అసభ్య పోస్టుల కిరాయి మూకలపై చర్యలు తప్పవు!
ABN, Publish Date - Nov 29 , 2024 | 03:41 AM
డబ్బులు తీసుకుని అవతలివారిపైసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే కిరాయి మూకలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టరీత్యా నేరమైన అంశాలను సోషల్ మీడియాలో ప్రచురించిన వ్యక్తులు.. చర్యల నుంచి ఎలాంటి మినహాయింపూ కోరలేరని స్పష్టం చేసింది.
అసభ్యకర భాషతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు
వారు సోషల్ మీడియా ఉద్యమకారులు కాదు
వ్యవస్థీకృత విష ప్రచారంతో పౌరులకు నష్టం
విజయ్‌బాబు పిల్ వెనుక రాజకీయ దురుద్దేశం
హైకోర్టు ఆగ్రహం.. వ్యాజ్యం కొట్టివేత
రూ.50 వేల జరిమానా విధింపు
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించేవారికి.. అదే వేదికను వాడుకుని ఏ మాత్రం మర్యాద లేకుండా అసభ్యకరమైన భాష వాడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి.. ఓ అధికారిని లేదా వ్యక్తిని, అతడి కుటుంబ సభ్యులను అపఖ్యాతి పాల్జేసేలా దుర్భాషలాడుతూ వేధించేవారికి మధ్య కచ్చితంగా వ్యత్యాసం ఉంది.కుల, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి సమాజంలో అశాంతి సృష్టించేందుకు కూడా సోషల్ మీడియాను ఉపయోగించే అవకాశం ఉంది.
- హైకోర్టు ధర్మాసనం
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): డబ్బులు తీసుకుని అవతలివారిపైసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే కిరాయి మూకలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టరీత్యా నేరమైన అంశాలను సోషల్ మీడియాలో ప్రచురించిన వ్యక్తులు.. చర్యల నుంచి ఎలాంటి మినహాయింపూ కోరలేరని స్పష్టం చేసింది. అసభ్యకరమైన భాష వాడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులను సోషల్ మీడియా ఉద్యమకారులుగా చెప్పలేమని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు, వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోలా విజయ్‌బాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజనం వ్యాజ్యం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంచేసింది. దానిని కొట్టివేసింది. ఆయనకు రూ.50 వేల ఖర్చులు విధించింది. ఈ సొమ్మును నెలరోజుల్లోగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు జమచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఈ నెల 13న ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేసులు పెడుతూ పోలీసులు చట్టనిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, వారి చర్యలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయ్‌బాబు పిల్ వేశారు. దీనిపై ఈ నెల 13న విచారణ జరిపిన ధర్మాసనం.. పోలీసులు నమోదు చేస్తున్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అదే రోజు తీర్పు వెలువరించింది.
తీర్పులో ఏముందంటే..
‘హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించలేని అట్టడుగు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తుల తరఫున పిటిషనర్ ప్రస్తుత పిల్ దాఖలు చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఓ సమూహానికి మద్దతుగా పిటిషన్ వేశారు. ఆ పోస్టులు పెట్టినవారు ఆర్థికంగా వెనుకబడిన, అణగారినవర్గాలవారు కాదు. వారి తరఫున మరొకరు పిల్ దాఖలు చేయడానికి వీల్లేదు.
కంప్యూటర్ లేదా ఆధునిక ఫోను వినియోగించి సోషల్ మీడియాలో వ్యక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులకు తమ హ క్కుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. సమాజంలో ఏం జరుగుతోందో వాళ్లకు బాగా తెలుసు. అధికారంలో ఉన్నవారి లోటుపాట్లను వా రు విమర్శించగలరు. ప్రభుత్వ చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉంటే వాటిని సవాల్ చేసే సామర్థ్యం ఉన్న సదరు సమూహం తరఫున దాఖలు చేసిన పిల్‌కు ఏవిధంగా విచారణార్హత ఉంటుందో మాకు అర్థం కావడం లేదు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్న వ్యవస్థీకృత విష ప్రచారంతో.. చట్టాలను గౌరవించే పౌరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. చట్టరీత్యా నేరమైన అంశాలను సోషల్ మీడియాలో ప్రచురించిన వ్యక్తులు ఎలాంటి మినహాయింపూ కోరలేరు.
డబ్బులు తీసుకుని అవతలవారి మీద అసభ్యకర పోస్టులు పెట్టే కిరాయి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందే. కోర్టు ముందున్న రికార్డులను పరిశీలిస్తే ప్రస్తుత పిల్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపఽథ్యంలో దానిని కొట్టివేస్తున్నాం. పిటిషనర్‌కు రూ.50 వేల ఖర్చులు విధిస్తున్నాం. ఈ సొమ్మును నెలరోజుల్లో న్యాయసేవాధికార సంస్థకు జమచేయాలి. ఈ మొత్తాన్ని చూపు, వినికిడి శక్తిలేని పిల్లల అవసరాల కోసం వినియోగించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో నిర్దేశించింది.
Updated Date - Nov 29 , 2024 | 03:44 AM