AP Deputy CM : రాష్ట్రంలో సాహితీ పర్యాటకం..!
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:09 AM
రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న మాదిరిగానే సాహితీ పర్యాటకం కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
తెలుగు భాష అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడి
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న మాదిరిగానే సాహితీ పర్యాటకం కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆదివారమిక్కడ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. 35 ఏళ్ల నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. కొన్నేళ్లుగా పుస్తక మహోత్సవం నిర్వహణకు అవసరమైన స్థలం లేక ఇబ్బందులుపడుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి గొప్ప కవులు, రచయితల స్వస్థలాలు, అక్కడ వారి జ్ఞాపకాలను కాపాడడం.. వారి సాహిత్య సేవలు తెలిపే స్మారక కేంద్రాల నిర్మాణం వంటి వాటి ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చన్నారు.
మాతృ భాషపై నవతరంలోనూ, చిన్నారుల్లోనూ ప్రేమాభిమానాలు పెంచడంతో పాటు మన కవులు, రచయితల గొప్పదనాన్ని తెలియజేసేలా తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ‘వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం, కడప సి.పి.బ్రౌన్ గ్రంథాలయం లాంటి ప్రముఖ గ్రంథాలయాలు ఏపీలో ఉన్నాయి. వీటిని, కవులు, రచయితల నివాసాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయవచ్చు. ఈ అంశంపై భాషా, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించాలి’ అని చెప్పారు. ఆయన్ను కలిసినవారిలో బుక్ ఫెస్టివల్ ప్రతినిధులు టి.మనోహర్ నాయుడు, కె.లక్ష్మయ్య, గొల్లనారాయణరావు, సాందీపని ఉన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 06:09 AM