Solar : కుప్పానికి సౌర వెలుగులు
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:16 AM
కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్‌ను అమలు చేసే దిశగా ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
కుప్పం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్‌ను అమలు చేసే దిశగా ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంతోపాటు వి.కోట మండలంలోని కొన్ని పంచాయతీలు కుప్పం రెస్కో పరిధిలోకి వస్తాయి.రెస్కో పరిధిలో 1.3 లక్షల విద్యుత్తు సర్వీసులున్నాయి. యేటా రెస్కో సరఫరా చేస్తున్న విద్యుత్తుకు సంబంధించి సుమారు రూ.6.5 కోట్లు వ్యయమవుతోంది.అయితే విద్యుత్ బిల్లుల బకాయి మొత్తం రూ.1.10 కోట్లకు చేరింది. గృహ విద్యుత్తు బకాయిలు దీనికి అదనం. ఒక్క రెస్కోనే కాదు, అటు ప్రభుత్వం కూడా ఇంత పెద్దమొత్తంలో విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోతోంది.దీనికి ప్రత్నామ్యాయంగా సంప్రదాయేతర విద్యుత్తు సరఫరాపై ప్రణాళిక సిద్ధం చేసింది.కుప్పం డివిజన్‌లో సోలార్ విద్యుత్తు సరఫరాను పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి, సాధ్యాసాధ్యాలను, లాభనష్టాలను అంచనావేసి తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలనుకుంటోంది. అందుకనే నెల రోజులుగా కుప్పంలో విద్యుత్తు గృహ, ప్రభుత్వ, వ్యవసాయ విద్యుత్తు సర్వీసులపై సర్వే జరిగింది. ఆయా సర్వీసుల పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ అవసరం ఉంటుందో, ఎంత విద్యుత్తు ఉత్పత్తికి అనువైన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేసింది. సుమారు 70 వేల గృహ, ప్రభుత్వ కార్యాలయ విద్యుత్తు సర్వీసులకు సోలరైజేషన్ అవసరమవుతుందని అంచనా వేశారు. అలాగే వ్యవసాయ సర్వీసులను కూడా సోలరైజేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుపై ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు శుక్రవారం రెస్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెస్కో ఎండీ సోమశేఖర్‌తోపాటు ఏడీఈ మదన్‌మోహన్, ఇతర డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్న ఈ సమీక్షలో పూర్తయిన సర్వేపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
దీనిపై అమరావతిలో ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరుగనున్న సమావేశానికి కడా పీడీ వికాస్ మర్మత్‌తోపాటు సీఎండీ సంతోషరావు కూడా హాజరు కానున్నారు. సర్వే వివరాలను వీరు ముఖ్యమంత్రికి,ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి, సోలరైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టనుంది. దీనిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదిస్తే నెల రోజుల్లోనే కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్ అమలు ప్రారంభం కానుందని చెప్పారు. ఇందువల్ల విద్యుత్తు నష్టాలు తగ్గడంతోపాటు వినియోగదారులే స్వయంగా అదనపు విద్యుత్తును ఎస్పీడీసీఎల్‌కు విక్రయించే అకాశం లభిస్తుందని, తద్వారా వారి విద్యుత్తు బిల్లులు కూడా తగ్గి ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుందని తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 12:16 AM