Chandrababu : ఏపీని ఆపలేరు!
ABN , Publish Date - Oct 23 , 2024 | 05:01 AM
ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోదీ.. పవన్.. నేను..
మా త్రయంతో రాష్ట్రం మున్ముందుకే: సీఎం
‘‘టెలికాం రంగంలో ప్రైవేటు పెట్టుబడులను అడ్డుకునేలా ఎన్నో ఆంక్షలు ఉండేవి. అప్పటి ప్రధాని వాజపేయితో మాట్లాడాక .. టెలికాం నియంత్రణలను చాలావరకు సడలించారు. ధీరూభాయ్ అంబానీతో మాట్లాడినప్పుడు తనకు టెలికాం రంగంలో ఏమాత్రమూ అనుభవం లేదని తెలిపారు. కానీ, ఆ తర్వాత రెండు రోజులకు ఆయనే ఫోన్ చేసి.. టెలికాం రంగంలోకి వస్తున్నట్లుగా చెప్పారు. టెలికాం రంగంలోకి రిలయన్స్ రావడంతో రివల్యూషన్ వచ్చింది. సెల్ ఫోన్ ధరలు రూ.20,000 నుంచి ఒక్కసారిగా రూ.2,000కు తగ్గాయి’’
- సీఎం చంద్రబాబు
గేమ్ చేంజర్‌గా డ్రోన్..15 రోజుల్లో పాలసీ
నాడు టెలికాం నియంత్రణల సడలింపు
ఇప్పుడు డ్రోన్ డీరెగ్యులేషన్ సాధిస్తాం
డ్రోన్‌దే భవిష్యత్.. డేటాయే సంపద..
డ్రోన్ కేపిటల్‌గా అమరావతి
తయారీకి ఓర్వకల్లులో 300 ఎకరాలిస్తాం
గతంలో ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండాలన్నా ..
ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలి
డ్రోన్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగిన అమరావతి డ్రోన్ సమ్మిట్ - 2024కు ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..చైనా, జపాన్, యూరోపియన్ దేశాల్లో యువత సంఖ్య తగ్గుతోందన్నారు. భారతదేశంలో యువత గణనీయంగా ఉండటమే ఆర్థికంగా దేశ ఎదుగుదలకు కారణమవుతుందని చెప్పారు. ‘‘రాష్ట్రాన్ని భవిష్యత్తు గేమ్ చేంజర్‌గా డ్రోన్‌లు మారుస్తాయి. అమరావతిని డ్రోన్ కేపిటల్‌గా మలుస్తాం. డ్రోన్ సమ్మిట్‌లో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి 15రోజుల్లో డ్రోన్ పాలసీ తీసుకువస్తాం. దీని సేవలు విస్తృతంగా వినియోగించుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో అనుసంధానిస్తాం. వ్యవసాయం, మౌలిక సదుపాయలు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వైద్యసేవలకు డ్రోన్‌లను వినియోగించుకునేలా పరిశోధనలు సాగాలి’’ అని సీఎం కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఆవిష్కరణలపై మోదీకి ఆసక్తి
టెలికాం డీరెగ్యులేషన్‌కు వాజపేయి కృషి
డ్రోన్ విషయంలో ఆ పాత్ర మోదీ పోషించాలి : చంద్రబాబు
ప్రధాని మోదీ ఇంగ్లీషును బాగా మాట్లాడటంతోపాటు సాంకేతికతను త్వరగా అర్థం చేసుకోగలుగుతారని సీఎం చంద్రబాబు కితాబు ఇచ్చారు. నూతన అవిష్కరణలపై ప్రధాని మోదీ ఆసక్తిని చూపుతారని కొనియాడారు. ‘‘గతంలో టెలికాం నియంత్రణను తగ్గించేందుకు నాటి ప్రధాని వాజపేయీ సహకరించారు. ఇప్పుడు డ్రోన్‌లను ఎగురవేయడంపై ఉన్న ఆంక్షలూ..నియంత్రణను ఎత్తివేసేందుకు ప్రధా ని మోదీ సహకరిస్తారనే నమ్మకం నాకుంది’’ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో డ్రోన్ వినియోగాన్ని విస్తృతపరుస్తామన్నారు. ’’ డ్రోన్‌ల ఎగురవేతపై ఆంక్షలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు ప్రయత్నించాలి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలను డ్రోన్ అకాడమీ, తయారీ, పైలట్ శిక్షణా కేంద్రాల కోసం కేటాయిస్తాం. గతంలో ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కోరాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. డ్రోన్ వినియోగంపై ఆంక్షలు సడలిస్తే .. అవి ఇంకా మరిన్ని సేవలు అందిస్తాయి’’ అని సీఎం వివరించారు.
యువకుడినైనా బాబుతో నేను పోటీ పడలేను: రామ్మోహన్
డ్రోన్ కేపిటల్‌గా అమరావతిని మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు భరోసా ఇచ్చారు. ‘‘డ్రోన్ సమ్మిట్ ఎన్నికల కోసం కాదు...యువత భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్నాం. యువకుడినైన నేను..సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనలతో పోటీ పడలేకపోతున్నాను. రాష్ట్రంలో డ్రోన్ల తయారీ రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తాం’’ అని హామీ ఇచ్చారు.
‘‘విజయవాడ వరదలప్పుడు డ్రోన్ సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచన వచ్చింది. హెలికాప్టర్ల ద్వారా ఆహారం వరద ప్రాంతాల్లో పైనుంచి కిందకు వదిలేయడంవల్ల అవి ఎక్కువగా నీటిలో పడి పాడైపోయేవి. ఎత్తులో ఉన్న భవనాలపైకి విసరాలన్నా వీలయ్యేదికాదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్లను రప్పించాం. వ్యవసాయనికి వాడే ఆ డ్రోన్‌ల సాయంతో లక్షన్నర మంది బాధితులకు ఆహారం అందించాం. డ్రోన్ల వినియోగం వ్యవసాయం, మౌలిక సదుపాయలు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర వైద్యసేవలకూ విస్తరించాలి. ఇందుకు డ్రోన్ల డీరెగ్యులేషన్ జరగాలి’’
- సీఎం చంద్రబాబు