Amaravati : పోలవరానికి తొలిసారి అడ్వాన్సు!
ABN, Publish Date - Oct 11 , 2024 | 04:43 AM
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి రూ.2,424.463 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది.
రూ.2,424.46 కోట్లు ముందస్తుగా విడుదల చేసిన కేంద్రం
రాష్ట్రానికి జలశక్తి శాఖ సమాచారం ఇందులో రీయింబర్స్‌మెంట్ 76 కోట్లు
మిగతా 2,348 కోట్లు మొదటి విడత అడ్వాన్సు!
డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఇక నిధుల ఇబ్బంది లేదు
నవంబరు నుంచి శరవేగంగా పనులు వాల్ వ్యయం రూ.990 కోట్లు
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి రూ.2,424.463 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) కింద 8000 కంటింజెన్సీ ఫండ్, 00 కంటెంజెన్సీ ఫండ్, 201 అప్రాప్రియేషన్స్ ఫ్రమ్ ది కన్సాలిడెటెడ్ ఫండ్, 00 డిఫాల్ట్ ఖాతాల్లో ఈ నిధులను జమచేయాలని బుధవారం తన అకౌంట్స్ విభాగానికి ఆదేశాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేపట్టిన పనులకు గాను రూ.76.463 కోట్లను రీయింబర్స్‌మెంట్ కింద.. వచ్చే ఏడాది మార్చి 31 దాకా నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేసింది. వాస్తవానికి ఇలా అడ్వాన్సుగా నిధులు ఇచ్చే విధానం కేంద్రానికి లేదు. రాష్ట్రప్రభుత్వం తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి బిల్లులు పెడితే పరిశీలించి రీయింబర్స్ చేస్తుంటుంది.
అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ముందస్తుగా నిధులివ్వాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని అభ్యర్థించడంతో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్సు రూపంలో నిధులు మంజూరు చేసింది. వాస్తవానికి పోలవరం తొలి దశ పనులకు, భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ.12,567 కోట్లు కావాలని జలశక్తి శాఖను రాష్ట్రం కోరింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ఈ శాఖ ఆ మొత్తం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫారసులను ఈ ఏడాది మే నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఆర్థిక శాఖ పంపింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఈ మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి నెలాఖరు వరకు ఖర్చుచేయడానికి 7,218.68 కోట్లను ముందుగా విడుదల చేయాలని రాష్ట్రం కోరింది. సదరు ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మదింపు చేసి.. ఏకంగా రూ.2,276.76 కోట్లకు కోత వేసింది. 4,941.92 కోట్లకు మాత్రమే ఆమోదిస్తూ గత నెల 30వ తేదీన జలశక్తి శాఖకు పంపింది. ఇందులో ఇప్పుడు రూ.2,424.463 కోట్లను ఆ శాఖ తొలివిడతగా విడుదల చేసింది. ఇక నవంబరు నుంచి ప్రారంభించే డయాఫ్రం వాల్ పనులకు నిధుల కొరత ఉండదని జల వనరుల శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది.
అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లలో రూ.990 కోట్లు వాల్‌కు ఖర్చుచేయాలని భావిస్తోంది. కాగా.. పోలవరానికి విడుదల చేసే నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని జలశక్తి శాఖ రాష్ట్రాన్ని ఇప్పటికే ఆదేశించింది. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పోలవరాన్ని నిర్మిస్తున్నందున ప్రత్యేక అకౌంట్‌ను ప్రారంభించేందుకు సీఎ్‌సపీ నంబర్‌ను పంపాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ నంబర్‌ను పంపగానే ప్రత్యేక ఖాతా తెరవనుంది.
Updated Date - Oct 11 , 2024 | 12:17 PM