ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : దొంగ పోలీస్‌!

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:14 AM

దొంగతనం కేసులో రికవరీ చేసిన డబ్బు, బంగారంలో నొక్కుడు... పేకాట రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడితే వాటా... పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలంటే లంచం...

  • అవినీతి పోలీసులపై ఉన్నతాధికారుల వేటు

  • రాష్ట్రంలో వరుసగా సంఘటనలు వెలుగులోకి

  • తూర్పుగోదావరిలో పేకాట సొమ్ము నొక్కేసిన

  • సీఐ, ఎస్‌ఐ, మరో ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌

  • రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడి పేరు మార్పు

  • పాకాల ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై వేటు

  • బాధితుల ఫిర్యాదుతో విచారణ, చర్యలు

  • దోపిడీ సొమ్ము, బంగారం రికవరీలో నొక్కుడు

  • ఎర్ర చందనం స్మగ్లర్‌ ఒంటిపై బంగారం స్వాహా

  • లంచం ఇస్తే అమ్మాయిని వేధించినా వదిలేస్తారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దొంగతనం కేసులో రికవరీ చేసిన డబ్బు, బంగారంలో నొక్కుడు... పేకాట రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడితే వాటా... పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలంటే లంచం... నగ్న వీడియోలు తీసి యువతిని వేధించినవారికి, రోడ్డు ప్రమాద సంఘటన నిందితులకు వత్తాసు... రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పోలీసుల తీరు ఇదీ. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే దారి తప్పుతున్నారు. రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి సంఘటనలతో పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరచూ ఎక్కడో ఒకచోట అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవడం సర్వ సాధారణం అవుతోంది. గత ఐదేళ్లూ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కంటే వైసీపీ నేతల సేవలోనే ఎక్కువగా తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థను గాడినపెడుతూ ప్రజల పక్షాన పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పాత పద్ధతిని విడనాడాలంటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరిస్తున్నా మార్పు రావట్లేదు.

  • యువతిని వేధించినా...

తన నగ్న వీడియోలు తీసి వేధిస్తున్నారంటూ ఒక యువతి ఇటీవల తెనాలి పోలీసులకు తన గోడు వెళ్లబోసుకుంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేసి ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక్కరిని మాత్రమే అరెస్టు చూపించి మిగతా ఇద్దరినీ వదిలేశారు. ఆ ఇద్దరూ బయటికి వచ్చి మళ్లీ వేధించడంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు నిందితుల నుంచి తెనాలి సీఐ సుధాకర్‌ లంచం తీసుకుని వదిలేసినట్లు విచారణలో తేలింది. వెంటనే గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెనాలి సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు.


  • పేకాటలో వాటా

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్‌లోని పెరవలి పోలీసు స్టేషన్‌ పరిధిలో అన్నవరప్పాడు వద్ద ఇటీవల కొందరు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకుని 6.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే రిమాండ్‌కు పంపినప్పుడు 55 వేలు మాత్రమే చూపించడంతో పట్టుబడ్డ వ్యక్తులు అవాక్కయ్యారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత నొక్కేసిన తమ డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గట్టిగా అడిగారు. దీంతో పోలీసులు లక్షన్నర వెనక్కి ఇచ్చేశారు. అయితే మొత్తం ఇవ్వాలని జూదరులు అడిగారు. పోలీసులు ఇవ్వకపోవడంతో జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపించిన ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌... నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్‌ఐ అప్పారావుతో పాటు రైటర్‌, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.


  • దారి దోపిడీలో నొక్కుడు

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో గత నెలలో ఓ ట్రక్‌ డ్రైవర్‌ పాతిక లక్షల దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగను అదుపులోకి తీసుకుని మొత్తం సొమ్ము రికవరీ చేశారు. అయితే అందులో ఆరున్నర లక్షలు నొక్కేసి 18.52 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్టు చూపించారు. ఇది అన్యాయమంటూ బాధితుడు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఏఎ్‌సఐ రుద్రరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ నాగబాబు, కానిస్టేబుళ్లు అరుణ్‌ కుమార్‌, శివరామకృష్ణ, సృజన్‌ కుమార్‌పై జిల్లా ఎస్పీ వేటు వేశారు.


  • సొంతానికి దొంగ బంగారం

గుంటూరులో పేరు గాంచిన ఓ బంగారం షాపులో ఆడిటింగ్‌ చేసినప్పుడు బంగారం పోయినట్లు షాపు యాజమాని గుర్తించారు. షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించగా, షాపులో పనిచేసే వ్యక్తే బంగారు వస్తువులు ఎత్తుకెళ్లినట్లు కనిపించింది. దీంతో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ విజయ్‌ చంద్ర దొంగను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు అప్పటికే కొంత బంగారం అమ్మేయగా, మిగిలిన బంగారాన్ని రికవరీ చేశారు. సీఐ అందులో కొంత పక్కన పెట్టేశారు. ఆ తర్వాత దొంగ నుంచి బంగారం కొన్న వారి నుంచి రికవరీ చేసిన దాంట్లో కూడా సీఐ మరికొంత తీసుకున్నారు. షాపు యజమాని పోలీసు పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనపై వేటు పడింది.


  • ఎర్ర స్మగ్లర్‌ నుంచి దోపిడీ

ఎర్రచందనం రవాణా చేస్తూ నెల్లూరు జిల్లా పోలీసులకు ఒక స్మగ్లర్‌ పట్టుబడ్డాడు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ‘ఏంట్రా ఎర్రబంగారం ఎత్తుకెళ్లి పుష్ప సినిమాలో హీరోలా ఒంటి నిండా బంగారు నగలు వేసుకున్నావ్‌. తీసివ్వు’ అంటూ వెంకటాచలం ఎస్‌ఐ కరీముల్లా ఏకంగా 750 గ్రాముల బంగారు చైన్లు, బ్రాస్‌లెట్‌, ఉంగరాలు లాక్కున్నారు. జైలుకు వెళ్లి బయటికి వచ్చిన తర్వాత ఆ స్మగ్లర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన ఒంటిపై నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు ఇవ్వాలని అడిగాడు. ‘బంగారు నగలు సీజ్‌ చేయలేదు. మా ఎస్‌ఐగారు ఆశపడి తీసుకున్నారు’ అని సిబ్బంది తరిమేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసు పెద్దలకు చేరడంతో విచారణ జరిపించి ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 07:14 AM