Machilipatnam : వరి రైతుపై తేమ కత్తి!
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:36 AM
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వరి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు! మధ్యవర్తులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యంలో తేమ శాతం, ఇతరత్రా కారణాలు చూపి మద్దతు ధరలో భారీగా కోత పెడుతున్నారు.
పంట కొనుగోళ్లలో ని‘బంధనాలు’
కొనసాగుతున్న మధ్యవర్తులు, మిల్లర్ల దోపిడీ
అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు
తేమ శాతం, ఇతరత్రా కారణాలతో
మద్దతు ధరలో భారీగా కోత
తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు
ఓ వైపు ప్రకృతి విపత్తుల భయం
సకాలంలో ధాన్యం కొనుగోలు జరగని వైనం
(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వరి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు! మధ్యవర్తులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యంలో తేమ శాతం, ఇతరత్రా కారణాలు చూపి మద్దతు ధరలో భారీగా కోత పెడుతున్నారు. దీంతో అన్నదాత కనీస మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలంటున్నా.. మధ్యవర్తులు నిబంధనల పేరుతో రైతులను దోచుకుంటున్నారు. తమకు ఇంతనష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
మధ్యవర్తుల కనుసన్నల్లోనే ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు రైతు సేవా కేంద్రాల ద్వారా చేస్తున్నట్లు పైకి చెబుతున్నా.. గ్రామాల్లోని పెట్టుబడిదారులు లేదా మధ్యవర్తుల కనుసన్నల్లోనే ఆ ప్రక్రియ అంతా జరుగుతోంది. కోత కోసిన తర్వాత ఽధాన్యాన్ని పొలంలోనో లేదా రోడ్డుపైకి చేర్చిన అనంతరం సంచులు సమకూర్చడం, కాటా వేయడం, రవాణా వ్యవహారాలన్నీ రైతులకు వ్యవసాయం నిమిత్తం పెట్టుబడి ఇచ్చిన గ్రామాల్లోని మధ్యవర్తులే చూస్తున్నారు. ఈలోగా తుఫాను హెచ్చరికలు వెలువడితే ధాన్యం తడిచి దెబ్బ తింటుందనే ఆందోళనతో రైతులు విక్రయించేందుకు తొంద రపడున్నారు. ఇదే అవకాశంగా తీసుకుంటున్న మధ్యవర్తులు.. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందని చెప్పి బస్తాకు రూ.275 నుంచి 300 వరకు మద్దతు ధరలో కోత పెడుతున్నారు. ఈ విధంగా ఎకరానికి 35 బస్తాల దిగుబడి వస్తే రైతులు దాదాపు రూ.10 వేలు నష్టపోవాల్సి వస్తోంది.
ఇతర జిల్లాలకు ధాన్యం రవాణా
కృష్ణా జిల్లాలో 149 రైస్ మిల్లులున్నాయి. వాటిల్లో 70 వరకు డ్రయ్యర్ సౌకర్యం ఉన్న మిల్లులు. పెద్ద మిల్లులైతే రోజుకు వంద టన్నుల ధాన్యం మరపట్టగలవు. భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. యంత్రాలతో కోతలు చేసిన ధాన్యంలో 25 పాయింట్ల మేర తేమ శాతం ఉంటుంది. ఈ ఽధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తి వాహనాల్లో మిల్లులకు పంపితే.. అక్కడ మూడు రోజులలోపు దిగుమతి చేసుకోవడంలో ఆలస్యం జరిగితే ధాన్యం బూజుపట్టి రంగు మారిపోతుంది. దీంతో మిల్లర్లు తాము ధాన్యం దిగుమతి చేసుకోలేమని చెబుతున్నారు. మిల్లు యజమానులు బ్యాంకు గ్యారెంటీగా కోటి రూపాయలు చూపితే, మరో కోటి రూపాయల విలువైన ధాన్యం దించుకునేలా అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
దీంతో మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో ఎక్కడి లారీలు అక్కడే నిలబడిపోతున్నాయి. ఈ కారణాలతో రైతులకు సంచులు ఇవ్వకుండా, వాహనాలు సమకూర్చకుండా మధ్యవర్తులు జాప్యం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బస్తా ధాన్యం రూ.1,400లకు విక్రయించేందుకు రైతులు అంగీకరిస్తే.. మధ్యవర్తులు మండపేట, సూళ్లురుపేట, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు వాహనాల్లో ధాన్యాన్ని అప్పటికప్పుడు తరలిస్తున్నారు. రోజుకు కనీసంగా 450 లారీలకుపైగా ధాన్యం ఇతర జిల్లాలకు తరలిపోతోంది. స్థానికంగా బస్తాకు రూ.1,450 ధర ఇస్తున్నారు. బస్తా ధాన్యంకు రూ.1,725 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా, రూ.1,400లకే రైతులు తె గనమ్మకుంటున్నారు.
