AP CM Chandrababu : రేపు కలెక్టర్ల సమావేశం
ABN, Publish Date - Aug 04 , 2024 | 05:03 AM
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
ఒక్కరోజే నిర్వహణకు నిర్ణయం
ప్రాథమిక రంగాలపై తొలి చర్చ
ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం
చేయనున్న సీఎం చంద్రబాబు
ఎజెండా ఖరారు చేసిన ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది. సోమవారం సాయంత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ం ఎజెండాను ఖరారు చేసింది.
జిల్లాల్లో పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో 5న సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. మధ్యాహ్న విరామం తర్వాత బడుగు, బహీనన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, జలవనరులు, పౌరసరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సాయంత్రం రెవెన్యూశాఖపై చర్చ జరగనుంది.
అసైన్డ్, చుక్కల భూములు, ప్రీహోల్డ్ అంశం, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ప్రజెంటేషన్ ఇస్తారు.
వైసీపీ నేతల భూ ఆక్రమణలు, దురాగాతాలపై రాష్ట్రవ్యాప్తంగా విచారణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కీలక సమాచారం తీసుకోవాలని భావిస్తోంది. జిల్లాల వారీగా భూముల ఆక్రమణలపై డేటా తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
అనంతరం ఎక్సైజ్, రహదారులు, ఐటీ, హ్యాండ్లూమ్స్, పర్యాటక శాఖపై కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. చివరగా శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులతో జిల్లాల వారీగా సీఎం చర్చించనున్నారు. అనంతరం ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
ఉచిత ఇసుకపై చర్చ
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా వేసింది. ఇప్పటికే ఫించన్లను పెంచి బకాయిలతో సహా లబ్ధిదారులకు అందించింది. టైటిల్ చట్టాన్ని రద్దుచేసింది. రైతులు, భూ యజమానులకు కష్టాలు తీసుకొచ్చిన రీసర్వేను నిలిపివేసింది.
గృహనిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేందుకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అత్యంత కీలకమైన ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. అయితే, రవాణా చార్జీల అంశం కొంత గందరగోళానికి దారితీస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు, ప్రజలతో సంప్రదింపులు జరిపి పరిష్కారాలు కనిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక అమలులో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలపై కలెక్టర్లతో చంద్రబాబు సవివరంగా మాట్లాడనున్నారు.
Updated Date - Aug 04 , 2024 | 05:03 AM