Chandrababu: జగన్‌ను భూస్థాపితం చేస్తాం.. చీకటి పాలనను అంతం చేస్తాం: చంద్రబాబు
ABN, Publish Date - Apr 10 , 2024 | 07:16 PM
సీఎం జగన్(CM Jagan) పాలనలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేసి.. రాష్ట్రంలో చీకట్లను పారదోలుతామని స్పష్టం చేశారు.
తణుకు: సీఎం జగన్(CM Jagan) పాలనలో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేసి.. రాష్ట్రంలో చీకట్లను పారదోలుతామని స్పష్టం చేశారు. తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
"నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది.రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిశాయి. జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే. జగన్ ను భూస్థాపితం చేయడమే ప్రధాన లక్ష్యం. చీకటి పాలనను అంతం చేయడానికి ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎక్కడికి పోతాడో అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను చేసి చూపిస్తాం. 2014 నుంచి 2019వరకు ఏం జరిగిందో అర్దం చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎన్నికల్లో గెలవడానికి జగన్ ముద్దులు పెట్టారు. హగ్గులిచ్చారు. ఇప్పుడు పిడి గుద్దులు కురిపిస్తున్నారు. ఏపీలోని ప్రతి పౌరుడిని అడుగుతున్నా. అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా.. నిర్ణయించుకోండి.
దగా పథకాలు కావాలా, దోపిడి లేని పథకాలు కావాలో మహిళలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులకు కనీసం గోనెసంచులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్. జగన్ అయిదేళ్ల పాలనలో అప్పులు పెరిగాయి. ఏ ఒక్కరూ బాగుపడలేదు.
జగన్ మాత్రం బాగుపడ్డారు. అధికారం అంటే దోచుకోవడమేనని జగన్ అనుకున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే నేను, పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. అయిదేళ్ల పాలనలో మమ్మల్ని ఎన్ని ఇబ్భందులు పెట్టారో అందరికీ తెలుసు. వచ్చేనెల 13వ తేదీన మీరు ఇచ్చే తీర్పుతో తాడేపల్లిలో ఉన్న జగన్ కోట బద్ధలవ్వాలి. ఎన్నికల ముందు ఆయన ఎవరినైనా కలిశాడా. పరదాల చాటునే వెళ్ళారు. జగన్ వస్తున్నాడంటే పారిశ్రామిక వేత్తలు పారిపోతారు. నేను వస్తున్నానంటే, పారిశ్రామిక వేత్తలు తరలివస్తారు" అని బాబు అన్నారు.
Chandrababu: తాగునీటి సమస్యపై చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే
వాలంటీర్లు కంగారు వద్దు..
వాలంటీర్లను ఉద్దేశించి తణుకు సభలో బాబు మాట్లాడారు. "వాలంటీర్లు కంగారు పడవద్దు.. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. రాజీనామాలు చేయవద్దు. మీకు అండగా ఉంటాం.అవసరమయితే పది వేలు కాదు, లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. కారుమూరి రూ.840 కోట్ల టీడీఆర్ బాండ్ల పేరుతో దోచుకున్నారు. తణుకులో జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. అదే పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేస్తే, ఆయన ఎక్కడ ఉంటారో తెలీదు. ధాన్యం తడిసిపోయిందని రైతులు అంటే వారిని బూతులు తిడతారు. అలాంటి మంత్రికి రైతులు బుద్ది చెప్పాలి. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది" అని అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 10 , 2024 | 07:26 PM