ప్రారంభం కాని బియ్యం సేకరణ
మిల్లులకు చేరిన ధాన్యాన్ని మరపడితే లెవీ బియ్యంగా ప్రభుత్వం తీసుకుంటుంది. లెవీ బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియ ఇంకా జిల్లాలో ప్రారంభం కాలేదు. స్టేట్ వేర్‌హౌస్ గోడౌన్(ఎ్‌సడబ్ల్యూసీ)లలోనే బియ్యం నిల్వ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం తీసుకునేందుకు సర్వర్ పనిచేయడం లేదనే సాకు చూపి బియ్యం సేకరణను ఇంకా ప్రారంభించలేదు. దీంతో మిల్లర్లు అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఽధాన్యాన్ని మరపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. మిల్లర్ల వద్ద ఉన్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు తరలిస్తే, ప్రతి శనివారం ఎఫ్‌సీఐ నుంచి బియ్యం నగదుకు సంబంధించిన బిల్లులు విడుదల అవుతాయి. దీంతో రైతులకు ధాన్యం బిల్లులు చెల్లించడానికి మార్గం సుగమం అవుతుంది.
జిల్లాలో 17 మార్కెట్ యార్డులలో గోడౌన్‌లు ఉండగా, వీటిలో లక్షన్నర టన్నుల ఽధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఇక్కడ ఽధాన్యాన్ని భద్రపరచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వాలి. వాతావరణం అనుకూలంగా మారిన తర్వాత ఽధాన్యాన్ని పూర్తిస్థాయిలో ఆరబెట్టి రైతులు తమకు నచ్చిన మిల్లులకు, నచ్చిన ధరకు విక్రయించుకునే వెసులుబాటు వస్తుంది. లేదా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి, ఆ తరువాత మిల్లులకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. రైతు సేవా కేంద్రాలకు అసలు భూమి యజమానులు వచ్చి వేలిముద్రలు వేస్తేనే ధాన్యం ఆన్‌లైన్ చేస్తామనే నిబంధనలను తొలగించాలని కౌలు రైతులు కోరుతున్నారు.
1262 రకం కొనుగోళ్లలో తొండి
ప్రస్తుతం 1262 రకం ఽధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. దీనికి కారణం మాత్రం వారు చెప్పట్లేదు. వాస్తవానికి ఇవి బీపీటీ కన్నా మంచి రకం. అయినా సాకులు చెప్పి కొనుగోలు చేయడం లేదు. బీపీటీ-5204 (సోనా మసూరి) రకం బియ్యం 26 కిలోల బ్యాగును మార్కెట్‌లో కనీసంగా రూ.1,600కు కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ రకం 75 కిలోల బస్తాను రైతులు ప్రస్తుతం రూ.1400లకే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. మధ్యవర్తులు, మిల్లర్లు కూడబలుక్కుని బీపీటీ రకం ధాన్యం ధరలను ఈ సీజన్‌లో అమాంతం తగ్గించి వేశారు.
Updated Date - Nov 29 , 2024 | 03:37 AM