Navodayam: నవోదయం-2 వచ్చే నెలలో ప్రారంభం
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:16 AM
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 2016లో ‘నవోదయం’ తీసుకొచ్చింది. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి చర్యలు చేపట్టింది. అప్పట్లో ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి కూడా. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచడంతో.. నాటు సారా తెరపైకి వచ్చింది. జిల్లాలో విచ్చలవిడిగా తయారీ, అమ్మకాలు సాగాయి. వీటిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ నవోదయాన్ని అమలు చేయనుంది. వచ్చే నెలలో ‘నవోదయం-2’ ప్రారంభం కానుంది.
తిరుపతి (నేరవిభాగం), ఆంధ్రజ్యోతి: నవోదయం పథకాన్ని రాష్ట్రంలో మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సోమవారం ఎక్సైజ్ కమిషనరు, డైరెక్టర్లు జిల్లా స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కాగా, జిల్లాలో నవోదయం-2 పథకాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత శాఖ అధికారులతో సమావేశమై రానున్న మూడు నెలల్లో సారారహిత జిల్లాగా తయారు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని 12 ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో ఎక్కడెకక్కడ నాటు సారా తయారీ.. విక్రయాలు జరుగుతున్నాయనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో పుత్తూరు, నాగలాపురం, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎక్సైజ్ సర్కిళ్ళ పరిధిలోని బాగా వెనుకబడిన ప్రాంతాల్లో నాటుసారా తయారీ ఎక్కువగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. చంద్రగిరి మండలం ఎర్రావారిపాలెం, ఏర్పేడు మండలం బత్తినయ్యకాలనీ, కేవీబీ పురం మండలం, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, పుత్తూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో నాటు సారా తయారు చేస్తున్నారు. మొత్తమ్మీద ఏడు మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు ఉన్నట్లు గుర్తించారు. కేసులు, పీడీ చట్టాలకు బెదరక.. జైలుకు వెళ్లొచ్చాక కూడా సారా తయారీ, అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారు చేసి వాహనాల ట్యూబుల్లో నింపి విక్రయిస్తున్నారు.
పునరావాసంపై అధికారుల దృష్టి
నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టాలనే ఆశయంతో ప్రభుత్వం మళ్లీ నవోదయం తీసుకొస్తోంది. దీనిని వ్యాపకంగా పెట్టుకున్న దాదాపు 430 మందిని అధికారులు గుర్తించారు.
వీరికి బ్యాంకు రుణాలు అందించడం, ఆవులు కొనివ్వడం.. మహిళలైతే డ్వాక్రా గ్రూపుల్లో చేర్పించి బుట్టలు అల్లడం, సాంబ్రాని వత్తుల తయారీని నేర్పడం, టైలరింగ్, ఇలా స్థానికంగా వున్న డిమాండును బట్టి స్వయం ఉపాధి పథకాలు అందించనున్నారు. తయారీదారులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అలాగే, ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సారా వల్ల కలిగే నష్టాలను వివరించి వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నించనున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 01:16 AM