Municipality: బల నిరూపణకు సిద్ధంకండి
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:28 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
వైసీపీ కార్పొరేటర్లతో మంత్రి అనగాని
టీడీపీలో చేరేందుకే సింహభాగం కార్పొరేటర్ల సుముఖత
తిరుపతి, నవంబరు22(ఆంధ్రజ్యోతి) : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బీసీ నేత అన్నా రామచంద్రయ్య, వైసీపీ సీనియర్ నేత దొడ్డారెడ్డి సిద్దారెడ్డి నేతృత్వంలో గురువారం 10 మందికి పైగా కార్పొరేటర్లు విజయవాడకు పయమైన విషయం తెలిసిందే. శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీలో ఉండలేమని, టీడీపీలోకి వచ్చేస్తామని మనసులో మాట చెప్పారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈనెల 28న సీఎం సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు తిరుపతికి వస్తున్నామని, తమ పార్టీలోని అసంతృప్తులతో మాట్లాడతానని అన్నారు. పార్టీ అధిష్ఠాన నిర్ణయం మేరకే జరుగుతుందని చెప్పారు. 29న తిరుపతిలోనే ఉంటామని, పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకోవాలని సూచించినట్టు తెలియవచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. రాబోయే పురపాలక ఎన్నికల్లో డివిజన్ల విభజన జరగనుందని, మరో 15 నుంచి 20 డివిజన్లు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల కూటమిలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని మంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లతో పాటు కొత్తగా వచ్చేవారితో 24 మంది కార్పొరేటర్లు ఉన్నారని మంత్రికి అన్నా రామచంద్రయ్య చెప్పారు.
కాగా ఎక్కువ మంది టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. మంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు పొన్నాల చంద్ర, కుడితి సుబ్రమణ్యం, పెంచలయ్య, దూది కుమారి, సీకే రవి, అన్నా అనిత, అన్నా సంధ్య తదితరులు ఉన్నట్టు సమాచారం.
Updated Date - Nov 23 , 2024 | 12:28 AM