లభ్యత తక్కువగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాల మేరకు కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. చిన్న విమానాశ్రయాల కనెక్టివిటీ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉడాన్ పథకం ఉంది. ఆ పథకం ఉపయోగించుకుని రాష్ట్రంలో విమానాశ్రయాల కనెక్టివిటీని మరింత పెంచాలని చూస్తున్నాం. సి-ప్లేన్ పాలసీ ప్రకారం ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్‌లో వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటు గురించి చర్చించాం. నాగార్జునసాగర్, కోస్తా తీరంలో చాలా చోట్ల సీ ప్లేన్ సామర్ధ్యాన్ని పెంపొందిస్తాం. ప్రతి జిల్లాకు ఒక హెలిపోర్టు ఏర్పాటు చేసి పర్యాటకం, మెడికల్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఆ సేవలు వినియోగించుకునేలా ప్రతిపాదనలు ఉన్నాయి అని’ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
రెండేళ్లలో పూర్తి
‘విమానయాన రంగానికి సంబంధించి మౌలిక వసతుల ప్రాజెక్టులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి ప్రాజెక్టుకు డెడ్ లైన్ విధించుకొని ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. డ్రోన్లు నా శాఖ పరిధిలోని అంశం. వీటిని వివిధ రంగాల్లో ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించాం. ఏపీలో 3 వారాల్లో డ్రోన్లపై ఒక ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు నిర్వహిస్తాం. రోడ్ల తయారీదారులను రాష్ట్రానికి పిలిపించి దేశ స్థాయిలో మెగా ఈవెంట్ నిర్వహిస్తాం. వ్యవసాయం సహా ప్రజాసేవలో డ్రోన్లను విరివిగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రం గురించి ఆలోచిస్తూనే జాతీయస్థాయిలో విమానయాన రంగాన్ని ఎలా వృద్ధి చేయాలనే అంశంపై చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. దేశాభివృద్ధిలో విమానయాన రంగం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో తెలుపుతూ చంద్రబాబు విజన్ వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌లో శంకుస్థాపన చేశారు. కార్గో సదుపాయాలను దేశంలో మరింత పెంపొందించడం గురించి కూడా చర్చించాం అని’ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ప్యాసెంజర్, కార్గో
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి విమానాశ్రయంలో ప్యాసెంజర్ సదుపాయంతోపాటు కార్గో, ఎమ్వార్వో సదుపాయాలను నెలకొల్పే ప్రతిపాదనలను చంద్రబాబు చేశారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతిపాదనలపై మరింత లోతుగా అధ్యయనం చేసి మా శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందజేస్తాం. నరేంద్ర మోదీ హయాంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 74 నుంచి 150కి పైగా ఎయిర్ పోర్టులను నెలకొల్పాం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా "ప్రో యాక్టివ్ గా" ముందుకు వస్తే బాగుంటుంది. అన్ని విమానయాల సంస్థలను సంప్రదించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ నగరాలకు కనెక్టివిటీ పెంచుతాం. విజయవాడ విమానాశ్రయానికి ముంబై నుంచి రెండు, ఢిల్లీ నుంచి ఒకటి, బెంగళూరు నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి ఒక సర్వీసులను త్వరలో ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇస్తే కేంద్ర ప్రభుత్వమే ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడుతుంది. దాంతో రాష్ట్రంపై ఆర్ధిక భారం పడదు. ఆ ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, ముందుకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారిస్తాం అని’ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..
Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..
Updated Date - Aug 17 , 2024 | 04:49 PM