Share News

AP High Court: ఐపీఎస్‌ అయి ఉండీ డబ్బు కోసం ఎలా ఒత్తిడి చేశారు

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:46 AM

స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారి పి. జాషువాను హైకోర్టు ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే దశ కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు

AP High Court: ఐపీఎస్‌ అయి ఉండీ డబ్బు కోసం ఎలా ఒత్తిడి చేశారు

  • జాషువాకు హైకోర్టు సూటి ప్రశ్నలు

  • అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ అధికారి అయి ఉండీ స్టోన్‌ క్రషర్‌ యజమానిని డబ్బుల కోసం ఎలా ఒత్తిడి చేశారని పి.జాషువాను హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలా ఎలా మారారని నిలదీసింది. ప్రాసిక్యూషన్‌ తరఫు వాదనలు వినకుండా తన నుంచి ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఆశించవద్దని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలతో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్‌ అధికారి పి.జాషువా (ఏ2) శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ఆధారంగా తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది.


పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పందిస్తూ... కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ఐపీఎస్‌ అధికారి అని, రెండు పొలిటికల్‌ గ్రూపుల మధ్య వివాదంలోకి తనను లాగారని అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... ఇదే వ్యవహారంలో నిందితులు వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్నామని గుర్తు చేశారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫు వాదనలు వినకుండా తన నుంచి ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఆశించవద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు.



Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:48 AM