AP News: మంత్రి లోకేశ్ చొరవ.. స్వదేశానికి చేరిన అభాగ్యురాలు..
ABN, Publish Date - Dec 28 , 2024 | 12:34 PM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. కువైట్‌కు వెళ్లిన ఆమెను మోసం చేసిన ఏజెంట్ ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఆపై చేతులు దులిపేసుకుని వెళ్లిపోయాడు.
తిరుపతి: బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి చిత్రహింసలు ఎదుర్కొన్న ఓ అభాగ్యురాలి పాలిట ఏపీ విద్యాశాఖ మంత్రి దేవుడిలా నిలిచారు. దేశం కాని దేశంలో ఆమె పడుతున్న బాధలు తెలుసుకుని మంత్రి లోకేశ్ రక్షించేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు బాధితురాలని స్వదేశానికి తీసుకువచ్చి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. దీంతో ఆ కుటుంబం మంత్రికి ధన్యవాదాలు చెబుతోంది. ఇప్పటికే విదేశాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దాదాపు 25 మందిని ఆయన తిరిగి స్వగ్రామాలకు చేర్చారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి అనే మహిళ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. కువైట్‌కు వెళ్లిన ఆమెను మోసం చేసిన ఏజెంట్ ఓ ఇంట్లో పనికి కుదిర్చాడు. ఆపై చేతులు దులిపేసుకుని వెళ్లిపోయాడు. అయితే ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ యజమానులు పని చేయాలంటూ లక్ష్మిని ఒత్తిడి చేసేవారు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ గదిలో పెట్టి కొట్టేవారు. అయితే తాను పడుతున్న చిత్రహింసలను సదరు మహిళ కుటుంబానికి తెలియజేసింది. తనను కాపాడాలంటూ వేడుకుంది. బాధిత కుటుంబం విషయాన్ని స్థానిక టీటీడీ నేతకు తెలపగా.. ఆయన వెంటనే ఎక్స్ (ట్విటర్) ద్వారా లక్ష్మి గురించి మంత్రి లోకేశ్ తెలియజేశారు. దీనికి స్పందించిన మంత్రి లోకేశ్ బాధితురాలు లక్ష్మిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆమెను దేశానికి తిరిగి తీసుకువస్తానని చెప్పారు.
మంత్రి లోకేశ్ ఇచ్చిన మాట ప్రకారం తన టీమ్‌ని రంగంలోకి దింగారు. బాధితురాలి పూర్తి వివరాలు తెలుసుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఎంబసీతో మాట్లాడి లక్ష్మీని స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బాధితురాలు ఇవాళ (శనివారం) భారత్‌కు తిరిగి వచ్చారు. కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో లక్ష్మి కుటుంబం మెుత్తం మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Dec 28 , 2024 | 12:58 PM