CM Chandrababu : తీరం.. అభివృద్ధి హారం
ABN, Publish Date - Nov 28 , 2024 | 03:11 AM
సముద్ర తీర ప్రాంత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 నాటికి జీఎ్‌సడీపీలో 15 శాతం వృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు.
ప్రపంచ స్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఏపీ
సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు
2029 నాటికి జీఎ్‌సడీపీలో 15 శాతం వృద్ధి
సముద్ర తీరం ఆధారంగా సమగ్రాభివృద్ధికి చర్యలు
తీరంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి
పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అపార అవకాశాలు
పీపీపీ విధానంలో కమర్షియల్ పోర్టుల నిర్మాణం
ఆలయ పర్యాటకానికి ప్రత్యేక కార్యాచరణ
వాటర్‌వే్‌సకు ప్రోత్సాహకాలు.. మారిటైమ్ వర్సిటీ స్థాపన
రాష్ట్ర మారిటైమ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చ.. ఆమోదం
తవ్వకం చార్జీలే తీసుకోవాలి.. ఇసుకపై సీఎం ఆదేశం
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సముద్ర తీర ప్రాంత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 నాటికి జీఎ్‌సడీపీలో 15 శాతం వృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని సమగ్ర ఆర్థికాభివృద్ధి చర్యలు చేపట్టాల్సి ఉందని, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మారిటైమ్‌లో సుస్థిర అభివృద్ధి సాధనే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆలయ పర్యాటకానికి ప్రత్యేక కార్యాచరణ అమలుతోపాటు వాటర్‌వే్‌సకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం 2024-29 మారిటైమ్ పాలసీపై సీఎం సమీక్షించారు. ఈ పాలసీని వచ్చే నెల 4న కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు.
సరుకు రవాణాలో 16 శాతం వాటా
‘రాష్ట్రంలోని పోర్టుల కార్గో హ్యాండ్లింగ్(సరుకు రవాణా)లో 16శాతం వాటా నమోదయింది. జీఎ్‌సడీపీలో 2024-25లో రూ. 15.89 లక్షల కోట్ల వాటా ఉంటుంది. చేపలు, రొయ్యల ఎగుమతుల్లో 2023-24లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాం. వైజాగ్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సముద్ర ఆధారిత వాణిజ్యంలో మెరుగైన అవకాశాలున్నాయి. 2029 నాటికి రాష్ట్రాన్ని సముద్ర రంగంలో అత్యున్నత స్థానంలో నిలిపేలా కార్యాచరణ రూపొందించి మారిటైమ్ రంగంలోకి వీలైనంత పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీని అమలు చేయాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా 2029 నాటికి 15 శాతం స్థూల రాష్ట్ర ఉత్పత్తితో.. అత్యున్నత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యాలు నిర్దేశించుకుని ఆమేరకు ఫలితాలు సాధించాలి.
రాష్ట్రంలో నౌకాశ్రయాల ద్వారా సరుకు రవాణాను విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయి. పోర్టుల టెర్మినల్ అభివృద్ధి, పోర్టు సమీప ప్రాంతాల అభివృద్ధి, మారిటైమ్ అనుబంధ వాణిజ్యం అభివృద్ధి, షిప్‌యార్డ్ క్లస్టర్ అభివృద్ధి లక్ష్యంగా.. ఓడరేవుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పోర్ట్ హబ్ ఎకానమీపై దృష్టి పెట్టాలి. పరిశ్రమలకు అనువైన.. అవసరమైన పోర్టుల అభివృద్ధిపై పాఠ్యాంశాలను రూపొందించాలి.
సముద్రయాన రవాణాకు సంబంధించి పరిశోధన, శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి. విశాఖపట్నంలోని మేజర్ ఓడరేవుతో పాటు, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్‌వాటర్, రవ్వ, కృష్ణపట్నం.. ఓడరేవుల వినియోగంపైనా పూర్తి దృష్టి సారించాలి. మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ ఓడరేవులను త్వరగా పూర్తి చేయాలి. ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీఐఐసీ సమన్వయంతో మారిటైమ్ అభివృద్ధికి పని చేయాలి’ అని సీఎం ఆదేశించారు.
Updated Date - Nov 28 , 2024 | 03:12 AM