మేం తప్పుకొంటాం!
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:28 AM
‘108 అంబులెన్సులు, 104 వాహనాల నిర్వహణ మేం చేయలేం. ఆ సేవల నుంచి మేం తప్పుకొంటాం.

108లు, 104ల నిర్వహణపై చేతులెత్తేసిన ‘అరబిందో’
సెప్టెంబరులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవోకు లేఖ
2 సంస్థలకు సబ్-కాంట్రాక్ట్ ఇవ్వాలని లేఖలో సూచన
వైసీపీ పాలనలో కాంట్రాక్టు దక్కించుకుని ఇష్టారాజ్యం
ప్రభుత్వం మారగానే ఆటలు సాగవని భావించి కొత్త ఎత్తులు
అయినా.. కొనసాగిస్తూనే ఉన్న ఆరోగ్యశాఖ అధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘108 అంబులెన్సులు, 104 వాహనాల నిర్వహణ మేం చేయలేం. ఆ సేవల నుంచి మేం తప్పుకొంటాం. మా స్థానంలో ఈ రెండు సంస్థలకు సబ్-కాంట్రాక్ట్ ఇవ్వండి’ అంటూ అరబిందో సంస్థ.. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. 108లు, 104ల నిర్వహణలో అరబిందో సంస్థ పూర్తిగా విఫలమైంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోగా, వాహనల నిర్వహణను గాలికి వదిలేసింది. కనీసం వాహనాల మెయింటెనెన్స్ కూడా సక్రమంగా చేయడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన సమీక్షలో అరబిందో సంస్థ సేవలపై ముఖ్యమంత్రితోపాటు మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఆ సేవల నుంచి తమను తప్పించాలని ఆ సంస్థ స్వయంగా లేఖ రాసి 40 రోజులైనా ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆ సంస్థపై అలవిమాలిన ప్రేమ కనబరుస్తూనే ఉన్నారు. గత వైసీపీ పాలనలో ఆ సంస్థ టెండర్ దక్కించుకున్న సమయంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆ సంస్థకే కోట్ల రూపాయల టెండరును కట్టబెట్టాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టింది. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులూ నిబంధనలను తుంగలో తొక్కి మరీ టెండర్‌ను ఆ సంస్థకు కట్టబెట్టారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందనే ఉద్దేశంతో, ఇక తమకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావించి ఒకేసారి ఏడేళ్లకు టెండర్‌ను ఆ సంస్థ దక్కించుకుంది.
ఏపీఎంఎ్‌సఐడీసీ(ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) పిలిచే ఏ టెండర్ అయినా ఐదేళ్ల కాల పరిమితికి మాత్రమే ఇస్తారు. తర్వాత ఆ సంస్థ పని తీరును బట్టి ప్రభుత్వ అంగీకారంతో మరో రెండేళ్లు పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అరబిందో విషయంలో మాత్రం అడ్డగోలుగా ఒకేసారి ఏడేళ్లకు టెండర్ కట్టబెట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఇక తమ ఆటలు సాగవని భావించి.. సేవల నుంచి తప్పుకోవాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది. ఆ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు సెప్టెంబరులో లేఖ రాసింది. తమ స్థానంలో జీవీ కంపెనీ, యునైటెడ్ బి హెల్త్‌కేర్ సంస్థలకు సబ్-కాంట్రాక్ట్ ఇవ్వాలని సూచించింది. దీనికోసం ఆర్‌ఎ్‌ఫపీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) నిబంధనను లేఖలో ప్రస్తావించింది. ఆర్‌ఎ్‌ఫపీలోని క్లాజ్ 6.23.13 సీ ప్రకారం సబ్‌కాంట్రాక్టుకు ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ సమాధానం ఇవ్వలేదు. ఆ లేఖను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. అధికారులకు ఆ సంస్థతో పాత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ సంస్థపై అలవిమాలిన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. ఆ సంస్థపై ఈగను కూడా వాలనీయడం లేదు. లేఖను బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టేశారు.
లేఖ వెనుక భారీ స్కెచ్..
సేవలు చేయలేకపోతే తప్పుకోవాలి కానీ, ఎవరికి సబ్-కాంట్రాక్ట్ ఇవ్వాలో ఆ సంస్థ సూచించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక భారీ స్కేచ్ ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు మాత్రం సేవల నుంచి తప్పుకొన్నట్లు చూపిస్తూనే.. తమ సంస్థకే చెందిన కంపెనీలకు ఆ బాధ్యతలు అప్పగించేలా స్కేచ్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
జీతాలివ్వకుండా ఉద్యోగులకు నరకం...
అరబిందో సంస్థ దెబ్బకు 108 అంబులెన్స్, 104 వాహనాలు, 102(తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్) ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. ఈ మూడు పథకాల కింద వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు కొన్నేళ్ల నుంచి ఉద్యోగులకు వివిధ అలవెన్సుల కింద దాదాపు రూ.50 కోట్లను అరబిందో సంస్థ నిలిపివేసింది. దీంతో ఉద్యోగులంతా రోడ్డెక్కారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు ఇప్పటికే నిరసనలు చేస్తున్నారు. 108, 104 వాహనాల ఉద్యోగులు కూడా తాజాగా నిరసన నోటిసులు ఇచ్చారు.