‘మత్తు’ మూలాలపై దాడి!
ABN, Publish Date - Oct 02 , 2024 | 04:35 AM
జగన్ జమానాలో గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు.
ప్రత్యేక బృందాలతో హడలెత్తిస్తున్న ఉత్తరాంధ్ర పోలీసులు
వారం రోజుల్లో 1,872 కిలోల గంజాయి స్వాధీనం
పొరుగు రాష్ట్రాల స్మగ్లర్లకు సంకెళ్లు
అతి త్వరలో టోల్ ఫ్రీ నంబర్
స్మగ్లర్ల ఆచూకీ చెబితే రివార్డులు..
‘సంకల్పం’ ద్వారా జనంలో అవగాహన
విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడి
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జగన్ జమానాలో గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దాని మూలాలపై దాడులు చేస్తున్నారు. గత ఆరు వారాల్లో పలు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి తమిళనాడుకు.. మల్కన్‌గిరి నుంచి మధ్యప్రదేశ్‌కు.. విశాఖ మన్యం సరిహద్దుల నుంచి తెలంగాణకు తరలిస్తున్న వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యూహం ప్రకారం గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 17న విశాఖపట్నంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, రాష్ట్రేతర గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 27 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి డైనమిక్ వాహనాలు అందజేశారు.
14 వ్యూహాత్మక చెక్ పోస్టులు, 34 హాట్ స్పాట్‌లు, ప్రత్యేక ఎన్‌డీపీఎస్ బీట్లు ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీ వినియోగంతో పాటు లారీలు, కంటైనర్లలో దాచిన గంజాయి పసిగట్టేందుకు పోలీసు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి రంగంలోకి దించారు. సీసీ కెమెరాలు కూడా బిగించారు. కింగ్ పిన్‌ల కదలికలపై నిఘా పెట్టి అనుమానితులపై సస్పెక్ట్ షీట్లు తెరిచి ప్రజల్లో అవగాహన పెంచి మూలాల నుంచే గంజాయి మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ఐదు జిల్లాల ఎస్పీలతో మూకుమ్మడి వ్యూహ రచన చేశారు. యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ సెల్‌లు గంజాయి స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టి గస్తీ తిరుగుతున్నాయి.
ఫలితంగా ఆగస్టు నెలలో మంచి ఫలితాలు వచ్చాయి. ఆగస్టు 20-27 మధ్య ఏకంగా 1,872 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని.. తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. ఈ సరుకు విలువ రూ.94 లక్షలు ఉంటుంది. గంజాయి సాగుకు గిరిజనులను ప్రలోభపెడుతున్న బడా వ్యాపారులకు ఉచ్చుబిగించి మత్తు బారిన పడుతున్న బాలలు, యువతకు ఉపశమనం కల్పిస్తామని యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరపున రివార్డులు ఇస్తామని చెప్పారు.
డ్రగ్ వ్యతిరేక కమిటీల ’సంకల్పం’
మత్తు వదిలించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో డీఐజీ గోపీనాథ్ జెట్టి ’సంకల్పం’ పేరుతో ప్రతిజ్ఞ చేయించారు. ‘మత్తు జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లం.. గంజాయి నిర్మూలనకు సహకరిస్తాం.. పోలీసులకు సమాచారాన్ని అందిస్తాం.. మత్తు రహిత సమాజం కోసం పాటుపడతాం..’ అని వారు ప్రతినబూనారు. ఉత్తరాంధ్రలోని అన్ని విద్యాసంస్థలు, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు తదితర ప్రాంతాల్లోకి ఈ ‘సంకల్పా’న్ని తీసుకెళ్లి గంజాయి నిర్మూలనకు శక్తివంచన లేకుండా శ్రమిస్తామని జెట్టి వెల్లడించారు. గంజాయి సమాచారం కోసం ఎక్కడికక్కడ డ్రాప్ బాక్సులు పెడతామని, సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
Updated Date - Oct 02 , 2024 | 04:36 AM